e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Hog hotel | చైనాలో పందుల కోసం 13 అంతస్తుల రాజసౌధం.. 24 గంటల సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా

Hog hotel | చైనాలో పందుల కోసం 13 అంతస్తుల రాజసౌధం.. 24 గంటల సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా

Hog hotel | రాజసౌధాలను తలపించే భవంతులు. అంగుళం కూడా విడిచిపెట్టకుండా 24 గంటలపాటు సెక్యూరిటీ కెమెరాల పహారా. సాధారణ పౌరులు ఎవరూ లోనికి ప్రవేశించలేని కట్టుదిట్టమైన భద్రత. తినే ఆహారం, ఆరోగ్య సేవల విషయంలో నిష్ణాతుల పర్యవేక్షణ. ఇన్ని సదుపాయాలు ఉన్నాయంటే కచ్చితంగా ఆ భవంతుల్లో ఏ దేశ అధ్యక్షుడో లేదా అంతర్జాతీయ సెలబ్రిటీనో ఉంటారనుకుంటున్నారు కదూ. మీ అంచనా తప్పు. సకల సదుపాయాలు ఉన్న ఈ హై-సెక్యూర్డ్‌ భవనాల్లో వరాహాలు (పందులు) నివసిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం.

దక్షిణ చైనాలోని అక్కడి అధికారులు పందుల కోసం ప్రత్యేకంగా ఓ హోటల్‌ను ఏర్పాటు చేశారు. 13 అంతస్తులు ఉండే ఈ హోటల్‌ను ‘హాగ్‌ హోటల్‌ (వరాహాల హోటల్‌)’గా పిలుస్తున్నారు. ఈ హోటల్‌లో దాదాపు 10 వేల వరాహాలు ఉండేలా సకల సౌకర్యాలు ఏర్పాటుచేశారు. మరోవైపు, బీజింగ్‌కు సమీపంలోని పింగూ జిల్లాలో 20 ఫుట్‌బాల్‌ స్టేడియంల విస్తీర్ణంలో ఐదంతస్తులతో మరో భారీ హోటల్‌ను ఇటీవల పూర్తిచేశారు. ఏడాదికి 1.20 లక్షల చొప్పున పందుల సంతానోత్పత్తే లక్ష్యంగా దీన్ని తీర్చిదిద్దారు. ‘హాగ్‌ హోటల్‌’ల నిర్మాణంలో ముయాన్‌ ఫుడ్స్‌, న్యూహోప్‌ గ్రూప్‌ వంటి కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి.

హాగ్‌ హోటళ్లు ఎందుకంటే

- Advertisement -

చైనీయులు తినే ప్రధాన ఆహారాల్లో పంది మాంసం (పోర్క్‌) ఒకటి. అయితే, 2018లో దేశంలో విజృంభించిన ఆఫ్రికా స్వైన్‌ ఫీవర్‌ వల్ల 40 కోట్ల పందులు మృత్యువాతపడ్డాయి. దేశంలోని మొత్తం పందుల్లో ఇది సగం. దీంతో పోర్క్‌ రేటు అమాంతం పెరిగిపోయింది. దేశీయ ఆహార అవసరాలను తీర్చేందుకు దిగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచాల్సి వచ్చింది. ఫలితంగా గడిచిన ఎనిమిదేండ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో చైనా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. పందుల మీద వైరస్‌ ప్రభావం పడకుండా చూడటంతో పాటు వాటి సంతతిని పెంచాలని నిర్ణయించింది. దీనికి పరిష్కారంగానే బయోసెక్యూరిటీ (వైరస్‌లు దూరకుండా పటిష్టమైన రక్షణ) వలయంలో వరాహాలను ఉంచాలనుకున్నది. ఈ క్రమంలోనే ‘హాగ్‌ హోటల్స్‌’ తెరపైకి వచ్చాయి.

వైభోగమనే చెప్పాలి

హాగ్‌ హోటల్‌లో ఉండే పందులకు ఒక విధంగా రాజభోగమేనని చెప్పాలి. బయోసెక్యూరిటీలో ఉండే ఈ వరాహాలకు మూడంచెల్లో పరీక్షించిన నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే అందిస్తారు. సెక్యూరిటీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో వరాహాలు ఉంటాయి. బయటి వ్యక్తులను ఎవరినీ లోపలికి అనుమతించరు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు సాధారణ దుస్తులను తొలగించి.. బయోసేఫ్టీ ల్యాబోరేటరీలోని ప్రత్యేక దుస్తులు ధరించాలి. శానిటైజర్‌ షవర్‌ కింద కొంత సమయం ఉండాలి. జ్వర లక్షణాలు ఉన్నవారిని లోపలికి అనుమతించరు. పందులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే పశువైద్యుల సాయంతో చికిత్స అందిస్తారు. వరాహాలను ఉంచిన ప్రదేశాల్లో శానిటైజేషన్‌, గాలిని శుద్ధి పర్చడం, ఆహారాన్ని అందించడం కోసం ప్రత్యేక రోబోలు ఉంటాయి. పందులకు జ్వరం ఉన్నదా? శరీర ఉష్ణోగ్రత ఎంత? వంటి పనులను కూడా ఇవి చేస్తాయి. అంతరించిపోతున్న జీవుల రక్షణకు ఐరోపా, అమెరికా ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana