e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలో ధాన్యం దిగుబ‌డి పెరుగుతున్న నేప‌థ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను పెద్ద ఎత్తున స్థాపించాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. మొద‌టి ద‌శ‌లో క‌నీసం 10 జోన్ల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ బుధ‌వారం రెండోరోజు మంత్రి వ‌ర్గ స‌మావేశం కొన‌సాగింది. ఆస‌క్తి క‌లిగిన వ్యాపార‌వేత్త‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ప్ర‌స్తుతం జూలై 12 వ‌ర‌కు ఉన్న ఆఖ‌రు తేదీని జూలై 31 వ‌ర‌కు పొడిగించాల‌ని సూచించింది.

ఒక్క ఎక‌రం కూడా వ‌ద‌లకుండా సాగు : సీఎం కేసీఆర్

గ‌త ఏడేండ్ల కాలంలో వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ సాధించిన‌ ఘ‌న విజ‌యాల‌ను బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎక‌రం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్‌ది ఆత్మ వంచ‌న : కేటీఆర్

- Advertisement -

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. ‘ఈట‌ల రాజేంద‌ర్‌ది ఆత్మ‌గౌర‌వం కాదు.. ఆత్మ‌వంచ‌న అని పేర్కొన్నారు. ఈట‌ల త‌న‌కు తాను మోసం చేసుకోవడమే కాకుండా ప్ర‌జ‌ల‌ను కూడా మోసం చేస్తున్నార‌న్నారు. ఆయ‌న‌కు టీఆర్ఎస్ పార్టీలో జ‌రిగిన అన్యాయం ఏంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏం అన్యాయం చేశామ‌ని పాద‌యాత్ర చేస్తున్నార‌ని బండి సంజ‌య్‌ను ప్ర‌శ్నించారు.

మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి రావాలి : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

మావోయిస్టులు జ‌నజీవ‌న స్ర‌వంతిలోకి రావాలని, వారిని ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. క‌రోనాతో బాధ‌ప‌డుతున్న మావోయిస్టులు లొంగిపోతే.. ప్ర‌భుత్వ ప‌రంగా మెరుగైన వైద్యం అందిస్తామ‌న్నారు. ఇవాళ లొంగిపోయిన‌ మావోయిస్టు నేత‌, ప్లాటూన్ పార్టీ క‌మిటీ మెంబ‌ర్ రావుల రంజిత్‌ను పోలీసులు మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు.

సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు

భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివ‌ర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క వెస్ట్ర‌న్ అసోసియేష‌న్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు ల‌భించింది. భారతీయులచే స్థాపించబడి ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారి ఈ కీర్తి అందుకున్న విద్యాల‌యంగా సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యం నిలిచింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం దీనితోనే ప్రథమం.

గుడ్ న్యూస్‌.. కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ పెంపు

ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న క‌రువు భ‌త్యం (డీఏ)ను పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ పెరిగిన డీఏ ఈ ఏడాది జూలై 1 నుంచి అమ‌ల్లోకి రానుంది.

హైద‌రాబాద్‌లో కాల్పుల క‌ల‌కలం..

హైద‌రాబాద్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. గ‌న్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఒప్పంద ఉద్యోగి సురేంద‌ర్‌పై సెక్యూరిటీ గార్డ్ స‌ర్దార్ ఖాన్ రెండు రౌండ్లు కాల్పులు జ‌రిపాడు. కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ఒప్పంద ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు.

ఆర్థిక‌సాయానికి బాధిత జ‌ర్న‌లిస్టు కుటుంబాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

క‌రోనాతో మ‌ర‌ణించిన జ‌ర్న‌లిస్టు కుటుంబ స‌భ్యుల‌కు రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం అందించ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఈ ఆర్థిక‌సాయం పొందేందుకు బాధిత కుటుంబాలు ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

తెలుగు విద్యార్థినికి యూఎస్‌ కాలేజీ రూ.2 కోట్ల స్కాలర్‌షిప్

తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరిట కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్‌షిప్‌కు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురు ఎంపికవగా అందులో శ్వేతారెడ్డి ఒకరు.

కాంగ్రెస్‌లో చేర‌నున్న ప్ర‌శాంత్ కిశోర్‌!

ఎన్నిక‌ల వ్యూహ‌కర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మంగ‌ళ‌వారం ఆయ‌న పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌హా రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నిక‌లు, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా.. అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు.. 9 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది.

పాక్‌లో పేలుడు.. 9 మంది చైనా ఇంజినీర్లు మృతి

పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాదులు మ‌రోసారి రెచ్చిపోయారు. అప్ప‌ర్ కోహిస్తాన్‌లో చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బ‌స్సును ల‌క్ష్యంగా చేసుకుని పేలుడికి పాల్ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో 9 మంది చైనా ఇంజినీర్లు, ఇద్ద‌రు పారామిల‌ట‌రీ సిబ్బంది, మ‌రో ఇద్ద‌రు వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు
NRI Special : ఇవాల్టి ముఖ్యాంశాలు

ట్రెండింగ్‌

Advertisement