అమెరికాలో పుట్టిపెరిగిన నా మనుమడితో నా కూతురు, అల్లుడు తెలుగులోనే మాట్లాడుతున్నా మూడో ఏడు వచ్చేసరికి వాడికి ఆంగ్లం బాగా వచ్చింది. ఐదవ ఏట బడిలో చేరినాక ఆంగ్లం పెరుగుదల కొనసాగింది. తెలుగు కనుమరుగు అయ్యింది. నా తల తిరిగినంత పనైంది. ఆరా తీస్తే.. వాడు రెండవ ఏట నుంచే ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కార్టూన్లు చూడటం మొదలెట్టాడు. కార్లూన్లే వాడికి ఆంగ్లం నేర్పాయి.
తెలుగునాట ముప్పై ఏండ్లలోపు ఉన్న ఈ జనరేషన్ పిల్లలకు తెలుగు చదవటం, రాయటం రాదు. వారికి బడిలో లేదు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో లేదు. మనం ఈ లోపాన్ని పూరించాలి. ఈ దారిలో ముందుగా గూగులమ్మకు తెలుగు నేర్పాలి అన్నది గమనించాం. పిల్లలను వారికి కావలసిన గూటికి తీసుకుపోయేది గూగులమ్మే కదా! ఈ విషయం అర్థం అయ్యాక వీవెన్ గారు గూగులమ్మకు పాఠం నేర్పే పద్ధతిని సూచించారు. ఒకరిద్దరితో ఈ పని ముగియదు. ఎంతో మంది తగిన మాటలను వెతికి సూచిస్తూ పోవాలి. మీరు గమనించి ఉంటారు.. ‘అప్లోడ్’ చేయండి అని ఒక చోట ఉంటుంది. దాని బదులు ‘ఎత్తండి’ లేక ‘ఎత్తు’ అనవచ్చు. ఎత్తటం, దింపటం మనం బాగా వాడే పదాలే. మీకు ఎక్కడైనా సరైన తెలుగు పదాలు తెలియకపోతే.. బంగారు నాణేలు వాగమి(డిక్షనరి)ద్వారా telugukootami.org లో పట్టుకోవచ్చు. లేకపోతే ఈ జట్టులో పెట్టినా మన తెలుగు అభిమానులు తగిన మాటలను సూచిస్తారు.
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు, ప్రతి ఉద్యోగానికి నిర్వహించే పోటీ పరీక్షలను తెలుగులోనే నిర్వహించాలి. పాఠశాల, కళాశాలల్లో తెలుగును తప్పనిసరిగా నేర్పాలి. ఇతర రాష్ర్టాల్లో ఉన్న తెలుగు వారికి, విద్యార్థులకు తెలుగు చదివే వీలు కలిగించాలి. అన్ని రాష్ర్టాల్లో కనుమరుగవుతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎనపు (ఉద్యమం)లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.