శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 18, 2020 , 04:50:52

గులాబీ జెండా రెపరెపలాడాలి

గులాబీ జెండా రెపరెపలాడాలికలెక్టరేట్‌ : ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడేలా నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలోని 3వ, 8వ, 9వ వార్డుల్లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు లైశెట్టి భిక్షపతి, ఒడ్డపల్లి లక్ష్మి, ఎరుకల కల్పన రమేశ్‌ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పథకాల ప్రచార కరపత్రాలను అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ..  నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో  అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఇంటిని కదిలించినా సీఎం కేసీఆర్‌ ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటూ అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తున్నారని చెబుతున్నారన్నారు. ఇన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి తామంతా అండగా ఉండి కారుకు ఓటేసి గెలిపిస్తామని భరోసా కల్పిస్తున్నారన్నారు. ప్రజలు, ఓటర్ల చైతన్యాన్ని చూస్తుంటే పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36 వార్డులు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని 15 వార్డులు టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిచి తీరుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో  పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారుకు ఓటువేసి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులయ్యే..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలం చందపల్లి (15వవార్డు)కు చెందిన బత్తుల కనుకయ్య కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వారంతా టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరుతున్నారని అన్నారు. తెలంగాణ బిడ్డలుగా టీఆర్‌ఎస్‌లో ఉండడం గౌరవంగా గర్వంగా భావించి టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యుడు హబీబ్‌ ఉర్‌ రెహమాన్‌, మాజీ వైస్‌ ఎంపీపీ దాసరి చంద్రారెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రావు, రాజన్న, ఆవుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

అలాగే, పెద్దపల్లి పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మైనార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికి ఎమ్మెల్యే దాసరి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు షాకీర్‌, ఆరీఫ్‌, సమీర్‌, సుమేర్‌, ఇస్మాయిల్‌, హాయెద్‌, అక్బర్‌, కమర్‌, షేక్‌ షరీఫ్‌ తదితరులు టీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు హమీద్‌, డాక్టర్‌ అజీజ్‌, ముస్తాక్‌ పాల్గొన్నారు.


logo