శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Jan 15, 2020 , 03:32:34

టీఆర్‌ఎస్‌ గెలిస్తే మరింత అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ గెలిస్తే మరింత అభివృద్ధి


మంథనిటౌన్‌ : ఎన్నికల సమయంలో ఓటును అమ్ముకుని ఆగం కాకుండా, ప్రజాసేవ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తమ ఓటేవేసి అభివృద్ధికి సహకరించాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు కోరారు. టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి పుట్ట శైలజ, 7వ వార్డు అభ్యర్థు గర్రెపల్లి సత్యనారాయణ, 10వ వార్డు అభ్యర్థి శ్రీపతి బానయ్యలతో కలిసి మంగళవారం ఉస్మాన్‌పుర, నాయిబ్రాహ్మణ, రజక, ఎరుకలగూడెంలలో పుట్ట మధు పర్యటిస్తూ ప్రజలను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను మరోసారి మభ్య పెట్టేందుకు బెదిరించి దోచుకున్న డబ్బులను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చికెన్‌, మద్యం, కేక్‌లు పంపిణీ చేశారనీ, ఇలాంటి వారు వందలు ఖర్చు పెట్టి విలువైన ఓట్లు వేయించుకొని ఐదేళ్ల పాటు లక్షలాది రూపాయల అక్రమార్జన కోసం తిరిగి మళ్లీ ప్రజలనే బెదిరించే ప్రమాదముందన్నారు. మంథని ప్రజలను ఇలాంటి బెదిరింపులకు కాపాడే గొప్ప అవకాశం 7వ వార్డు ప్రజలకు వచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని వారంతా సద్వినియోగం చేసుకొని అలాంటి వారికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ఓటు వేసే ముందు మంచి ఏదో, చెడు ఏదో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే తాను ప్రజలకు ఏ పని చేయలేని స్థితిలో ఉన్నానని అంటున్నాడనీ, అలాంటిది మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ప్రతిపక్ష పార్టీల వారు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ప్రజలకు ఏది చేయాలన్నా సాధ్యపడుతుందన్నారు.

ఇందుకు నిదర్శనమే తాను ఎమ్మెల్యే, పుట్ట శైలజ సర్పంచ్‌గా మంథని పట్టణంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను గెలిపిస్తే మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలందరికీ మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా అందించడానికి వీలు కలుగుతుందన్నారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి పుట్ట శైలజ మాట్లాడుతూ.. మంథని పట్టణంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది టీఆర్‌ఎస్‌ పార్టీతోనేనన్నారు. తాను సర్పంచ్‌గా ఐదేళ్ల పాటు అన్ని వార్డుల ప్రజలకు కనీస వసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్‌ లైన్లు, కమ్యూనిటీ హాల్‌లు, రెండు పూటల తాగునీరు లాంటి సదుపాయాలను కల్పించామన్నారు. ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి అవకాశమిస్తే మంథని పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు, మహిళలకు వివిధ అంశాల్లో స్వయం ఉపాధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఎక్కటి అనంతరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏగోలపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, ఆకుల కిరణ్‌, ఆలీబేగ్‌, బాబా, ఎస్‌కే. యాకుబ్‌, తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ మండలాధ్యక్షుడు..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ పేర్కొన్నారు. మంథని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బోయిని నారాయణ తన అనుచరులతో కలిసి పుట్ట మధు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నారాయణకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పిన మధు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై బోయిని నారాయణ, ఆయన సతీమణి బోయిని సునీత, పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు గులాబీ గుటూకి చేరడం హర్షనీయమన్నారు. ఇంకా చాలా మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రజాసేవకుడిగా పేరున్న బోయిని నారాయణకు టీఆర్‌ఎస్‌ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎక్కటి అనంతరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త శ్రీనివాస్‌, ఏగోలపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, ఆకుల కిరణ్‌, బత్తుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం, దొంతులవాడ(భగత్‌నగర్‌)లోని శ్రీ చెన్నపర్వతాల మల్లన్న స్వామి ఆలయంలో నిర్వహించిన బోనాల వేడుకలో పుట్ట మధు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.