జకార్తా : సినిమా సీన్లను తలపిస్తూ మాజీ ప్రియుడి పెండ్లి వేడుకకు వచ్చిన మహిళ తనను కూడా పెండ్లి చేసుకోవాలని కోరిన ఘటన ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో పెండ్లి కూతురు షాక్ అయింది. కొరిక్ అక్బర్ (20)కు నూర్ కుష్మల్ కొతిమా (20)తో పెండ్లి సందర్భంగా కొత్త జంటకు వారి స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడంతో విషయం తెలుసుకున్న అక్బర్ మాజీ ప్రియురాలు యునిత రూరి (21) ఏకంగా పెండ్లి తంతు జరుగుతుండగా ప్రత్యక్షమై తనను కూడా వివాహం చేసుకోవాలని కోరింది.
సంప్రదాయం ప్రకారం అక్బర్ పెండ్లికూతురు నూర్‌ను కిడ్నాప్ చేసి ఆమె తల్లితండ్రులను ఒప్పించి తన ఇంటికి తీసుకురాగా అక్కడికి యునిత వచ్చి తనను కూడా పెండ్లి చేసుకోవాలని కోరడంతో నూర్ కంగుతింది. 2016లో తాను యునితతో డేటింగ్ చేశానని ఇక్కడ ఆమెను చూసి షాక్ తిన్నానని అక్బర్ చెప్పుకొచ్చాడు.
కుటుంబ సభ్యులతో చర్చించిన మీదట ఇద్దరినీ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించానని తెలిపాడు. ఇద్దరికీ కట్నంగా రూ 8980 సమర్పించుకున్నాడు అక్బర్. ఎంచక్కా ఇద్దరమ్మాయిలను కట్టుకున్నా ఇప్పుడు ఇద్దరు పెండ్లాలను ఎలా పోషించాలో తెలియక అక్బర్ తలపట్టుకున్నాడు. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నఅక్బర్ ఇద్దరు భార్యలను ఎలా పోషించాలో దిక్కుతోచడం లేదని వాపోతున్నాడు.