మంగళవారం 07 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 17, 2020 , 00:34:35

అక్షరోద్యమం!

అక్షరోద్యమం!
  • -జ్ఞాన తెలంగాణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
  • -వచ్చే జనాభా లెక్కల నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ముందుకు
  • -వచ్చే జనాభా లెక్కల నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ముందుకు

కమాన్‌పూర్‌: ‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రంతో పాటు దేశం పురోభివృద్ధి సాధిస్తుంది’ అని మహనీయులు చెబుతుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత పెంపుకోసం ఎప్పటి నుంచో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా, ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. 1980లో మొదటిసారిగా వయోజన విద్య పథకాన్ని ప్రవేశపెట్టగా, 1990లో అక్షర భారతి, నిరంతర విద్యా కేంద్రాలు, 2009 నుంచి సాక్షర భారత్‌ పథకాలు కొనసాగాయి. అయినా నిరక్షరాస్యుల శాతం మాత్రం తగ్గలేదు. ఇంకా గ్రామాల్లో, పట్టణాల్లో నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2021 లక్ష్యంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే అమలుకు విధివిధానాలు ప్రకటించనుండగా, ఆదేశాలు ఎప్పుడొచ్చినా మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో 33,435 మంది నిరక్షరాస్యులు..

ఈచ్‌వన్‌ - టీచ్‌ వన్‌ లో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించే బాధ్యతను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 2 నుంచి 10 వరకు నిర్వహించిన పల్లె ప్రగతిలో  పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో, అటు మున్సిపాల్టీలో సర్వే చేపట్టి, జిల్లాలోని 265 పంచాయతీలు, మున్సిపాల్టీలో సర్వే చేపట్టి, 33,435 మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. ఇందులో ఇందులో 10,926 మంది పురుషులు, 22,503 మంది మహిళలు, ఇతరులు ఆరుగురు ఉన్నట్లు నిర్ధారించారు. సర్వే ప్రక్రియ పూర్తయిన తదుపరి ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు సంబంధించి ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో.. ఎవరినీ భాగస్వాములు చేయాలి.. విధివిధానాలు ప్రకటించగానే అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

త్వరలోనే అమలు..

2021 జనాభా లెక్కలకు ముందే రాష్ట్రంలో మరింత అక్షరాస్యత శాతం పెంపొందించడమే కాకుండా నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించేలా చేపట్టిన ఈచ్‌వన్‌ - టీచ్‌వన్‌ త్వరలోనే అమలుకాబోతున్నది. గ్రామ పంచాయతీల వారీగా ప్రతి అక్షరాస్యుడు మరో నిరక్షరాస్యుడికి చదు వు చెప్పడం కార్యక్రమ ఉద్దేశం కాగా, ఇందులో పూర్తిగా పాఠశాల, కళాశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేయాల ని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యావంతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా దీన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులకు ప్రాజెక్ట్‌ వర్క్‌ కింద దీన్ని చేర్చాలని యోచిస్తున్నట్లు సమాచారం కాగా, కార్యక్రమ విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించగానే జిల్లా లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.logo