e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ గడ్డి కోసం అరిగోస..

గడ్డి కోసం అరిగోస..

గడ్డి కోసం అరిగోస..

‘సూసినవా..? అంత పెద్ద రోగం వానిగ్గూడ అంటుకుంటదేమోనని భయపడ్డడేమో. మరి కరోనా అచ్చిపోయినంకనన్న మందలిచ్చిపోవద్దా మీ తమ్ముడు’ అని మా అక్కనెక్కడ తప్పువడ్తడోనని మా స్వామిరెడ్డి బావను మందలియ్యడానికి లచ్చింపురం వోయిన. ఇక్కన్నా, అక్కన్నా.. పట్నం నుంచి కన్నారమే పట్టాంత దూరమంటే, ఆ కన్నారం నుంచి లచ్చింపురం మళ్లో ఇరువై కిలోమీటర్లు. ఎగిలివారంగ బస్సెక్కి బైలెల్లితే లచ్చింపురంల కాలు వెట్టేసరికి పదకొండు గొట్టింది. లతక్క ‘రార తమ్మీ.. రా’ అని నీళ్ల బకీట వాకిట్ల వెట్టింది. కాళ్లు కడుక్కొని ఇంట్లకు వోంగనే ‘మంచిగున్నవా బావ’ అని మందలిచ్చిన. నా మొకం చూసిన బావకు కొండంత ధైర్నమొచ్చింది. గడె సేపు కరోనా ముచ్చట్లు వెట్టంగనే.. ‘ఇగ రావోయి, గీడిదాకా పొయ్యొద్దాం’ అని సైగ చేసిండు.

బండి మీద ఎనుక కూసున్న. ఆ బండి లచ్చింపురం దాటి, ఎగురెల్లి తాళ్లల్లకు వోతుందని అర్థమైంది. వేడి గాలులు ఇసిరిసిరి కొడ్తున్నయి మొకాన. కొంచెం దూరంపోతే కానీ తెల్వలే ఓ పొలం అంటుకున్నదని. మంటలు ఎగిరెగిరి మండుతున్నయి. రోడ్డు మీన్నే బండాపి ఆ మంటల కాడికుర్కినం. అవి అనుకోకుండా అంటుకున్న మంటలు కాదని, అంటివెట్టిన మంటలని అప్పుడర్థమైంది. అక్కడ, ఆ మంటల్ని సూసుకుంటా ఓ నలుగురైదుగురు రైతులున్నరు. మంటల్ని ఆర్పుదామని ఎంత కసితోని వోయినమో, వాళ్లను సూసినంక అంతే బాధతో మళ్లా బండికాడికి మల్గినం.

ఎగురెల్లి గౌడ్‌సాబ్‌ నేరెళ్ల శంకరయ్య ఒక దమ్ము అం పిండో లేదో కల్లు, బావ కండ్లు ఎర్రగైనయి. అప్పటిదాకా ఉశారుగున్న బావ మొకం చిన్నగైంది. ‘ఏమైంది బావ?’ అన్న. ఆయన బాధంతా లచ్చింపురం దాటినంక తలగవడిపోతున్న వరిగడ్డి మీదనే. బావకు లచ్చింపురం కాన్నే ఓ మూడెకరాల భూముంటది. ఆ మనిషికి ఎద్దూ, ఎవుసం తప్పా వేరే ఏం తెలువది. దొడ్డి, దొడ్లె బర్లే ఆయన లోకం. ఒక్కసారి చిన్నతనానికి వొయ్యి గొడ్డూ గోదాతో తన యాదంతా చెప్పుకొచ్చిండు.

‘నా చిన్నతనాన కాలంగాక రైతులు గోసవడేది. రైతుల గోస పక్కనవెడితే రైతుకున్న గొడ్డు గోదా గోసనైతే చెప్పవశం గాదు. ఏడాదికొక్క పసలు కూడా పండకపోయేది వరి. ఏం పండినా ఆరుతడి పంటలే. రైతులకు తిండికి గోసయితే, పశువులకు దాణాకు గోసయ్యేది. ఎద్దులేని ఎవుసం పేరుకొస్తదా? అందుకే రైతున్న ఇంట్ల జత ఎడ్లు, ఓ పాలిచ్చే బర్రె పక్కా ఉండేది. ఎడ్లు లేని రైతుకు నలుగు రిట్ల చిన్నతనమే కదా? అందుకే గడ్డికి ఎంత గోసైనా మా ఇంట్ల ఎప్పుడూ రెండు ఎడ్లు, నాలుగు బర్లు ఉండేటియి. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఏ ఊరికివోయినా పొద్దుగూకేసరికి ఇంటికి చేరాల్సిందే, పశువులకు మేతెయ్యాల్సిందే. ఓయేడు కాలంగాక రెండు పసళ్లు వరి నాటెయ్యలే. గడ్డికి కరువై మెలుక్కరావడానికి వేరే ఊరికి పోవాల్సచ్చింది. ఉత్తగ మెలుక్కచ్చే అరిగడ్డికి వేల కర్సయింది. కర్సయితది గదా అని నోరు లేని జీవాలను ఆకలికి సంపుతమా?

ఓ పదేండ్ల కింద వానలు వడక కరువొచ్చింది. గడ్డామ్‌ కరిగిపోయి నేలకానింది. పొద్దూకి ఏద్దామంటే బర్లకు గడ్డి లేదు. చేతిల ఓ లుంగి, కొడలి వట్టుకొని పొద్దుగాల్నే బైటికివోతే పొద్దూకి ఆరు గొట్టినా ఎడ్ల కొట్టం కాడికి వోలె. ఓ ఇరువై కిలో మీటర్లు తిరిగితే కానీ దొరకలేదు మోపెడు గడ్డి. గొడ్లు ఎంత మొత్తుకుంటున్నయోనని ఆగమాగం పొయ్యేసరికి రాత్రి ఎనిమిదైంది. ‘అంబా.. అంబా..’ అని మొత్తుకుంటున్న ఎడ్లు, బర్లు నన్ను సూడంగనే కంటినిండా నీళ్లు తీసినయి (బావ కంటిపొంటి కూడా నీరు కారుతనే ఉంది.) వాటి ఏడ్పు సూడలేక ఆ గడ్డిని ఎడ్లకు, బర్లకు పంచిన. అవి తిన్నంక నీళ్ల సూపి ఇంటికచ్చిన. మళ్లా రేపు గడ్డి కోసం ఏడికివోవుడోనని రాత్రి నిద్రవడితే ఒట్టు. అమ్మతోని చెప్తే ‘ఎవ్వలకన్న అమ్మురా, బర్లను ఎడ్లను.. వాటిని తిండికి సంపితే మనకు పాపం తాక్తదని’ ఏడ్సుకుంటా చెప్పింది. ఎంత కట్టపడ్డా మంచిదే గనీ ఎడ్లను మాత్రం అమ్మా అన్న.

ఎడ్లు గోస పడొద్దని ఏన్నోకాడ ఎంక్లాడేది వరిగడ్డి. అమ్మమ్మొల్లకు కొంచెం నీళ్ల సౌలత్‌ ఎక్కువనే ఉండేది. అందుకే వాళ్లు వరి ఎక్కువనే ఏసేది. ఇగ వాళ్ల పొలాల కోత మొదలైందని తెల్వంగనే ఎడ్ల కొట్టం కాడ జమైన పెంటను వాళ్లింటికి జారకొట్టేది. అదే ఎడ్ల బండిల మళ్లా ఇటురాంగ వరిగడ్డి మెలుక్కొచ్చేది.

ఇప్పుడు పరిస్థితిల మస్తు మార్పొచ్చింది! ఏ ఊరికి వోయి సూసినా చెరువులు నిండు కుండ లెక్కనే కనవడ్తున్నయి, ఏ బాయిల సూసినా పాతాళంల కనిపించే నీళ్లు, ఇప్పుడు చెంబుతోని ముంచుకతాగేటట్టు కనిపిస్తున్నయి. ఇగ రైతు ఎందుకుట్టిగుంటడు. ఒక్క పసలు కూడా భూమిని బీడుంచుతలేడు. అందరూ వరి నాట్లేస్తున్నరు. అట్లా మన తెలంగాణల ఏడజూసినా భూమి పచ్చ చీర కట్టుకొనే కనిపిస్తున్నది. అందుకే పుష్కలమైన గడ్డి కనవడ్తున్నది.

ఏ రైతూ గడ్డి కోసం ఊరు దాటే పరిస్థితి లేదు. ఒకప్పుడు గడ్డి దొరక్క ఇబ్బందులు వడ్డ రైతులు ఇప్పుడు వరిగడ్డి ఎక్కువయ్యేసరికి ఏంజేయాల్నో అర్థం గాక, ఇట్లా పొలంలనే తలగవెడ్తున్నరు.

నా వరకస్తే.. గడ్డికి అగ్గివెట్టింది నా జీవితంల లేదు. నాకున్న భూమిల మొత్తం వరే ఏస్తా.. దాణా కోసం కొట్టం కాన్నే ఓ ఐదారు ట్రిప్పుల వరిగడ్డి అడ్మాసుంటది. మిగిలిన గడ్డిని ఉన్న మూడెకురాలల్ల పరుస్తా. ఎట్లాగూ నీళ్లు పుష్కలమేగా? మడికట్లు నిండేదాక నీళ్లు వెట్టి ఓ ఐదారు బత్తాల యూరియా సల్లి వారం రోజులు ముర్గవెడ్తా. ఆ తర్వాత దున్ని, మళ్లా నాటేస్తే మంచి పంటొస్తది. వడ్లు తర్రవోవు. చానమందికి ఈ విషయం తెల్వక పొలంలనే గడ్డిని తలగవెడ్తరు. అట్లా తలగవెడ్తే భూ సారం దెబ్బతింటది. భూమి లోపల ఉన్న ఎర్రలు సచ్చిపోతయి..’

బావ గతం చెప్పేసరికి గుండె చెరువైం ది. కంట్లె నీళ్లూరినయి. కల్లు కుండ ఖాళీ అయ్యింది. ‘లేవోయ్‌ మనకోడి కూర కూలవడ్డదేమోనని’ లేపితే మళ్లా ఇంటిమొకాన వోయినం.

గడ్డి కోసం అరిగోస..గడ్డం సతీష్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడ్డి కోసం అరిగోస..

ట్రెండింగ్‌

Advertisement