e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ కంది మొక్కలు నాటుదాం

కంది మొక్కలు నాటుదాం

కంది మొక్కలు నాటుదాం

సాగులో నాటు వేసే పద్ధతి
ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడిపైనే రాక
పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ
ఆదర్శంగా నిలుస్తున్న రమణారెడ్డి
తోటి కర్షకులూ ఆసక్తి

ధర్మారం, జూలై 16 :సాధారణంగా కంది ఎలా సాగు చేస్తారు? నేలను చదును చేసి దుక్కి దున్నుతారు. సాళ్ల వెంట గింజలు విత్తుతారు. కానీ, సాయంపేట రైతు రమణారెడ్డి ఆధునిక పద్ధతిలో ముందుకుసాగుతున్నాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. తన వ్యవసాయ బావి వద్ద నర్సరీ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. నిర్ణీత పొడవు పెరిగాక క్షేత్రంలో నాటుతూ రెండింతల దిగుబడి సాధిస్తున్నాడు. సాధారణ పద్ధతితో పోలిస్తే ఖర్చు తక్కువ.. అధిక లాభాలు వస్తుండడంతో ఏడాదిగా ఇదే విధానంలో వేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వెల్మ రమణారెడ్డిది వ్యవసాయ కుటుంబం. గ్రామంలో ఐదెకరాల భూమి ఉంది. అదనంగా మరికొందరి వద్ద భూమి కౌలుకు తీసుకొని వివిధ రకాల పంటలు వేస్తుంటాడు. అయితే చాలా ఏళ్లుగా కంది, పత్తి వేస్తున్నాడు. అయితే కొన్నేళ్లుగా కందిలో ఆశించిన దిగుబడులు రాక నష్టాలపాలయ్యాడు. అధిక దిగుబడులు సాధనకు ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నాయా..? అని అన్వేషించాడు. స్థానిక ఏఈవో రాంచంద్రంను సంప్రదించాడు. దీనికి చక్కటి పరిష్కారం నాటు వేసే పద్ధతే అని చెప్పడంతో ఆసక్తిచూపాడు. అప్పటికే జగిత్యాల జిల్లా రాయికల్‌ శివారులోని రాజ్‌నగర్‌లో ఓ రైతు కొలంబో రకం విత్తనాలతో నర్సరీ పద్ధతిలో సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలుసుకున్నాడు.

- Advertisement -

రైతులు మూస పద్ధతిలోనే కంది వేస్తున్నారు. సాళ్లలో విత్తనాలు చల్లుతూ సాగు చేస్తున్నారు. మందులు, ఎరువుల ద్వారా పెట్టుబడుల ఖర్చు ఎక్కువవుతుంది. అలాగే మొక్కల మధ్య ఎడం లేకపోవడంతో చీడ పీడలు వెంటనే ఆశిస్తుంటాయి. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. కానీ, నాటే పద్ధతి వల్ల గణనీయమైన దిగుబడి వస్తుంది. మొక్క మొక్కకూ 3 ఫీట్ల దూరం ఉండడం వల్ల కొమ్మలు విస్తరించి, సూర్యరశ్మి పడి బాగా పెరుగుతాయి. అలాగే మొక్కలు పెంచే సమయంలోనే వర్మి కంపోస్టు వేసినందుకు పెద్దగా ఎరువులు, పురుగుల మందులు కొట్టాల్సిన పని ఉండదు. మొక్కలు పెట్టిన తర్వాత పూత సమయంలో పురుగు ఆశించకుండా వేపనూనె పిచికారీ చేస్తే చాలు. ఈ సాగు విధానంలో పెద్దగా పెట్టుబడి కూడా ఉండదు. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

మొక్కల పెంపకం..
నాటు వేసే పద్ధతి గురించి తెలుసుకున్న రమణారెడ్డి రాజ్‌నగర్‌ వెళ్లి సదరు రైతు నుంచి కొలంబో రకం విత్తనాలు కిలో కొనుక్కొని వచ్చాడు. తన వ్యవసాయ బావి వద్ద నర్సరీ ఏర్పాటు చేసుకున్నాడు. కవర్‌కు రెండు విత్తనాల చొప్పున వేసి, వర్మి కంపోస్టు నింపి 600 మొక్కలు నీడ పట్టున పెంచాడు. 33 రోజుల్లోనే మొక్కలు పెరిగి, నాటేందుకు సిద్ధమయ్యాయి.

ప్రయోగాత్మకం సక్సెస్‌..
రమణారెడ్డి వివిధ రకాల పంటలు వేయడంతోపాటు 25 గుంటల్లో ప్రయోగాత్మకంగా నాటు పద్ధతిలో కంది సాగుచేపట్టాడు. మొదట భూమిలో 6 ఫీట్ల వెడల్పుతో నాగలితో సాళ్లను దున్నించి మొక్క మొక్కకూ 3 ఫీట్ల దూరం ఉండేలా నాటించగా, అనుకున్నట్టుగా చెట్లు ఏపుగా ఎదిగాయి. కొమ్మలు విరిగేలా విరగ కాత కాసింది. ఎలాంటి చీడ పీడలు లేకుండా పంట దక్కడమే కాదు సాధారణ రకంతో పోలిస్తే అధిక దిగుబడి సాధించాడు.

రెండింతల లాభం వచ్చింది..
మా డీఏవో, ఏఈవో సూచనతో నాటు వేసే పద్ధతిలో కంది సాగు చేస్తున్న. సాధారణ రకంతో పోలిస్తే పెట్టుబడి తక్కువ. లాభాలు అధికంగా ఉన్నయి. నేను 25 గుంటల భూమిలో సాగు చేసిన. 4.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇది సాధారణ పద్ధతి కంటే రెండు రెట్లు ఎక్కువ. సుమారు 27 వేల ఆదాయం వచ్చింది.

  • వెల్మ రమణా రెడ్డి, రైతు (సాయంపేట)

ఇది మేలైన పద్ధతి..
సాధారణ రకంతో పోలిస్తే నాటు వేసే పద్ధతితో కంది సాగులో అధిక లాభాలు ఉంటాయి. కానీ, రైతులు మూస పద్ధతిలో సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. అదే నాటు పద్ధతిని ఎంచుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. ఇది వరకు గోపాల్‌రావుపేటలో ఓ రైతు సాగు చేయగా మంచి దిగుబడి వచ్చింది. ఇప్పుడు రమణారెడ్డితో చేయించాం. మంచిఫలితాలు వచ్చాయి.

  • ఆశోద రాంచంద్రం, ఏఈవో సాయంపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కంది మొక్కలు నాటుదాం
కంది మొక్కలు నాటుదాం
కంది మొక్కలు నాటుదాం

ట్రెండింగ్‌

Advertisement