సోమవారం 06 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 13, 2020 , 03:51:00

గులాబీ భేరి

గులాబీ భేరి

టీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. సమయం దగ్గరపడుతుండడంతో గులాబీ సేన జనంతో మమేకమవుతున్నది. ప్రతి ఒక్కరినీ కలుస్తూ, పార్టీ ఐదున్నరేళ్లలో చేసింది చెబుతూ..

  • జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రచారం షురూ n ఇంటింటికీ వెళ్లి పలకరింపు.. ఓట్ల అభ్యర్థన n గులాబీ గూటిలోకి వలసలు
  • జిల్లా కేంద్రంలో కలియదిరిగిన దాసరి మనోహర్‌రెడ్డి n భారీగా బీజేపీ నాయకులకు పార్టీలోకి ఆహ్వానం
  • మంథనిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పుట్ట శైలజ విస్తృత పర్యటన n ఓటేయాలని విజ్ఞప్తి
  • ఆయా పట్టణాల్లో జనంతోనే మమేకమైన అభ్యర్థులు, పార్టీ శ్రేణులు

టీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. సమయం దగ్గరపడుతుండడంతో గులాబీ సేన జనంతో మమేకమవుతున్నది. ప్రతి ఒక్కరినీ కలుస్తూ, పార్టీ ఐదున్నరేళ్లలో చేసింది చెబుతూ.. మున్ముందు చేయబోయేది వివరిస్తూ ఉత్సాహంగా కదులుతున్నది. ఆదివారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4, 21వ వార్డుల్లో ఇంటింటా ఓట్లు అభ్యర్థించడంతోపాటు సాయంత్రం పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులకు కండువాలు కప్పారు. అటు మంథనిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పుట్ట శైలజ విస్తృత పర్యటన చేశారు. గడపగడపనూ తట్టి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా పట్టణాల్లో పార్టీ అభ్యర్థులు కలియదిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.   - పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ): నిన్న మొన్నటి వరకూ నామినేషన్ల దాఖలులో తలమునకలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆదివారం ఎన్నికల శంకారావాన్ని పూరించారు. మున్సిపోల్స్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళుతూ ఓట్లు అభ్యర్థించడంతోపాటు ఐదున్నరేళ్లలో చేసిన పనులను వివరిస్తూ, మున్ముందు చేయబోయే పనుల గురించి చెబుతూ ముందుకుసాగుతున్నారు. ఈ నెల 6నుంచే రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 3, 4వ డివిజన్‌లలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించగా, తాజాగా ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని శాంతినగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పట్టణంలోని 2, 3, 4, 21వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. వార్డుల్లో కలియదిరగడంతోపాటు నేరుగా ఓటర్లను కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న, చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అలాగే జిల్లా కేంద్రంలోని దాసరి నివాసంలో   ఆదివారం 18వ వార్డుకు చెందిన పలువురు బీజేపీ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి ఎమ్మెల్యే దాసరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు గరిగంటి సత్తయ్యతోపాటు పలువురు నాయకులు పార్టీలో చేరారు. అలాగే మంథని మున్సిపాల్టీ పరిధిలోని 2వ వార్డులో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పుట్ట శైలజ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రజలను ఓట్లు అడిగారు. తాను మంథని మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న సమయంలో మంథనిలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అటు రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్పీడు పెంచారు. అలాగే జిల్లాలోని మున్సిపాల్టీల పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. వాడ వాడలా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారాల హోరుతో పట్టణాలు గులాబీ రంగును పులుముకుంటున్నాయి.  


logo