ఆదివారం 29 మార్చి 2020
Peddapalli - Jan 13, 2020 , 03:50:04

అభివృద్ధే మా లక్ష్యం

అభివృద్ధే  మా లక్ష్యం

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. భూగర్భ గనులు, సింగరేణి సిరులు, తలాపున నిండు గోదావరి జలాలతో వ్యవసాయ ఆధారిత మంథని నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

  • మంథని, రామగుండాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతాం
  • జిల్లా నేతలతో హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌
  • అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వేర్వేరుగా వినతి
  • సానుకూలంగా స్పందించిన అమాత్యుడు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. భూగర్భ గనులు, సింగరేణి సిరులు, తలాపున నిండు గోదావరి జలాలతో వ్యవసాయ ఆధారిత మంథని నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆదివారం మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి జిల్లా పరిషత్‌ పుట్ట మధూకర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మంథనిలోని  శ్రీమహాలక్ష్మి దేవాలయం, గౌతమి తీరంలోని శ్రీ గౌతమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు గోదావరి తీరంలో పర్యాటకుల కోసం బోటింగ్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని వనరులను ఉపయోగించి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 100 కిలోమీటర్ల మేరకు పారుతున్న గోదావరి జలాలను నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.


మంథనిని రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  నియోజకవర్గానికి అవసరమైన మౌళిక సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్‌కు జడ్పీ చైర్మన్‌ వివరించగా, త్వరలో పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రామగుండం సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలనీ, ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే విధం గా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన చర్చించారు. రామగుండంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రీయల్‌ పార్కును త్వరితగతిన ఏర్పాటు చేయాలని, తద్వారా నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరుతుందన్నారు. ముఖ్యంగా రామగుండంను మోడల్‌ సిటీగా మార్చేందుకు తగినన్నీ నిధులు ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించి రామగుండం అభివృద్ధికి తప్పకుండా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే చందర్‌కు తెలిపారు. 


logo