కరోనా మిగిల్చిన ఆర్థిక అనిశ్చితి ఇంకా తొలగకముందే ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని స్టాగ్ఫ్లేషన్ (మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణం) ఆవరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్)స్థిరంగా తీవ్రస్థాయిలో పట్టిపీడిస్తుంటే, మరోవైపు ఆర్థిక ఉత్పత్తి కూడా స్తంభించిపోతే దానిని స్టాగ్ఫ్లేషన్ (స్తబ్దత)అంటారు. 1970 దశకంలో మొదటిసారి స్టాగ్ఫ్లేషన్ను గుర్తించారు.
ప్రస్తుతం కూడా అటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసింది. మరోవైపు పారిశ్రామిక దేశాలలో తీవ్రస్థాయి నిరుద్యోగం నెలకొన్నది. 2021 ప్రారంభంలోనే స్టాగ్ఫ్లేషన్ భయం నెలకొన్నది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంతో ఈ లక్షణాలు మరింత ముదిరాయి. అమెరికాలో ఈ శతాబ్దంలోనే అత్యంత అధికస్థాయిలో ద్రవ్యోల్బణం నెలకొనడంతో దానిని కట్టడి చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇతర బ్యాంకులు తీసుకున్న చర్యలు కూడా ఈ ప్రమాద సూచికలు కనబడటానికి కారణం.
అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం ఆవరించబోతున్నదా అనే అనుమానం కూడా నెలకొన్నది. కానీ మాంద్యం విషయంలో ఆర్థికవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సెక్యూరిటీస్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం- 80 శాతం మంది ఆర్థికవేత్తలు దీర్ఘకాలికంగా ఆర్థికవ్యవస్థకు స్టాగ్ఫ్లేషన్ ప్రభావం ఉందని అంచనా వేశారు. 13 శాతం మంది మాత్రం ప్రతిద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) పొంచి ఉందన్నారు. 2008 జూన్ నుంచే స్టాగ్ఫ్లేషన్ సూచనలు ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సర్వేలో వెల్లడైంది. ఆర్థికాభివృద్ధి క్షీణించి, నిరుద్యోగం శిఖర స్థాయికి చేరుకొని, డిమాండ్ లోపించి, ధరలు పెరుగుతూ ఉంటే దానిని స్టాగ్ఫ్లేషన్ అంటారు. స్థూల దేశీయోత్పత్తి పడిపోయి అదే సమయంలో తీవ్ర ద్రవ్యోల్బణం నెలకొనడం స్టాగ్ఫ్లేషన్ లక్షణం. స్టాగ్ఫ్లేషన్ ప్రమాదం తొంగి చూస్తున్నదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ చాలామంది ఆర్థికవేత్తలు దీనిని ధ్రువీకరించటం లేదు.
తీవ్రస్థాయి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నెలకొంటేనే స్టాగ్ఫ్లేషన్కు దారితీస్తుంది. అందుకనే ఆర్థికవేత్తలు నమ్మలేకపోతున్నారు. అయితే మాంద్యం నెలకొనడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఇది క్రమంగా స్టాగ్ఫ్లేషన్కు దారి తీస్తుందా అనేదే అనుమానం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతూ పోతే ఏడాది చివరి నాటికి మాంద్యం రావచ్చు.
మాంద్యం లేదా స్టాగ్ఫ్లేషన్ ఆవరిస్తే దానిని ఎలా ఎదుర్కొనాలి? ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్)తోపాటు ష్రింక్ఫ్లేషన్ (సంకోచం) కూడా తోడైతే ప్రజల ధనం వ్యయమయ్యే తీరులో మార్పు ఉంటుంది. ఉత్పత్తిదారులు వస్తువుల పరిమాణాన్ని తగ్గించి వేస్తారు. స్టాగ్ఫ్లేషన్ నెలకొనే ప్రమాదం ఉందని తాజా సర్వేలో అకాడమిక్స్, ఫండ్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. స్టాగ్ఫ్లేషన్ లేదా మాంద్యం నెలకొన్నట్టయితే ఎటువంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలనేది ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఆరు నెలలపాటు సరిపోయే అత్యవసర నిధులను దగ్గర పెట్టుకోవాలి. ఏయే విధాలుగా పొదుపు చేయవచ్చునో గుర్తించాలి. సంస్థలు మూతపడుతూ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది కనుక, ఆ పరిస్థితులకు తగినట్టుగా నైపుణ్యాలను సంతరించుకోవాలి.
-నిఖిల్ పాండే (www.wion news.com)