గురువారం 02 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 09, 2020 , 17:15:58

లక్ష్యసాధనకు కృషి చేయాలి

లక్ష్యసాధనకు కృషి చేయాలి

- ప్రభుత్వ విప్‌ భానుప్రసాదరావు,
- విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించాలి
- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో వందశాతం అక్షరాస్యత లక్ష్య సాధన దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ టి. భానుప్రసాదరావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలో వెంకటపద్మ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ, అక్షరాస్యతలో సైతం అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సంవత్సరం సందర్భంగా ‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌' కార్యక్రమాన్ని ప్రకటించా రనీ, దానిని విజయవంతం చేయాలని గుర్తు చేశా రు. అక్షరాస్యత పెంపునకు జిల్లా స్థాయిలో విద్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించా రు. అనంతరం జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ, బాలికల ఆత్మరక్షణకు కలరిపయ్యట్టు అనే యుద్ధకళలో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. కొన్ని ప్రభు త్వ పాఠశాలల్లో నీటి సమస్య, ప్రహరీ సమస్యలు ఉన్నాయని, వీటిపై నివేదిక తెప్పించుకొని జిల్లాస్థాయిలో అందుబాటులో ఉన్న నిధులతో మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు విజయవంతం చేసేందుకు వారికి స్నాక్స్‌ ఏర్పాటు చేయాలనీ, దాతల నుంచి నిధులు సేకరించి అమలు చేయాలని కోరారు. హెచ్‌ఎంలు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించాలనీ, వ్యక్తిత్వ వికాసం, పర్యావరణం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సమృద్ధిగా నీరు..
కాళేశ్వరంలాంటి మహాత్తరమైన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామనీ, ఎస్సారెస్పీలో సైతం నీరు సమృద్ధిగా ఉందని మధుకర్‌ పేర్కొన్నారు. దీంతో చివరి ఆయకట్టు వరకు పూర్తి స్థాయిలో సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో ఆన్‌ ఆఫ్‌ సిస్టమ్‌ ద్వారా వీలైనంత వరకు చెరువులు నింపాలన్నారు. హుస్సేన్‌మియా వాగుపై సైతం 4 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందనీ, దీనికి సంబంధించి ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రబీ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామనీ, 10,440 మెట్రిక్‌ టన్నులు నిల్వ చేసుకొని సరఫరా చేస్తున్నామనీ, 2,397 క్వింటాళ్ల వరి, 155 క్వింటాళ్ల శనగ, 4.50 క్వింటాళ్ల వేరుశనగ, 3 క్వింటాళ్ల మినుమ విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేస్తామని వెల్లడించారు. ఖరీప్‌లో రైతుబంధు పథకం కింద 1,12,000 మంది రైతుల ఖాతాలో 122.73 కోట్లు పంపిణీ చేశామనీ, రైతు బీమా పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 409 మందికి 15.95 కోట్లు పంపిణీ చేశామని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద 66,511 మంది రైతులకు 13.30 కోట్లు అం దించామని తెలిపారు.

జిల్లాలో డీఎంఎఫ్‌టీ నిధులు అందుబాటులో ఉన్నా.. స్త్రీ శక్తి, కమ్యూనిటీ భవనాల నిర్మాణ ప్రక్రియ టెండర్లు ముగిసినా ప్రారంభం కావడం లేదని, నిధులు నిరుపయోగంగా ఉంటున్నాయని, వాటిని వెంటనే ప్రారంభించాలని జడ్పీ చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ కింద 436 ఆవాసాలకు బల్క్‌ నీటి సరఫరా చేస్తున్నామని, 280 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించామని, 1870 కిలోమీటర్ల పైపులైన్‌ పనులు, 1,47,000 నల్లా కనెక్షన్లు అందించామని, 240 గ్రామాల్లో ఇంట్రా విలేజ్‌ పనులు పూర్తి చేసి నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. లీకేజీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్‌ పనిచేస్తున్న సమయంలో లోయర్‌ మానే రు డ్యాం నుంచి సిద్దిపేటకు నీళ్లు అందించాలనే ఉద్దేశ్యంతోనే స్కీంకు రూపకల్పన చేశారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అనేక రకాల కార్యక్రమాలు యావత్‌ దేశానికే స్పూర్తిగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుక, జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo