e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home ఎడిట్‌ పేజీ కరోనా టీకాలకు పేటెంట్‌ కళ్లెమా?

కరోనా టీకాలకు పేటెంట్‌ కళ్లెమా?

కరోనా టీకాలకు పేటెంట్‌ కళ్లెమా?

మానవాళి మీద విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌కు ఎటువంటి సరిహద్దులు లేవు. ఎటువంటి అడ్డుగోడలు లేవు. ఎప్పటికప్పుడు కొత్త రూపాలను, కొత్త శక్తిసామర్థ్యాలను సంతరించుకుంటూ మానవసమాజం మీద యుద్ధం చేస్తున్నది. మరి, ఆ వైరస్‌ను ఎదుర్కొనే మనం సరిహద్దులలో గిరి గీసుకుంటే విజయం సాధించటం సాధ్యమవుతుందా? అందుకే, ఈ విభజనరేఖలను దాటుకొని కలిసికట్టుగా పోరాడాలని పలు దేశాలు ముందుకొస్తున్నాయి.

కరోనా కట్టడికోసం టీకాలపై పేటెంట్‌ హక్కులను తొలగించాలని పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనివల్లే, ప్రపంచంలోని అన్ని దేశాలకు ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు కరోనా టీకాలను అందుబాటులోకి తీసుకురావటం వీలవుతుందని చెబుతున్నాయి. కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్న ఈ సమయంలో ‘పేటెంట్ల రద్దు’ అనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ అంశాన్ని ప్రపంచం ముందు చర్చకు పెట్టింది మన దేశమే.

గత ఏడాది అక్టోబర్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్‌ ఒక ప్రతిపాదన చేసింది. కొవిడ్‌-19 వైరస్‌ను అడ్డుకోవటానికి, ఆ వైరస్‌ సోకినవారికి చికిత్స చేయటానికి సంబంధించిన అంశాలకు ట్రిప్స్‌ ఒప్పందం వర్తించకుండా సభ్యదేశాలు ఒక ఏకాభిప్రాయానికి రావాలన్నదే ఆ ప్రతిపాదన. ‘ట్రేడ్‌ రిలేటెడ్‌ ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌’ (ట్రిప్స్‌) ఒప్పందం 1995 జనవరిలో అమల్లోకి వచ్చింది. పేటెంట్‌ హక్కులను పరిరక్షించే ఒప్పందం ఇది. కరోనా అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ ట్రిప్స్‌ ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనపెడితే, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోలేని, పెద్ద మొత్తం వెచ్చించి కొనలేని అనేక పేద, వర్ధమానదేశాలకు మేలు జరగుతుందని భారత్‌ ప్రతిపాదించింది. దక్షిణాఫ్రికా కూడా ముందుకురావటంతో ఈ ప్రతిపాదనను ఇరుదేశాలు (భారత్‌, దక్షిణాఫ్రికా) కలిసి డబ్ల్యూటీఓ ముందు ఉంచాయి. ఇప్పటికి 120కిపైగా దేశాలు దీనికి మద్దతు పలికాయి. అయితే, డబ్ల్యూటీఓలోని మొత్తం 164 సభ్యదేశాలు అంగీకరిస్తేనే ఏ ప్రతిపాదన అయినా అమలులోకి వస్తుంది.

పేటెంట్ల రద్దు అంశంపై డబ్ల్యూటీఓలో అమెరికా సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ నెల 5న ఆమోదం తెలిపింది. అమెరికాలోని ఔషధ తయారీ కంపెనీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. పేటెంట్ల రద్దు వల్ల కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి, పేద వర్ధమాన దేశాలకు టీకాలు చవక ధరలో అందుబాటులోకి వస్తాయన్న వాదన ఆచరణయోగ్యంగా లేదని ఆ కంపెనీలు పేర్కొన్నాయి. దీనివల్ల అంతిమంగా అమెరికా నష్టపోయి, చైనా లాభపడుతుందని హెచ్చరించాయి. ప్రపంచదేశాలను ఆదుకోవాలనుకుంటే, టీకాలను ఆయాదేశాలకు అందుబాటులోకి తీసుకొచ్చే పంపిణీ, సరఫరా అంశాలపై దృష్టి పెట్టటం మంచిదని, పేటెంట్లను తొలగిస్తే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తాము తయారుచేసిన వ్యాక్సిన్లపై తమకు భారీ నష్టాలు వస్తాయని చెప్పాయి. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కూడా ఈ వాదననే బలపర్చారు. కానీ, బైడెన్‌ కృతనిశ్చయంతో పేటెంట్ల తాత్కాలిక రద్దుకు తాము అంగీకరిస్తామని చెప్పారు. ఈ విధంగా భారత్‌, దక్షిణాఫ్రికా సంయుక్త ప్రతిపాదనకు మద్దతిస్తూ అమెరికా ముందుకురావటం ఒక కీలక పరిణామం. అయితే, ఇక్కడితోనే ఈ కథ సుఖాంతం కాలేదు.

డబ్ల్యూటీఓలో యూరప్‌ దేశాలు కూడా ముఖ్యమైనవి. కరోనా వ్యాక్సిన్లను తయారుచేసి, ఉత్పత్తి చేస్తున్న పలు కంపెనీలు యూరప్‌ దేశాలవే. పేటెంట్ల తాత్కాలిక రద్దు అంశంపై యూరప్‌ దేశాల అభిప్రాయం కీలకమైనది. ఈ ప్రతిపాదనపై యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ) చర్చలను కొనసాగిస్తున్నది. అయితే, ఇప్పటికే కొన్ని యూరప్‌ దేశాల అధినేతలు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం.. పేటెంట్ల రద్దుకు ఈయూ అంత సానుకూలంగా లేదని తెలుస్తున్నది. ‘పేటెంట్లను రద్దు చేస్తాం. టీకాలను ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రపంచంలోని ల్యాబొరేటరీలకు అనుమతినిస్తాం. కానీ, వాటికి ఆ టీకాలను ఎలా ఉత్పత్తి చేయాలో తెలియదు. అటువంటప్పుడు అవి రేపటికల్లా టీకాలను ఉత్పత్తి చేయలేవు’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించారు. స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్‌ కూడా అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, (పేద, వర్ధమాన దేశాలకు టీకాలను అందించటంలో) ఇది మాత్రమే సరిపోదని, చేయాల్సింది చాలా ఉందని అన్నారు. అమెరికా ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా, తమ అవసరాలకు మించిన టీకాలను నిలువ చేయడం, ముడిపదార్థాల ఎగుమతులపైన కూడా నిషేధం విధించటాన్ని ఈయూ దేశాలు ఎత్తి చూపుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్లను ప్రపంచదేశాలకు అందించాలనే సదాశయమే కనుక అమెరికాకు ఉంటే గిరి గీసుకొని ఎందుకు కూర్చుంటున్నదని యూరప్‌ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. తాము మాత్రం పలు దేశాలకు పెద్ద ఎత్తున టీకాలను ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈయూ దేశాలు తమలో తాము దాదాపు 20 కోట్ల టీకాలను పంపిణీ చేసుకోగా, మరో 20 కోట్ల టీకాలను ఈయూ యేతర దేశాలకు ఎగుమతి చేశాయి.

డబ్ల్యూటీఓలో మరో కీలక సభ్యదేశమైన చైనా కూడా భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు మద్దతిస్తున్నామని ప్రకటించింది. కానీ, తమ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్‌ హక్కులను వదులుకోవటానికి సిద్ధమేనా అన్న మీడియా ప్రశ్నకు మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పలేదు. దానిపై ఆలోచిస్తామంటూ దాటవేసింది. ఈ విధంగా.. సరిహద్దులు లేకుండా మానవాళిపై దాడి చేస్తున్న కరోనా వైరస్‌పై సరిహద్దులను అధిగమించి పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ప్రపంచం గుర్తించినప్పటికీ, దానివల్ల ఎవరికి ఎంత లాభం? ఎంత నష్టం? అన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరి, ఈ లెక్కల్లోంచి బయటపడి, వైరస్‌కు దీటుగా అన్నిదేశాలు ఒక్కటై నిలబడేదెప్పుడో?

సరిహద్దులు లేకుండా మానవాళిపై దాడి చేస్తున్న కరోనా వైరస్‌పై సరిహద్దులను అధిగమించి పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ప్రపంచం గుర్తించినప్పటికీ, దానివల్ల ఎవరికి ఎంత లాభం? ఎంత నష్టం? అన్న లెక్కలు వేసుకుంటున్నాయి. మరి, ఈ లెక్కల్లోంచి బయటపడి, వైరస్‌కు దీటుగా అన్నిదేశాలు ఒక్కటై నిలబడేదెప్పుడో?

కరోనా టీకాలకు పేటెంట్‌ కళ్లెమా?కె.వి.రవికుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా టీకాలకు పేటెంట్‌ కళ్లెమా?

ట్రెండింగ్‌

Advertisement