e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home నిజామాబాద్ ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు

ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు

ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు
  • వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్న వైద్య కళాశాల
  • కామారెడ్డి జిల్లా వాసుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలతో పులకించిన ఉమ్మడి జిల్లా
  • నిజామాబాద్‌లో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం
  • విద్య, వైద్యంలో మరింతగా రాణించనున్న ఉభయ జిల్లాలు

నిజామాబాద్‌, జూన్‌ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలతో దగ్గరి అనుబంధం ఈ జిల్లాకు సొంతం. నూతన జిల్లాల పరంగా భౌగోళికంగా రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్‌, మెదక్‌, సిద్ధిపేట జిల్లాలతో కామారెడ్డి సరిహద్దును కలిగి ఉంది. మరోవైపు అంతరాష్ట్ర సరిహద్దు కూడా కర్నాటక, మహారాష్ర్టాలతో పంచుకుంటోంది. ఈ ప్రాంత ప్రజలకు పొరుగు రాష్ర్టాలతో పాటుగా ఉత్తర తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలతోనూ అనుబంధం ఉంది. దశాబ్దాలుగా రాకపోకలు, వ్యాపార, వాణిజ్య అవసరాల మేరకు కార్యకలాపాల నిర్వహణ ఊహకు అందనంత వేగంగా జరుగుతున్నది. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉండడంతోనూ ఇప్పటికే మెడికల్‌ ఏజెన్సీలు, మెడికల్‌ ఉపకరణాల సరఫరాకు కామారెడ్డి హబ్‌గా మారింది. ఇక్కడి నుంచే ఉత్తర తెలంగాణకు మెడికల్‌కు సంబంధించిన ఔషధాలు, ఇతరత్రా ఉత్పత్తులు సైప్లె జరుగుతున్నాయి. ఈ క్రమంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు జరిగితే కామారెడ్డి జిల్లాకు అదనపు హంగులు సంతరించుకోనున్నాయి. విద్యాపరంగా మిగిలిన జిల్లాలతో అత్యుత్తమ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న కామారెడ్డి వాసులకు వైద్య కళాశాల రాకతో ఊహించని లబ్ధి జరగడం ఖాయం.

వైద్యానికి కొండంత అండ..
మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కావాలంటే అదో పెద్ద ప్రాసెస్‌. 500 పడకలతో కూడిన వైద్యశాల ఉంటేనే వైద్య కళాశాలకు అనుమతి దక్కుతుంది. అంటే మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో కామారెడ్డికి 500 పడకలతో కూడిన ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా దవాఖానలో కేవలం 100 పడకల సామర్థ్యమే ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో క్షతగాత్రుల రాక ఎక్కువగా ఉంటుంది. క్రిటికల్‌ కేసులు నేరుగా హైదరాబాద్‌కు పంపించే పరిస్థితి ఉంటున్నది. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అయితే ఈ ప్రాంత వాసులు మెరుగైన వైద్యం కోసం రాజధానికి పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. వైద్య కళాశాలతో పరిశోధనలు, శస్త్ర చికిత్సలు, అన్ని రకాల వేద్య సేవలు ఒకే గొడుగు కిందకు వస్తుంది. అంతేకాకుండా వైద్య విద్యను అభ్యసించే ఔత్సాహికులకు కామారెడ్డి ప్రాంతం చేరువుగా నిలుస్తుంది. తద్వార ఉత్తర తెలంగాణలోని కీలకమైన జిల్లాల్లోని యువతకు కామారెడ్డికి వచ్చి వైద్య విద్యను అభ్యసించడం పెద్ద భారమేమి ఉండకపోవచ్చు. ఇలా మెడికల్‌ కాలేజీతో వైద్య విద్య వ్యాప్తితో పాటుగా వైద్య భరోసా కూడా ప్రజలకు దక్కుతుంది.

- Advertisement -

వచ్చే ఏడాది ఏర్పాటుకు సీఎం హామీ…
కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కీలకమైన ప్రకటన చేశారు. కామారెడ్డి జిల్లాకు మెడికల్‌ కాలేజీని వచ్చే ఏడాది మంజూరు చేస్తానని చెప్పడంతో ఈ ప్రాం త వాసులంతా స్వాగతిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం ప్రకటనతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సభా వేదికగా మెడికల్‌ కాలేజీ ప్రస్తావన తేవడం వెంటనే సీఎం కచ్చితమైన హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధుల్లోనూ ఆనందం కనిపిస్తోంది. గతంలో ఈ ప్రాంతం నుంచి గెలిచి కీలకమైన పదవుల్లో నిలిచి న వ్యక్తులు ఏనాడు ప్రజల అవసరాలను గుర్తించలేదు. తెలంగాణ సర్కారు హయాంలో ఒక్కోటి నె రవేరుస్తూ… ప్రజా అవసరాలను తీరుస్తూ… సీఎం కేసీఆర్‌ సాహసోపేతంగా ముందుకు వెళ్తుండడం విశేషం. ఇప్పటికే కామారెడ్డి చుట్టు పక్కల 160 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని భూమి ఉండడంతో స్థల సమస్య ఎదురయ్యే అవకాశమే లేదు.

సర్వతోముఖాభివృద్ధి దిశగా కామారెడ్డి..
నూతన జిల్లా ఏర్పాటుతో కామారెడ్డి ప్రాంతం కొంగొత్త బాటలో పయనిస్తోంది. పాత జిల్లాలకు ధీటుగా అభివృద్ధి చెందుతూ ముందు వరుసలో పరుగులు తీస్తోంది. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో అభివృద్ధిలో రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. జాతీయ రహదారి 44తో కామారెడ్డి జిల్లా కేంద్రం టచ్‌ చేస్తూ ఉండటంతో పాటుగా ప్రధానమైన రైల్వే వ్యవస్థ కనెక్టివిటీ తోడవ్వడంతో ఈ ప్రాంతం గొప్పగా వృద్ధిలోకి వస్తోంది. రాష్ట్ర రాజధానితో కనెక్టివిటీ ఉండటం, 90 కిలో మీటర్ల దూరంలోనే ఔటర్‌ రింగ్‌ రోడ్డు టచ్‌ చేస్తుండటంతో కామారెడ్డికి అనేక అనుకూలతలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో కామారెడ్డి జిల్లా రూపురేఖలు రోజురోజుకు మారుతున్నాయి. జిల్లా ఆవిర్భావంతో ఈ ప్రాంతం ఊహించని విధంగా రూపాంతరం చెందగా తాజాగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ప్రకటనతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్యపరంగానూ అదనపు హంగులు చేరబోతుండటం సంతోషకర విషయం. వైద్య కళాశాలతో ఈ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండ దొరకనుంది.

  • గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌

ఔత్సాహిక వైద్య విద్యార్థులకు మేలు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులకు మేలు చేకూరుతుంది. వైద్య విద్యను అభ్యసించాలని అనుకునే వారికి కామారెడ్డి అనుకూలిత ప్రాంతమే. వచ్చే ఏడాది వైద్య కళాశాల మంజూరుకు సీఎం హామీ ఇవ్వడాన్ని విద్యార్థి లోకమంతా స్వాగతిస్తున్నాం. కామారెడ్డి ప్రజలందరికీ వైద్య పరంగా మేలు చూకూర్చే విషయం.

  • ఎ.రామకృష్ణ, విద్యార్థి నాయకుడు

సీఎం నిర్ణయంతో పొరుగు జిల్లాలకూ లాభం..
మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. సీఎం నిర్ణయంతో కామారెడ్డితో పాటుగా రాజన్న సిరిసిల్లా, మెదక్‌, సిద్ధిపేట, నిజామాబాద్‌ జిల్లాలకూ ఎంతో లాభం. చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కామారెడ్డి ఇప్పటికే వ్యాపార, వాణిజ్య అవసరాలు తీరుస్తున్న ప్రాంతమే. భవిష్యత్తులో వైద్య సేవలతోనూ అక్కున చేర్చుకోనుంది.

  • అనిల్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు
ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు
ఐదు జిల్లాలకు ఆరోగ్యమస్తు

ట్రెండింగ్‌

Advertisement