మోర్తాడ్, మార్చి 28 : ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం, ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి జీవం పోసినట్లయ్యింది. సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీని ప్రకటించాలని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. పరిస్థితులు ఎలా ఉన్నా సీఎం కేసీఆర్ నిర్ణయాలు మాత్రం సంచలనాత్మకంగా ఉంటాయని మరోసారి రుజువయ్యింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తూ ఉద్యోగులంతా సంబురాలు జరుపుకొన్నారు.
ఉద్యోగ విరమణ వయస్సు మూడేండ్లు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులంతా 58 సంవత్సరాలకే ఉద్యోగ విరమణ పొందాల్సి ఉండగా ప్రభుత్వం మూడేండ్లు పెంచింది. దీంతో ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచడంతో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. ఇది ఊహించని నిర్ణయమని, తట్టాబుట్ట సర్దుకుని ఉద్యోగ స్థానం నుంచి ఇంటికి వెళ్లిపోవాలనుకున్న వారు మరో మూడేండ్లు ఉద్యోగం చేసే అవకాశం దొరకడం.. అది కూడా 30శాతం పెరిగిన ఫిట్మెంట్తో వేతనాలు వచ్చే అవకాశం రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో మార్చిలో ఉద్యోగ విరమణ పొందాల్సిన వారిలో ఉన్న ఆనందం అంతాఇంతా కాదు.
మరో మూడు జుల్లో ఉద్యోగాన్ని వీడాల్సిన వారు తిరిగి ఉద్యోగంలో కొనసాగే అవకాశం రావడంతో వారు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ కాలాన్ని మూడేండ్లు పెంచడంతో చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
30శాతం ఫిట్మెంట్
ప్రభుత్వ ఉద్యోగులందరికీ 30శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కరోనాతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమవుతున్న తరుణంలో 30శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నది. ఫిట్మెంట్తో పాటు రిటైర్మెంట్ వయసును మూడేండ్లు పెంచడం డబుల్ ధమాకా అయ్యింది.
మళ్లీ జీవం పోసినట్లయ్యింది
ఇదే నెలలో ఉద్యోగ విరమణ ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో మూడేండ్లు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే అవకాశం దొరికింది. రిటైర్మెంట్తో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మళ్లీ జీవం పోసినట్లయ్యింది. సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులకు వేతన సవరణ చేయాలన్న నిర్ణయం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది.
-నర్సింగ్‌దాస్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
ప్రమోషన్లకు అవకాశం
ఉద్యోగ విరమణ వయస్సు మూడేండ్లు పెంచడంతో చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. 30శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో పాటు ఉద్యోగ విరమణ వయసును మూడేండ్లు పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. నేను జూలైలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వ నిర్ణయంతో మరో మూడేండ్లు ఉపాధ్యాయుడిగా కొనసాగే అవకాశం లభించింది.
-మగ్గిడిశంకర్,ఉపాధ్యాయుడు, మోర్తాడ్
సీఎం నిర్ణయానికి కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు. జూలైలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరో మూడేండ్లు పనిచేసే అవకాశం లభించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో సంతోషంతో పాటు పని చేయాలన్న కసిని పెంచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించడం అందరికీ ఆనందం కలిగించింది.
-లక్ష్మీనర్సయ్య,ప్రధానోపాధ్యాయుడు, కమ్మర్పల్లి
ఇవీ కూడా చదవండి..
విజయ్‌మాల్య అప్పగింత డౌటే.. బ్రిటన్ ఏమందంటే?!
ఏప్రిల్ 1 నుంచి కార్ల ఫ్రంట్ సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి!