సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 15, 2020 , 03:31:55

అభివృద్ధిని కాంక్షించి కలిసి రావాలి

అభివృద్ధిని కాంక్షించి కలిసి రావాలి


కలెక్టరేట్‌ : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంక్షించేవారంతా టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు దేశెట్టి మహేందర్‌ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల ఫలాలు అనుభవిస్తున్న వారంతా కారు గుర్తును గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలతో పాటు పట్టణాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. తెలంగాణ బిడ్డలుగా టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రస్తుతం జరుగనున్న పురపాలక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ జెండాను ఎగరేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీగిరి శ్రీనివాస్‌, ఐల రమేశ్‌, గాజుల రాయమల్లు, సాజిద్‌, సత్యనారాయణ, దొడ్ల శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గులాబీ జెండా ఎగరవేయాలి..

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కష్టపడి అన్ని సీట్లు సాధించి పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యే దాసరి సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ప్రస్తుతమున్న ప్రచార సమయాన్ని వృధా చేయకుండా వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీలు బండారి స్రవంతి, బాలాజీరావు, నాయకులు బండారి శ్రీనివాస్‌గౌడ్‌, హమీద్‌, మార్కు లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.logo