శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 12, 2020 , 03:26:24

ఆడబిడ్డలకే అందలం

ఆడబిడ్డలకే  అందలం
  • -జిల్లాలో పెద్దపల్లి, మంథని బల్దియా పీఠాలు వారికే
  • -‘జనరల్‌ మహిళ’లకే అధ్యక్ష స్థానాలు
  • -సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో గెలుపు నిర్ణేతా..‘ఆమె’
  • -సర్వత్రా చర్చనీయాంశం

(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

జిల్లాల్లోని ఒక కార్పొరేషన్‌, మూడు బల్దియా ల్లో రెండు పీఠాలు మహిళలకే రిజర్వ్‌ అయ్యా యి. పెద్దపల్లి, మంథని స్థానాలు జనరల్‌ మహిళకు కేటాయించారు. రెండు స్థానాల్లో మహిళే మహారాణులయ్యే అవకాశం రావడంతో ఆయా బల్దియాల పరిధిలోని ముఖ్యనేతలు, ప్రముఖులు తమ సతీమణులను రంగంలోకి దింపా రు. ముందుగా జనరల్‌ అవకాశం దక్కుతుందని భావించి పోరుకు సిద్ధమైన పలువురు నేతలు, తీరా మహిళలకు రిజర్వ్‌ కావడంతో వెంటనే తమ సతీమణులను పోటీకి దించా రు. వార్డు స్థానాలతో పాటు అధ్యక్ష స్థానాలపై కన్నేసి ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకు నే పనిలో పడ్డారు.

అన్ని వర్గాలకూ ప్రాధాన్యం..

జిలాల్లోని ఒక కార్పొరేషన్‌, మూడు బల్దియాల్లో అందరికీ ప్రాధాన్యం ఇచ్చారు. రామగుండం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా, పెద్దపల్లి, మంథని జనరల్‌ మహిళలకు, సుల్తానాబాద్‌ బీసీ జనరల్‌కు దక్కడంతో ఆయా వర్గాల్లో ఆనం దం వ్యక్తమవుతున్నది. సుల్తానాబాద్‌, మంథనిలో మున్సిపల్‌ ఎన్నికలు తొలిసారి జరుగుతుండగా, ఆశావహుల సంఖ్య తక్కువే ఉన్నా అన్ని స్థానాలూ జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ కావడంతో ఆయా వర్గాల వారు ఉత్సాహంగా రం గంలోకి దిగారు. ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతూ  ఎలాగైనా పురపోరులో నిలిచి గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. రిజర్వేషన్లు కలిసొచ్చినవారు ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తూ  తమకు అనుకూలంగా పని చేయాలని వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులను సైతం కలిసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ముఖ్యనేతల నోట ‘చైర్‌పర్సన్‌ పీఠం మీదే’ అనిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల తరఫున రంగంలోకి దిగిన వారిలోనూ పలువురు ‘అధ్యక్ష పీఠం అభ్యర్థి నేనే’ అని ప్రచారం చేసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల వేడి మరింత రాజుకునే అవకాశం కనిపిస్తున్నది. 

రెండు చోట్ల గెలుపు నిర్ణేతలు మహిళలే

జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు  2,39,511 మంది ఉండగా, వీరిలో 1,21,438మంది పురుషులు, 1,18,066 మంది మహిళలు ఉన్న ట్లు అధికారులు ప్రకటించారు. అయితే కొత్తగా ఏర్పడ్డ మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాల్టీల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కన ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాల్టీ పరిధిలోని 15,167 మంది ఓటర్లుండగా, వీరిలో 7,636మంది మహిళలు, 7,530మంది పురుషులు ఉన్నారు. అలాగే మంథని మున్సిపాల్టీ పరిధిలోని 13వార్డుల్లో మొత్తం 12,754మంది ఓటర్లుండగా, ఇందులో మహిళలు 6,498మంది, పురుషులు 6,256మంది ఉన్నారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో గెలుపు నిర్ణేతలు కూడా వీరే కానున్నట్లు స్పష్టమవుతున్నది. కాబట్టి ఆశావహులు సైతం ఆడబిడ్డల ప్రసన్నం కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.


logo