e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home నిజామాబాద్ నాగమడుగుకు.. తొలి అడుగు!

నాగమడుగుకు.. తొలి అడుగు!

నాగమడుగుకు.. తొలి అడుగు!

నిజామాబాద్‌, మార్చి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ దిగువ ప్రాంతమైన మంజీరలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ ప్రాంత రైతులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు సాగుకు నీళ్లు లేక అల్లాడిన అన్నదాతలు నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి ఈ పథకానికి శంకుస్థాపన చేస్తానని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడంతో స్థానిక కర్షక లోకమంతా ఎదురు చూస్తున్న క్షణాలు కొద్ది రోజుల్లోనే రానున్నాయి. ఇరిగేషన్‌ ఇంజినీర్‌, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే చొరవతో పురుడు పోసుకున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. రూ.476.25 కోట్లు మంజూరు చేయగా.. టెండర్‌ ప్రక్రియ కూడా ముగిసింది. నాగమడుగుల ఎత్తిపోతల పథకంతో పాటు మంజీరా నదిపై బ్యారేజీ నిర్మాణాలను చేపట్టడం మూలంగా జుక్కల్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకోనుండడం విశేషం. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 2వ తేదీన సీఎం కేసీఆర్‌ పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయి.
వార్షిక బడ్జెట్‌లోనూ ప్రస్తావన
2021-2022 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సాగు రంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు జరిపింది. దీంతోపాటు అనేక నూతన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లకు అనుమతులు ఇస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. వీటితో పాటే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలకంగా మారనున్న నాగమడుగల ఎత్తిపోతల పథకం పేరు సైతం బడ్జెట్‌లో పొందుపరిచారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయించి బీడు భూములన్నింటినీ సాగు నీటితో తడపాలని నిశ్చయించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంగా జుక్కల్‌ నియోజకవర్గానికి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం వెనుకబడిన జుక్కల్‌ ప్రాంతమంతా ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే కృషితో మెరుగులు దిద్దుకుంటున్నది. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారంలో ఉండి కూడా చేయలేని అనేక పనులను హన్మంత్‌ షిండే చేసి చూపిస్తున్నారు.
ఏప్రిల్‌ 2న శంకుస్థాపన…
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గ రైతన్నలకు జీవం పోసే నాగమడుగుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి 2018, సెప్టెంబర్‌ 4వ తేదీన ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపడమే తరువాయి 24 గంటల్లోనే ఉత్తర్వులు జారీ చేశారు. మంజీరా నదిపై నిర్మించబోతున్న బ్యారేజీ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంపై సమగ్ర సాంకేతిక అధ్యయనం మొదలు పెట్టే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బ్రేక్‌ పడింది. అనంతరం ఎన్నికల ప్రచార సభలోనూ నాగమడుగు ఎత్తిపోతలకు స్వయంగా తానే వచ్చి కొబ్బరికాయ కొడతానంటూ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ 2న పర్యటనకు వచ్చే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుం ద మండలాలకు ఈ ఎత్తిపోతలతో లబ్ధి చేకూరనుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన నల్లవాగు మత్తడి కింద మంజీరా నది పరీవాహక ప్రాంతంలో, నిజాంసాగర్‌ మండలం ఒడ్డెపల్లి -కోమలంచ శివారు ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు.
నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షిండే
నిజాంసాగర్‌, మార్చి27: నాగమడుగు మత్తడి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏప్రిల్‌ 2న సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో పైలాన్‌ నిర్మాణ పనులతో పాటు హెలిప్యాడ్‌, సమావేశ స్థలాన్ని ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే శనివారం పరిశీలించారు. సభాస్థలిని పరిశీలిస్తుండగా.. సీఎం కేసీఆర్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తే ఏ విధంగా రావాలి ఏ రూట్లో రావాలి అని అడిగినట్లు చెప్పారు. చేగుంట నుంచి మెదక్‌, ఎల్లారెడ్డి మీదుగా రావచ్చని తాను వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట నిజాంసాగర్‌ మండల టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గారెడ్డి, గంగారెడ్డి, విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నా చిరకాల స్వప్నం
జుక్కల్‌ నియోజకవర్గంలోని బీడు భూములను పచ్చబడేలా చేయడం నా చిరకాల వాంఛ. భారీ నీటిపారుదల ప్రాజెక్టు చారిత్రక నిజాంసాగర్‌ ఉన్నప్పటికీ సగానికి పైగా మండలాలకు సాగు నీళ్లకు తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి దశాబ్దాలుగా గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎత్తిపోతల పథకం రూపకల్పనపైనే దృష్టిసారించాను. నా ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడ మే లక్ష్యం. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నాగమడుగుల ఎత్తిపోతల పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పునాది రాయి అతి త్వరలోనే పడనుంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో జుక్కల్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో వేలాది మంది రైతులు రెండు పంటలు సాగు చేసుకునే సౌలభ్యం దక్కనుంది. ఏడాదంతా పని దొరుకుతుంది.

  • హన్మంత్‌ షిండే, జుక్కల్‌ ఎమ్మెల్యే

బీడు భూములకు సాగునీరు
మహారాష్ట్ర – తెలంగాణ రాష్ర్టాల సరిహద్దును ఆనుకుని ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలో నాగమడుగు ఎత్తిపోతల పథకం అపర సంజీవనిలా మారనుంది. ఈ ప్రాంతంలో ఎగువన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నప్పటికీ దిగువ ప్రాంత రైతులకు ఒనగూరే ప్రయోజనం శూన్యం. మంజీర అవతలి వైపు విస్తరించి ఉన్న భూభాగంలోకి వరద నీటి మళ్లింపు లేకపోవడంతో వర్షపు నీరు, బోరు బావులే దిక్కు. రెండు పంటలు పండించాలంటే గగనమయ్యే పరిస్థితి. అలాంటి దుస్థితికి చరమగీతం పాడేందుకు మంజీరా నదిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు సీఎం కేసీఆర్‌ ప్రణాళికను రూపొందించారు. బీడు భూములున్న ప్రాంతాలకు సాగు జలాలను తీసుకుపోవడమే లక్ష్యంగా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి ముందడుగు పడింది. ఇప్పటికే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పూర్తి కాగా భూసేకరణపై అధికారులు సిద్ధమయ్యారు. తక్కువ విస్తీర్ణంలో భూములు సేకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాగమడుగుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు ప్రభుత్వం రూ.476.25 కోట్లు కేటాయించింది. ఫలితంగా 40వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టును స్థిరీకరించనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాగమడుగుకు.. తొలి అడుగు!

ట్రెండింగ్‌

Advertisement