సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీఆర్ఎస్ ఆస్ర్టేలియా హంగామా

సిడ్నీ : ఆస్ర్టేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న భారత్-ఆస్ర్టేలియా మ్యాచ్లో టీఆర్ఎస్ ఆస్ర్టేలియా హంగామా చేసింది. రాష్ర్టంలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ను గెలిపించాల్సిందిగా ప్రపంచ వేదిక పైనుంచి పిలుపునిచ్చారు. కేసీఆర్ జిందాబాద్, ఓట్ ఫర్ టీఆర్ఎస్ ఇన్ జీహెచ్ఎంసీ అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలతో సిడ్నీ క్రికెట్ మైదనాన్ని మారుమోగించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు, రవి శంకర్ దూపాటి ఆధ్వర్యంలో మద్దతు ప్రదర్శన నిర్వహించారు. అధిక సంఖ్యలో టీఆర్ఎస్ అభిమానులు వీరికి తోడై మద్దతును ప్రకటించారు. రాజేష్ రాపోలు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తును అత్యధిక స్థానాలలో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1న జరగోబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకి వేసి గెలిపించాలని కోరారు.