పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. దానికి ఏదీ అడ్డంకి కాదు. డబ్బులు ఉన్నా లేకున్నా.. అంగవైకల్యం ఉన్నా.. పరిస్థితులు సహకరించకున్నా.. ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా.. ఏదైనా సాధించవచ్చు. కాకపోతే ముందడుగు వేయాలి. వెనక్కి తిరిగి చూసుకోకూడదు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తే విజయం నీకు బానిస అవుతుంది అని నిరూపించింది ఓ మహిళ.
బొడ్డు నాగలక్ష్మి అనే మహిళ.. తన వదిన బొండాల కవితతో కలిసి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. నిజానికి.. నాగలక్ష్మికి చూపు సరిగ్గా కనిపించదు. పుట్టడమే కళ్లలో లోపంతో పుట్టింది. కేవలం 5 శాతం మాత్రమే తనకు కంటి చూపు ఉంది. 95 శాతం తనకు ఏం కనిపించదు.
తల్లిదండ్రులు కూడా పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయ కుటుంబం. పేద కుటుంబం. మూడు పూటల కడుపు నిండా తినాలంటే.. ఇంటిల్లిపాది పనిచేయాలి. అందుకే.. తనకు 10 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచే తను కంటి చూపు లేకున్నా.. కూలీనాలీ చేసి తల్లిదండ్రులను పోషించేది.
అయితే.. తన సోదరుడు ఆది రెడ్డి తనకు యూట్యూబ్‌ను పరిచయం చేశాడు. దీంతో వంటకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయాలని తన వదిన, నాగలక్ష్మి ఇద్దరూ భావించారు. సరదాగా వీడియోలను పెట్టడం ప్రారంభించారు. Kavitha Naga vlogs అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేవారు. నాగలక్ష్మి వీడియోలు నచ్చి తనకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. యూట్యూబ్‌లో వ్యూస్ పెరిగాయి. దీంతో ఆదాయం కూడా రావడం స్టార్ట్ అయింది. దీంతో ఇంకా ఉత్సాహంగా యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన యూట్యూబ్ చానెల్‌కు 1.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆదాయం కూడా బాగానే వస్తోంది. ఇప్పటి వరకు 100 వరకు వీడియోలను పోస్ట్ చేశారు. ఏ వీడియో పోస్ట్ చేసినా కనీసం లక్ష వ్యూస్ అయినా వాళ్లకు వస్తున్నాయి.
నాకు కంటిచూపు లేకపోవచ్చు కానీ.. నేను చేసే వంటలు చూసి లక్షల మంది నేర్చుకుంటున్నారు. వాళ్లకు నేను వంటలు నేర్పించగలను.. అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చింది నాగలక్ష్మి.
మీకు ఇంకో విషయం తెలుసా? సోషల్ సర్వీస్‌లోనూ నాగలక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. తనకు ప్రతి నెలా వచ్చే ఫించన్ డబ్బులను సమాజ సేవ కోసం ఖర్చు పెడుతుంటుంది. ఇటీవల తన 5 నెలల పింఛను డబ్బులను సోనూసూద్ చారిటీ ఫౌండేషన్‌కు డొనేట్ చేసింది. ఎన్జీవోలు, అనాథ ఆశ్రమాలకు కూడా నాగలక్ష్మి డొనేట్ చేస్తుంటుంది. అందుకే.. తను ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు.. నాగలక్ష్మిని నెటిజన్లు.. తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ నాగలక్ష్మిది ఏ ఊరో చెప్పలేదు కదా. తనది ఏపీలోని నెల్లూరు జిల్లా.