e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఎడిట్‌ పేజీ వైద్య రంగంలో సేవా జ్యోతి

వైద్య రంగంలో సేవా జ్యోతి

వైద్య రంగంలో సేవా జ్యోతి

ఒక్కరి ప్రాణాన్ని కాపాడితే హీరో అంటారు.

అదే వంద మంది ప్రాణాలను కాపాడితే నర్సు అంటారు. అప్పుడే జన్మించిన పసిపాపనుంచి.., చివరిశ్వాస వదిలిన వ్యక్తి కళ్ళు మూసేది నర్సు. జీవితం ప్రారంభానికి, ముగింపునకు సాక్ష్యం నర్సు. ఎవరు చేయలేనిది చేసేది, సహనంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని సేవలందించేది నర్సు.

నర్సు వృత్తి ఆవిర్భావానికీ, వృత్తి గౌరవానికి ప్రతీక ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌. చికిత్స సమయంలో నర్సుగా ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు, వైద్యరంగానికి వన్నెతెచ్చింది. నర్సు వృత్తికి మూలకారణమైన ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌ జన్మదినమైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌ ఇటలీలో 1820 మే 12న జన్మించారు. ఈమెను ‘ఆధునిక నర్సింగ్‌ వ్యవస్థాపకురాలిగా’, మార్గదర్శిగా పేర్కొంటారు.

క్రిమియన్‌ యుద్ధం సందర్భంగా1854లో 38 మంది నర్సుల బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది. మరణాల రేటును చాలా తగ్గించగలిగింది. ఇందులో ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలించింది. రాత్రనక, పగలనకా గాయపడిన సైనికులకు సేవలందించటంలో నైటింగేల్‌ ముందుండేది. రాత్రి సమయాల్లో కూడా క్షతగాత్రులకు సేవలందించేందుకు దీపం పట్టుకుని శిబిరాల్లో తిరేగేది. అందుకే ఆమెకు ‘లేడీ విత్‌ ది ల్యాంప్‌’ అని పేరు వచ్చింది.

నైటింగేల్‌ 1858లో రాయల్‌ స్టాటిటికల్‌ సొసైటీలో మొదటి మహిళా సభ్యురాలయ్యారు. నైటింగేల్‌ 1860 లో లండన్‌లోని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌లో ఆధునిక నర్సింగ్‌ స్కూల్‌ను స్థాపించారు. నర్సింగ్‌ రంగానికి విశేషమైన సేవలందించారు. ఆమె ‘Notes on Nur -sing’ అనే పుస్తకాన్ని రాశారు. ఇప్పటికీ ఆ పుస్తకం నర్సింగ్‌ విద్యార్థులకు, వృత్తికి ‘గైడ్‌’గా, ‘హ్యాండ్‌ బుక్‌’ గా పరిగణిస్తారు.

ఆరోగ్యం అనేది మానవహక్కు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధి సెకండ్‌ వేవ్‌ సమయంలో నర్సులు చేస్తున్న సేవలు ఎనలేనివి. కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉన్నా వృత్తినే దైవంగా భావించి విధులు నిర్వహించడం ఎంతో త్యాగపూరితమైనది. రోగులకు అన్నివిధాల స్వస్థత చేకూర్చేదీ, నిజమైన చికిత్స అందించేదీ నర్సు మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే నర్సే వైద్యరంగానికి వెన్నెముక. ఇంతటి త్యాగపూరితమైన, నిబద్ధమైన వృత్తిని కొనసాగిస్తూ లక్షల మంది ప్రాణాలు నిలుపుతున్న నర్సుల రుణం ఈ సమాజం ఏమిచ్చినా తీర్చుకోలేనిది.

గత ఏడాది కరోనా మొదటి దశ వ్యాప్తి సందర్భంలో.. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా నర్సుల సేవలను అభినందిస్తూ వారిపై హెలీకాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు చాటుకున్నాం. వైరస్‌ బాధితులకు సేవలందించే క్రమంలో ప్రపంచంలో నేటివరకు 2710 మందికి పైగా, మన దేశంలో 116 మంది నర్సు లు కరోనా బారిన పడి చనిపోవడం బాధాకరం. ప్రాణాలకు తెగించి వృత్తిధర్మాన్ని నిర్వహిస్తున్న నర్సులకు జేజేలు.

నర్సులు ప్రపంచవ్యాప్తంగా అనేక వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధిక పని ఒత్తిడి, తక్కువ వేతనాలు తదితర సమస్యలు కుంగదీస్తున్నాయి. రోగులకు సేవ చేసే క్రమంలో వారు కూడా వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయి. వైద్యరంగంలో ఎంతో ప్రాధాన్యమున్న నర్సు వృత్తికి తగిన గౌరవం, ప్రోత్సాహం లేకపోవటం విషాదం. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగానైనా నర్సుల సమస్యల పరిష్కారానికి అన్నివిధాలుగా కృషి జరుగాలి.

వైద్య రంగంలో సేవా జ్యోతిశివరాజం బొట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైద్య రంగంలో సేవా జ్యోతి

ట్రెండింగ్‌

Advertisement