e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home ఎడిట్‌ పేజీ ఆలయ నగరిలో అభివృద్ధి

ఆలయ నగరిలో అభివృద్ధి

ఆలయ నగరిలో అభివృద్ధి

కరోనా మహమ్మారితో జనం బెంబేలెత్తి పోతున్న వేళ, వేములవాడ దవాఖానలో కరోనా బాధితుల కోసం యాభై ఆక్సిజన్‌ పడకలను మంత్రి కేటీఆర్‌ ద్వారా ప్రారంభించుకోవటం శుభ తరుణం. పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఈ వంద పడకల పెద్దాసుపత్రి సేవలందిస్తుందనటంలో సందేహం లేదు.

ముఖ్యమంత్రిగా మొదటిసారి 2016లో వేములవాడకు కేసీఆర్‌ వచ్చినప్పుడు శాసన సభ్యునిగా నేను వారిని మూడు కోరికలు కోరాను. అవి దేవాలయాభివృద్ధితో పాటు మెట్ట ప్రాంతమైన వేములవాడకు సాగునీరు, ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం కోసం వంద పడకల పెద్దాసుపత్రి కావాలని విజ్ఞప్తి చేశాను. అవన్నీ ఇప్పుడు నిజమై ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్న యాతనలు దూరం కానున్నాయి.

కరోనా కష్టకాలంలో ప్రజలందరి కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా చివరిదశలో ఉన్న ఈ భవనం, సామగ్రి సమకూర్చడం
యుద్ధ ప్రాతిపదికన జరిగాయి.

ఎల్లంపల్లి నీళ్లతో గత నాలుగేండ్లుగా వేములవాడ నియోజకవర్గంలోని మెట్టప్రాంతంలో 55 వేల ఎకరాలకు సాగు నీరందుతున్నది. దీంతో వేములవాడ ముఖచిత్రమే మారిపోయింది. గుడి చెరువుకు ప్రత్యేక ఎత్తిపోతలతో మనం 365 రోజులు పట్టణం నడిబొడ్డులో నిండుకుండను సాధించుకు న్నం. సుమారు 125 కోట్లతో రింగురోడ్లను పూర్తిచేసుకున్నం. అవసరమైన చోట్ల వంతెనలను నిర్మించుకుంటున్నం. వేములవాడలో ప్రైవేట్‌ రంగంలోనే రెం డు దవాఖానలున్నవి. డెంగ్యూ, మలేరియా వస్తే నేల మీద బెడ్లు వేసినా సరిపోని పరిస్థితి. ప్రైవేట్‌ దవాఖానలో చికిత్సకు ఆస్తులు అమ్మి, అప్పుల పాలైన వేలా ది పేద కుటుంబాలున్నాయి. ఈ పరిస్థితులు పోవాలంటే వేములవాడ నడిబొడ్డున సర్కారు దవాఖాన నెలకొని సేవలందించాలన్నది నా ఆకాంక్ష.

దవాఖాన నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమి అవసరం. కానీ అప్పటికే వేములవాడలో అంగన్‌వాడీ భవనం కడదామంటే గుంటెడు ప్రభుత్వ భూమి లేని పరిస్థితి. అప్పుడు తిప్పాపురంలో ఉన్న దేవాలయ భూమి 12 ఎకరాలు పరిశీలనకు వచ్చింది. అప్పటికే దేవస్థానం గుడిచెరువును 30 ఎకరాలు పూడ్చి దానికి బదులుగా 30 కోట్ల నష్ట పరిహారం రైతులకిచ్చి, ఆ రాజన్న వద్ద 4 ఎకరాలు ప్రజల దవాఖాన కోసం తీసుకోవడం సముచిత నిర్ణయమే. దేవుని భూమిని తీసుకోవద్దని కొందరు ధర్నాలు చేసినా, పట్టుబట్టి ప్రత్యేక అవసరాల దృష్ట్యా క్యాబినెట్‌ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ రోజు మన ముందున్న ఈ ఆస్పత్రి ఎన్నో అవరోధాలను అధిగమించి నేడు రూపుదాల్చింది!
దవాఖాన నిర్మాణానికి ఏడాది పట్టింది. దవాఖాన పూర్తి కావడం ఆలస్యమవడానికి అనేక కారణాలున్నాయి. ఆ తర్వాత శాసనసభ్యునిగా నిధుల కొరత సమస్యతో నిరంతరం పోరాడవలసి వచ్చింది. కరోనా కష్టకాలంలో ప్రజలందరి కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా చివరిదశలో ఉన్న ఈ భవనం, సామగ్రి సమకూర్చడం యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. కలెక్టర్‌, వైద్యాధికారి, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తోడ్పాటుకు ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.

కరోనా కాలంలో ప్రజలు అత్యంత దయనీయం గా బాధలు పడుతున్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ దవాఖానలు కనీస మానవీయత లేకుండా వ్యవహరించటం దురదృష్టకరం. అధిక ఫీజు వసూళ్లకు పాల్పడిన దవాఖానలకు ప్రభుత్వమే సుమారు 400 నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే వారి దోపిడీని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి ప్రజల ప్రాణ రక్షణ కోసం దవాఖాన ఏర్పాటు చేయటం హర్షణీయం.

విద్య, వైద్యం రెండూ వ్యాపార వనరులు కావు. విద్యా వైద్యం అత్యవసర సేవా వసతులు, వనరులు. మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఒక రాష్ట్ర, దేశ అభ్యున్నతిని చాటే నిదర్శనాలు. అందుకే ఈ రోజు ల్లో ఒక దేశం అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశ సగటు ఆదాయం కాదు కొలతబద్ద. ఆ దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందుతున్నదా అన్నదే కీలక ప్రాతిపదిక. దీన్ని గత పాలకులు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయడమే కాదు, పూర్తిగా ప్రైవేటురంగానికి అప్పగించారు. ఈ పరిస్థితి మారాలంటే అంచెలంచలుగా విద్య, వైద్యంలో మళ్లీ ప్రభుత్వ రంగం తన ఆధిపత్యాన్ని సాధించాలి. సుమారు 600 గురుకుల పాఠశాలల స్థాపన ద్వారా కచ్చితంగా మన రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసింది. వైద్యరంగంలో కూడా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచడానికి తీసుకున్న చర్యలు అత్యంత ప్రశంసనీయం. ఈ క్రమంలోనే ప్రజారోగ్య విధానాల్లో సమూలమైన మార్పులు రావాలన్న సందేశం కరోనా విపత్తు చాటి చెప్తుతున్నది.

మన రాష్ట్రంలో దీర్ఘకాలికంగా అమలు చేయవలసిన సమూల మార్పులకు విద్య, వైద్యంలో ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నది. ఈ రోజు మన వేములవాడలో ప్రారంభించుకున్న దవాఖాన ఈ దిశగా మన ప్రాంతానికి వేసిన గొప్ప ముందడుగుగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయటానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నది. ప్రజారోగ్య రంగంలో దీర్ఘకాలిక మార్పుల కోసం ప్రయత్నం చేయకపోతే, కఠోర నిజాలు చెప్పిన కరోనా నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోనట్టే అవుతుంది!

ఆలయ నగరిలో అభివృద్ధిడాక్టర్‌ చెన్నమనేని రమేశ్‌ : ఎమ్మెల్యే, వేములవాడ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలయ నగరిలో అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement