తీరాన్ని వెదుకుతూ అలల పడవ
జలపాతం అంచుకు చేరుతుంది!
రహస్య స్వప్నపుష్పాలు వెలుతురులో
అగ్నిప్రవేశం చేస్తాయి!
దారంగా మిగిలిన దండలా
రహస్యమొక్కటే మిగులుతుంది!
లక్ష్యాలన్నీ త్యాగాలను కోరుతాయి,
ఊహలకు ఉరితాళ్ళు పేనుతాయి!
కాళ్ళకు బంధాలను చుట్టి
ఆశ ఏదో తరుముతూ ఉంటుంది లోయ అంచుదాకా!
రెండు నాటకాలూ ఒకేసారి ఆడలేక
రంగస్థలం తెరలు చించుకుంటుంది!
సాలగ్రామాలుగా మారడం కోసం
అశ్రుప్రవాహంలో తమను తాము
అరగదీసుకుంటూ ఉంటాయి
కొన్ని కాంక్షాశిలలు!
ఆశల పూరెమ్మల మీద వాలాల్సిన చినుకు
కనుకొలుకులలోకి చేరుతుంది!
పెట్రోలు మరక మీది మంటలా
వేగంగా పాకుతూ వెంటాడుతూ
ఉంటుంది జీవనలాలస!
కుడివైపు నుంచి పూర్ణవిరామం
వడివడిగా వస్తూనే ఉంటుంది!
వాక్యాన్ని ముగించే తొందరలో
పదాలు స్థానాలు మారుతూ ఉంటాయి!
అనేక పూర్ణవిరామాలు బారులు తీరిన వేళ
అసంపూర్ణ సమాధులైన అసమాపక వాక్యాలే
అర్థోక్తులు..!!
పెన్నా శివరామకృష్ణ
94404 37200