e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home ఎడిట్‌ పేజీ అనివార్యంగా మారిన లాక్‌డౌన్‌

అనివార్యంగా మారిన లాక్‌డౌన్‌

అనివార్యంగా మారిన లాక్‌డౌన్‌

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా చెలరేగిపోతూ వేల మంది ఉసురు తీస్తున్న సమయంలో దేశంలోని అనేక రాష్ర్టాలు దాదాపు పదహారు నుంచి ఇరవై గంటల లాక్‌డౌన్‌ ను విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి. సంపూర్ణ లాక్‌ డౌన్‌ అనేది కొవిడ్‌ నియంత్రణకు సరైన పరిష్కారమా కాదా అని విశ్లేషిస్తే రెండు వైపులా సమర్థనలు, వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి.

గత సంవత్సరం లాక్‌ డౌన్‌ కారణంగా వలస కార్మికులు అనుభవించిన కష్టాలు, కడగండ్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ వైపు వెంటనే మొగ్గు చూపలేదు. స్వీయ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ప్రభుత్వ సలహాలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా భౌతిక దూరాన్ని పాటించడం కానీ, శానిటైజర్లను వినియోగించడం కానీ జరగడం లేదు. స్వీయ క్రమశిక్షణ పాటించడం లేదు. వైన్‌ షాపులు, మాల్స్‌ కిటకిటలాడిపోతూనే ఉన్నాయి. ఇతర రాష్ర్టాల్లో కన్నా తెలంగాణలో కేసుల నమోదు, మరణాలు తక్కువే అయినప్పటికీ అవి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యదగినవి కావు. అందుకే వీటికి కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు లాక్‌డౌన్‌ పెడితే కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయి. ఏరోజుకారోజు కూలి నాలి చేసుకుని పొట్టపోసుకునేవారు, కూరలు, పండ్లు అమ్ముకొని జీవించేవారు, ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, మార్కెట్‌ యార్డులలో కూలిపని చేసుకునేవారు, రోడ్ల పక్కన చిరువ్యాపారాలు చేసుకునేవారు లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోతారు.
పదిరోజులపాటు పనులకు వెళ్లకపోయినా జరుగుబాటుకు లోటు లేనివారు, రక్షితరంగంలో పనిచేసే భద్రత కలిగిన ఉద్యోగులు లాక్‌డౌన్‌ ఉండాలని కోరుకుంటారు. ప్రభుత్వం అనేది అందరి భద్రతను చూసుకోవాలి. వద్దంటే ఒక తంటా, కావాలంటే ఒక పీడా అన్నట్లుగా లాక్‌డౌన్‌ అనేది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో దవాఖానలపై ఒత్తిడి పెరిగింది. ఆక్సిజన్‌కు, మందులకు కొరత ఏర్పడవచ్చు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌ గా ఖ్యాతి పొందింది. దీంతో దూరప్రాంతాలనుంచి కూడా కొవిడ్‌ రోగులు హైదరాబాద్‌ వైపు పరుగులు తీస్తున్నారు. దీనివల్ల కూడా నగరంలోని దవాఖానలపై ఒత్తిడి పెరుగుతున్నది.

నిజానికి లాక్‌ డౌన్‌ పెట్టకుండా అన్ని వర్గాలలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా కరోనాను ఎదుర్కోవాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, కొవిడ్‌ను ఎదుర్కొనే బాధ్యతను ప్రభుత్వానికి వదిలివేయాలని మొన్ననే కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అంటే ఏమిటి? పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకొనే బాధ్యతను ప్రభుత్వానికి వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. దైనందిన పాలనా వ్యవహారాల్లో కోర్టుల జోక్యాన్ని ఆహ్వానించడం సబబా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే దీనివల్ల ఇటీవలి కాలంలో ప్రభుత్వం మీద కోర్టుల ఒత్తిడి తీవ్రతరం అవుతున్నట్లు కనిపిస్తున్నది.

లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజాజీవితం అల్లకల్లోలం అవుతుందని, ఆర్ధికవ్యవస్థ దిగజారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లుగా అయిదారు రోజులక్రితం వార్తలు వెలువడ్డాయి. అందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది కేంద్రం చెప్పినట్లుగా లాక్‌డౌన్‌ విధించి తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలకు కేంద్రం చేసిన సాయం ఏమీ లేదు. రాష్ర్టాలకు ఇరవై లక్షల కోట్ల రూపాయలను ఇస్తున్నట్లు కేంద్రం ఆర్భాటంగా ప్రకటించింది కానీ దానిలో ఎన్ని రూపాయలు రాష్ర్టాలకు అందాయో తెలియదు. పైగా రైలు సర్వీసులు, విమానయానం వంటి అంశాల్లో కేంద్రం అత్యంత అసమర్థంగా వ్యవహరించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ విధించి ప్రజలను కష్టాల్లో ముంచడానికి ముఖ్యమంత్రి ఇచ్చగించలేదు. ప్రభుత్వ ఆలోచనలను వక్రీకరించడానికి కొన్ని పక్షాలు, మీడియా ఎల్లప్పుడూ ఉంటాయి. దేశంలో ఎక్కడైనా ఇదే పరిస్థితి!

కరోనా వైరస్‌ చెలరేగుతున్నందున అనివార్య పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. లాక్‌ డౌన్‌ విధించినప్పటికీ ధాన్యం కొనుగోలు ఆగదని ప్రభుత్వం ప్రకటించడం రైతులకు ఊరట కలిగిస్తున్నది. ముందుగా పదిరోజుల పాటు ప్రతిరోజూ ఇరవై గంటల లాక్‌డౌన్‌ను విధించడానికి రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. నిత్యావసరాలు కొనుగోలు చెయ్యడానికి ఉదయం నాలుగు గంటల సమయాన్ని ఇచ్చింది. కనుక ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలి. అనవసరంగా చిన్న చిన్న వాటికోసం రోడ్లమీదకు రాకుండా నడచుకోవాలి. ఒక్కోసారి సమీపంలో దొరికే పదార్థాలతోనే సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. తమకు నచ్చిన బ్రాండ్‌ గోధుమపిండి కావాలనో, ఫలానా కంపెనీ ఉప్పు కావాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు. భారీ దుకాణాలలో గుంపులుగా చేరి షాపింగ్‌ చేయకూడదు. రోడ్లమీదకొచ్చి నిబంధనలను తుంగలో తొక్కవద్దు. కరోనా కట్టడికి సహకరించాలి. కరోనా కట్టడి ప్రభుత్వంచేతిలోనో, లాక్‌డౌన్‌లోనో లేదు. అది మనచేతుల్లోన్లే ఉంది.

ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి
సహకరించాలి. అనవసరంగా చిన్న చిన్న వాటికోసం రోడ్లమీదకు రాకుండా నడచుకోవాలి.
ఒక్కోసారి సమీపంలో దొరికే పదార్థాలతోనే సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. తమకు నచ్చిన
బ్రాండ్‌ గోధుమపిండి కావాలనో, ఫలానా కంపెనీ ఉప్పు కావాలనో ఇతర ప్రాంతాలకు
వెళ్ళకూడదు. రోడ్లమీదకొచ్చి నిబంధనలను తుంగలో తొక్కవద్దు. కరోనా కట్టడికి సహకరించాలి.

అనివార్యంగా మారిన లాక్‌డౌన్‌ఇలపావులూరి మురళీ మోహనరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనివార్యంగా మారిన లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement