లక్నో : పెండ్లి వేడుకలో నూతన జంట దండలు మార్చుకునే సమయంలో వరుడి తల్లి అందరి ముందే అతడిపై చెప్పు దెబ్బలతో విరుచుకుపడింది. యూపీలోని హమీర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొత్త జంట దండలు మార్చుకుంటుండగా ఫొటోగ్రాఫర్లను తోసుకుంటూ మంటపంపైకి వచ్చిన పెండ్లికొడుకు తల్లి చెప్పుతో కుమారుడిని కొడుతుండటం కనిపించింది.
ఆమె తన ముఖాన్ని దుపట్టాతో కప్పుకోగా మరో వ్యక్తి ఆమెను స్టేజ్‌పై నుంచి కిందకు తీసుకువచ్చారు. తమ కుమారుడు వేరే కులం అమ్మాయిని పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఆమె పెండ్లి మంటపంలో హంగామా సృష్టించారు. ప్రేమ జంట న్యాయస్ధానం వేదికగా ఒక్కటికాగా వధువు తల్లితండ్రులు జులై 3న డిస్ట్రిక్ట్ హాల్లో పెండ్లి వేడుకను నిర్వహించారు. సంప్రదాయంగా నిర్వహించే ఈ పెండ్లికి వరుడి కుటుంబాన్ని వారు ఆహ్వానించలేదు. అయినా పెండ్లి వేడుకకు వచ్చిన వరుడి తల్లి పెండ్లికి వచ్చిన అతిధుల ఎదుటే స్టేజ్‌పై కుమారుడికి చెప్పు దెబ్బలతో షాక్ ఇచ్చింది.