e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home నిజామాబాద్ మనోధైర్యమే మందు!

మనోధైర్యమే మందు!

మనోధైర్యమే మందు!
  • వైద్యుల సలహాలు, మందులు వాడితే చాలు
  • చాలా మందికి హోం ఐసొలేషన్‌లోనే కరోనా తగ్గుముఖం
  • జిల్లాలో కరోనా రికవరీల రేటు 97 శాతం
  • భయపడాల్సిన అవసరంలేదు : నిజామాబాద్‌ డీఎంహెచ్‌వో బాల నరేంద్ర

ఖలీల్‌వాడి, ఏప్రిల్‌ 28: కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌లో విరుచుకుపడుతున్నది. జనవరి నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలు కరోనాభారిన పడ్డారు. అయితే పాజిటివ్‌ వచ్చినవారు. మనోధైర్యంతో ఉంటే వైరస్‌ను ఎదుర్కోవచ్చని వైద్యులు అంటున్నారు. ధైర్యంగా ఉన్నవారే కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను ఉచితంగా చేయిస్తున్నది. జిల్లాలోని ఆర్మూర్‌, నిజామాబాద్‌, బోధన్‌ దవాఖానతోపాటు 40 పీహెచ్‌సీల్లో టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారికి ఉచితంగా మందులను అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా, హోం ఐసొలేషన్‌లో వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉంటున్న చాలా మంది రికవరీ అయ్యారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్‌వేవ్‌ కన్నా ఈసారి కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో కలెక్టర్‌, జిల్లా వైద్యాఆరోగ్య సిబ్బందితోపాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో వెయ్యి డోసుల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నవారికి ప్రాణవాయువు కొరత లేకుండా ఒక ట్యాంకును సైతం అందుబాటులో ఉంచారు.

భయపెడుతున్న సోషల్‌ మీడియా..
నిజామాబాద్‌లో కరోనా బాధితుల రికవరీ రేటు 97 శాతంగా ఉంది. కానీ, కొంత మంది పనిగట్టుకొని సోషల్‌ మీడియాలో అబద్ధపు వార్తలను ప్రచారం చేస్తున్నారు. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 60 ఏండ్లు పైబడినవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు మరణిస్తున్నారని చెబుతున్న సోషల్‌ మీడియా.. 80 ఏండ్ల వృద్ధులు సైతం కోలుకున్నారనే వాస్తవాన్ని ప్రజల దృష్టికి తేవడంలేదు. వదంతులను నమ్మి చాలామంది ధైర్యం కోల్పోతున్నారని, సోషల్‌ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మొద్దని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సోషల్‌ మీడియా వదంతులకు దూరంగా ఉంటూ ధైర్యంగా ఉండడంతో కరోనాను చాలా సులభంగా జయించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

మూడు లక్షల మందికి పరీక్షలు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 3,03,383 మందికి టెస్టులు చేయగా, 43,571మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 97 శాతం మంది హోంఐసొలేషన్‌లోనే ఉంటూ రికవరీ అయ్యారు. మిగతావారు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు దవాఖానల కన్నా ప్రభుత్వ దవాఖానలోనే మెరుగైన వైద్యం అందుతున్నదని చికిత్స పొందిన బాధితులు చెబుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు కొందరు కోలుకొని ఈనెల 16న ఇంటికి తిరిగివెళ్లారు.

రికవరీలో నిజామాబాద్‌ టాప్‌..
జిల్లాకు మహారాష్ట్రతో సరిహద్దులు ఉండడంతో కరోనా తీవ్రత ఎక్కువైంది. జిల్లాలో 97శాతం బాధితులు రికవరీ అయ్యారు. ప్రతిఒక్కరూ ధైర్యంగా ఉండి మందులు వాడితే 3 నుంచి 5 రోజుల్లోనే కోలుకుంటారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలి. ఆవిరి పట్టుకోవాలి. దగ్గు, జులుబు ఉంటే వైద్యులను సంప్రదించి కరోనా పరీక్షలు చేసుకోవాలి. పాజిటివ్‌ వచ్చి సీరియస్‌గా ఉన్నవారికి దవాఖానలో చికిత్స అందిస్తున్నాం. కొందరు హోం ఐసొలేషన్‌లో ఉంటూ కోలుకున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు చాలా జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. వీలైనంత వరకు శుభకార్యాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మనోధైర్యమే మందు!

ట్రెండింగ్‌

Advertisement