భారత స్వాతంత్య్ర పోరాట యవనికపై అహింసావాదాన్ని అద్భుతంగా ఆవిష్కరించి నీ దార్శనికతతో ప్రపంచాన్ని అబ్బురపరిచి సత్యం, ధర్మం, సహనం, మానవత మూలస్తంభాలుగా స్వేచ్ఛా మహలులు నిర్మించ నడుం కట్టిన దార్శనికుడా..! ఇదొక్కటి చాలదా గాంధీ.. నిన్ను మహాత్మా అనడానికి!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని
గడ గడ లాడించిస్వాతంత్య్ర సమరానికి ఊపిరులూది
ఫకీరుయని బికారియని పరిహసించినా
వెన్నుచూపక ముందు నడచిన ధీశాలి!
ఇదొక్కటి చాలదా గాంధీ నిన్ను మహాత్మా అనడానికి!
తెల్లదొరల జాత్యహంకారాన్ని ఎండగట్టి
పౌరహక్కుల అనౌచిత్యాన్ని ప్రశ్నించి
విదేశీగడ్డ పైనుంచే
స్వదేశీ ఉద్యమానికి బీజం వేసి
విడివడని దాస్య శృంఖలాల తెంచివేయ
ప్రతినబూనిన భరత తేజమా!
ఇదొక్కటి చాలదా గాంధీ నిన్ను మహాత్మా అనడానికి!
కౌపీనంతో కాలినడకన దేశమంతా తిరుగుతూ
స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో
అణువణువునా రగిలిస్తూ
అలుపెరగని ఉద్యమ తపస్సు వైచిన మహర్షీ!
ఇదొక్కటి చాలదా గాంధీ నిన్ను మహాత్మా అనడానికి!
మతం ఓ జీవనవిధానంగా
మనుషుల్లో మంచిని పెంచే హితమనీ
అంతరాలను తుంచే అవశ్యమనీ.. ఆదర్శ లౌకికరాజ్యంలో
ఆచరణాత్మక పరమత సహనం బోధించిన బాపూ..!
ఇదొక్కటి చాలదా గాంధీ నిన్ను మహాత్మా అనడానికి!
అస్పృశ్యతను, అమానవీయతను ప్రశ్నించి
అట్టడుగువర్గాల అభ్యున్నతికి
అహరహం శ్రమించి హరిజనోద్ధరణ లక్ష్యంగా
సమాజోద్ధరణకు బాటలు పరిచిన ఆదర్శమూర్తీ!
ఇదొక్కటి చాలదా బాపూ నిన్ను మహాత్మా అనడానికి!
వ్యక్తిత్వమే మనిషికి అసలైన గీటురాయి అని
సత్ప్రవర్తనే వ్యక్తి సదాచారమని చాటిచెప్పి
సత్సమాజ నిర్మాణానికి సహకరించి
సానబెట్టిన మానవీయ శిఖరమా!
ఇదొక్కటి చాలదా బాపూ నిన్ను మహాత్మా అనడానికి!
-డాక్టర్ వాణీ దేవులపల్లి ,98669 62414