మంగళవారం 24 నవంబర్ 2020
Nri-news - Oct 27, 2020 , 13:36:44

రాజన్-నాగేంద్ర జీవితం సంగీతానికి అంకితం

రాజన్-నాగేంద్ర జీవితం సంగీతానికి అంకితం

హైద‌రాబాద్ : తెలుగు వారి మ‌దిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ద‌ర్శ‌కులు రాజ‌న్ - నాగేంద్రకు వంశీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా నివాళుల‌ర్పించింది. అమెరికా గాయ‌ని శార‌దా ఆకునూరి సార‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం వ‌ర్చూవ‌ల్ కాన్ఫ‌రెన్స్ ద్వారా అక్టోబ‌ర్ 24వ తేదీన జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముర‌ళీ మోహ‌న్‌, చంద్ర మోహ‌న్‌, భువ‌న‌చంద్ర‌, రేలంగి న‌రసింహారావు, వైవీఎస్ చౌద‌రి, వేటూరి ర‌వి ప్ర‌కాశ్‌, ఎన్ బీ శాస్ర్తి, భ‌ర‌ద్వాజ‌, , తెన్నేటి సుధాదేవి, శైల‌జ సుంక‌ర‌ప‌ల్లి, రాము, ప్ర‌వీణ్ కుమార్ కొప్పొలు, ప్ర‌సాద్ సింహాద్రి, తాతా బాల‌కామేశ్వ‌ర‌రావు, లండన్ నుంచి న‌గేశ్‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. రాజ‌న్ - నాగేంద్ర ద్వ‌యంతో త‌మ‌కున్న అనుబంధాన్ని వీరు పంచుకున్నారు. 

రాజ‌న్ - నాగేంద్ర కొన్ని వంద‌ల చిత్రాల‌కు సంగీతం అందించార‌ని తెలిపారు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రాజ‌న్ - నాగేంద్ర ద్వ‌యానికి మంచి గుర్తింపు ఉంద‌న్నారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో రాజ‌న్ ఇటీవ‌లే మృతి చెందారు. ‘చినుకులారాలి.. నదులుగాసాగి’, ‘ఎన్నెన్నోజన్మలబంధంనీదీనాదీ’ లాంటి అద్భుత‌మైన పాట‌ల‌ను అందించారు.  


రాజ‌న్ - నాగేంద్ర గొప్ప సంగీత ద‌ర్శ‌కులు : చ‌ంద్ర‌మోహ‌న్‌

రాజన్-నాగేంద్ర ద్వయంపేరు పొందిన గొప్ప సంగీత దర్శకులు అని న‌టుడు చంద్ర‌మోహ‌న్ పేర్కొన్నారు. తాను న‌టించిన ‘నాగమల్లి’, ‘మూడుముళ్ళు’, ‘ఇంటింటి రామాయణం’ లాంటి చిత్రాలకు వాళ్లు సంగీత దర్శకులుగావ్యవహరించారు అని తెలిపారు. ‘అగ్గిపిడుగు’ అనే తెలుగు చిత్రాన్ని క‌న్న‌డ‌లో రీమేక్ చేయ‌గా.. ఆ సినిమాకు రాజ‌న్ - నాగేంద్ర సంగీతం అందించార‌ని గుర్తు చేశారు. ఆ సినిమా క‌న్న‌డ‌లో మంచి విజ‌యం సాధించ‌డంతో రాజ‌న్ - నాగేంద్ర‌కు మంచి గుర్తింపు వ‌చ్చింద‌న్నారు.  ‘సౌభాగ్యలక్ష్మి’ చిత్రంతో తెలుగులో అవకాశం పొందిన ఈ సంగీతద్వయానికి ఎంతోమంది అభిమానులున్నారు. ‘పూజ’, ‘అద్దాలమేడ’, ‘నాలుగుస్తంభాలాట’ సినిమాల్లోని పాటలంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని తెలిపారు. త‌న సినిమాల్లోని పాట‌ల‌కు మంచి గుర్తింపు రావ‌డానికి ఎస్పీ బాలు కూడా కార‌ణ‌మ‌ని చంద్ర‌మోహ‌న్ అన్నారు.  

రాజ‌న్ మృతి సంగీత లోకానికి తీర‌ని లోటు : ముర‌ళీ మోహ‌న్‌

రాజ‌న్ మృతి సంగీత లోకానికి తీర‌ని లోటు అని ముర‌ళీ మోహ‌న్ అన్నారు. రాజ‌న్ - నాగేంద్ర త‌మ జీవితాల‌ను సంగీతానికి అంకితం చేశార‌ని తెలిపారు. ఉన్న‌త విద్య అభ్య‌సించ‌క‌పోయినా, శాస్ర్తీయ సంగీతం నేర్చుకోక‌పోయినా.. తండ్రి ద‌గ్గ‌ర్నుంచి కొంత సంగీతం నేర్చుకుని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాజ‌న్‌ను తానెప్పుడూ వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోలేదు.. కానీ అత‌ను సంగీతం అందించిన పాట‌లంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని ముర‌ళీమోహ‌న్ స్ప‌ష్టం చేశారు. 

వీరి పాట‌లు ఎంతో అద్భుతం : భువ‌న చంద్ర‌

సంగీత ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, గాయ‌కుడు.. ఈ ముగ్గురు పాట‌కు త్రిమూర్తులు అని భువ‌న‌చంద్ర పేర్కొన్నారు. రాజ‌న్ - నాగేంద్ర క‌లిసి ఏ త‌రం వారినైనా ఆక‌ట్టుకునే విధంగా గొప్ప పాట‌ల‌ను అందించారు. వారు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వారి పాట‌లు మాత్రం గుర్తుండి పోతాయ‌ని తెలిపారు. అప్పుల అప్పారావు సినిమా కోసం తొలిసారి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి ప‌ని చేశారు. తాను పాడిన పాట‌కు రాజ‌న్ - నాగేంద్ర సంగీతం అందించారు. అది ఒక తీపి గుర్తు అని చెప్పారు. రాజ‌న్ - నాగేంద్ర కంపోజ్ చేసిన పాట‌లు.. ఎప్ప‌టికీ గుర్తుంటాయ‌ని భువ‌న చంద్ర పేర్కొన్నారు.  

రాజ‌న్ - నాగేంద్ర‌ను ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌యం చేసిన బీ విఠ‌లాచార్య‌కు ధ‌న్య‌వాదాలు తెల‌పాల‌ని రేలంగి న‌ర‌సింహారావు అన్నారు.  

చిన్న‌ప్ప‌ట్నుంచి పాట‌ల‌తోనే త‌మ జీవితం పెన‌వేసుకుపోయింద‌ని శార‌ద కుమారి తెలిపారు. 2018లో రాజ‌న్‌కు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం, స‌ద్గురు ఘంట‌సాల స్వ‌ర్ణ ప‌త‌కంతో స‌త్క‌రించిన‌ట్లు ఆమె గుర్తు చేశారు. రాజ‌న్ - నాగేంద్ర సినీ గీత వైభ‌వం పేరిట వారు స్వ‌ర‌ప‌రిచిన పాట‌ల‌తో సంగీత విభావ‌రి నిర్వ‌హించ‌డం త‌న అదృష్ట‌మ‌ని శార‌ద కుమారి తెలిపారు.