హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9న నిర్వహిస్తున్న లండన్ – చేనేత బతుకమ్మ – దసరా వేడుకల పోస్టర్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ఆవిష్కరించారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, కార్యదర్శి రవి రేతినేని, టాక్ తెలంగాణ ప్రతినిధి మల్లేష్ పప్పుల, సామాజిక కార్యకర్త వినయ్ గౌడ్ బత్తినితో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాల స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను చేనేత బతుకమ్మగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసుల్లో చేనేతపై అవగాహన కల్పించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.
అక్టోబర్ 9న వెస్ట్ లండన్ లోని ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్ ( Isleworth and Syon School,Ridgeway Road,Isleworth,Middlesex,TW75LJ) ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రవాస బిడ్డలంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనమంతా చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని తెలిపారు. www.tauk.org.uk వెబ్సైట్ను సందర్శిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని లేదా tauk.org@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చని రత్నాకర్ తెలిపారు.