బుధవారం 08 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 15, 2020 , 03:33:21

బరిలో 622 మంది..

బరిలో 622 మంది..
  • - ముగిసిన నామినేషన్ల ఉపసహంరణ
  • - తేలిన అభ్యర్థుల లెక్క
  • - పెద్దపల్లిలో రెండు వార్డులు ఏకగ్రీవం
  • - రామగుండంలో 50 వార్డులకు అత్యధికంగా 355 మంది పోటీ
  • - పెద్దపల్లిలో 34వార్డులకు 156 మంది..
  • - సుల్తానాబాద్‌లో 61, మంథనిలో 50 మంది..
  • - అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
  • - ఇక పట్టణాల్లో హోరెత్తనున్న ప్రచారం
  • - వేడెక్కిన రాజకీయ వాతావరణం

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి జిల్లాలోని మూడు మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ బరిలో 622 మంది నిలిచారు. జిల్లాలోని 50 వార్డులు, 64 వార్డులకు 1058 మంది 1158 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 622మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రామగుండం కార్పోరేషన్‌లోని 50డివిజన్లకు 615మంది నామినేషన్లు వేయగా, ఉపసంహరణ తర్వాత 355మంది బరిలో నిలిచారు. పెద్దపల్లిలో 36వార్డులకు 226మంది నామినేషన్లు వేయగా, ఉపసంహరణ ఇక్కడ 156మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే రెండు వార్డులు ఏకగ్రీవమై, టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడగా, 34 వార్డులకే ఎన్నికలు జరుగనున్నాయి. ఇక మంథని మున్సిపాల్టీ పరిధిలోని 13వార్డులకు 110నామినేషన్లు వేయగా, ఉపసంహరణ తర్వాత 50మంది బరిలో నిలిచారు. అలాగే సుల్తానాబాద్‌లో 15వార్డులకు 107మంది నామినేషన్లు వేయగా, ఉపసంహరణ తర్వాత 61మంది బరిలో మిగిలారు. 

రామగుండం కార్పొరేషన్‌లో..

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని మొత్తం 50డివిజన్లకు 615మంది నామినేషన్లు వేయగా, 144మంది ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 355మంది నిలిచారు. ఇందులో టీఆర్‌ఎస్‌ 50మంది, సీపీఐ 15మంది, కాంగ్రెస్‌ 49మంది, బీజేపీ 45మంది, ఎంఐఎం 4, టీడీపీ 11, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి 43, మన తెలంగాణ రాష్ట్ర సమితి 1, స్వతంత్రులు 133మంది పోటీలో నిలిచారు. 

పెద్దపల్లి మున్సిపాల్టీలో..

పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని 36వార్డులకు గాను రెండు వార్డులు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ 34వార్డులకు ఎన్నికలను నిర్వహించనున్నారు. పెద్దపల్లిలో 226నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 69 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ 34వార్డులకు 156మంది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి 34, కాంగ్రెస్‌ 28, బీజేపీ 22, ఎంఐఎం 6, సీపీఐ 2, ఇతర పార్టీలు, స్వతంత్రులు 64మంది ఎన్నికల పోటీలో ఉన్నారు.

సుల్తానాబాద్‌ మున్సిపాల్టీలో..

సుల్తానాబాద్‌లోని మొత్తం 15వార్డులకు 107మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా 46మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ 61మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ నుంచి 15, టీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 9, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2, స్వతంత్రులు 20మంది బరిలో ఉన్నారు.

మంథని మున్సిపాల్టీలో..

మంథని మున్సిపాల్టీ పరిధిలోని మొత్తం 13వార్డులకు 110మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 60మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.  దీంతో ఇక్కడ 50మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి 13వార్డులకు 13మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీజేపీ నుంచి 8మంది, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 2, స్వతంత్రులు 14మంది పోటీలో నిలిచారు. logo