సైబరాబాద్ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర.. తన కెరీర్లో ఎన్నో ఆపరేషన్లను సమర్థంగా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఉగ్రవాద, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సీఎం కేసీఆర్ అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ఇంతకీ సజ్జనార్ తర్వాత సీపీగా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్ర బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తన కెరీర్లో ఎలాంటి ఆపరేషన్లు నిర్వహించారు? తెలంగాణ కేడర్‌లో ఉన్న స్టీఫెన్.. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వెళ్లనున్నారని అప్పట్లో ఎందుకు వార్తలు వచ్చాయి?
ముత్యాల స్టీఫెన్ రవీంద్ర తండ్రి పేరు ఎం.బీ. రంజిత్. ఈయన కూడా పోలీసు అధికారే. గతంలో అసిఫ్‌నగర్ డివిజన్, హైదరాబాద్ సిటీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. స్టీఫెన్ రవీంద్ర విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తయింది. సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్నారు. లిటిల్ ఫ్లవర్, నిజాం కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1994లో నిజాం కాలేజీ నుంచి ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు. 1996లో జంతు శాస్త్ర విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర.. 20 సెప్టెంబర్ 1999న ఉద్యోగంలో చేరారు. తొలి పోస్టింగ్ వరంగల్ జిల్లాలో జరిగింది. అక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రస్తుత ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నోయెల్ స్వరణ్‌జిత్ సేన్‌తో కలిసి పనిచేశారు. ఈ త్రయం అప్పట్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, కరీంనగర్, అనంతపురం జిల్లాల్లోనూ ఈయన పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో సీఎం సెక్యూరిటీ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డీసీపీగా, గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్‌గా, ఐజీగా విధులు నిర్వహించాడు.
➤ వరంగల్‌లో ఉన్నప్పుడు నక్సలిజం, అనంతపురం ఎస్పీగా ఉన్న సమయంలో ఫ్యాక్షనిజం, కరీంనగర్ ఎస్పీగా ఉన్న సమయంలో అవినీతి, ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు ప్రాంతీయ వాదం, వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సమయంలో డ్రగ్స్ నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించారు.
➤ గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్, గ్రూప్ కమాండర్‌గా పనిచేసిన సమయంలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు.
➤ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన స్టీఫెన్ రవీంద్రను.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించారు. అయితే 2019లో ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ను కలిసి.. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి బదిలీ చేయాలని కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా అంగీకారం తెలిపారు. దీంతో ఏపీ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ స్టీఫెన్‌ను ఏపీకి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ క్రమంలో తెలంగాణకే పరిమితమైన ఈయన.. తాజాగా సైబరాబాద్ సీపీగా నియమితులయ్యారు.
2004లో అంత్రిక్ సురక్ష సేవా పతకం
2005లో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ
2010లో లైఫ్ సేవింగ్ ప్రైమ్ మినిస్టర్స్ పోలీస్ మెడల్ ఫర్ లైఫ్
2016లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అలాగైతే 35 వేల ఉద్యోగాలు హుష్‌కాకి.. రూ.28 వేల కోట్ల రుణాలు గోవిందా?!
బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా పాట పెడితేనే పాలు తాగుతున్న కొండెంగ..!! ఎక్కడంటే?
చద్దన్నాన్ని ఛీ కొడుతున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!