e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021

మౌనమేల?

మౌనమేల?

నిజామాబాద్‌, మార్చి 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదనే తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం తేటతెల్లం చేయడంతో భారతీయ జనతా పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే శక్తి లేక… పసుపు రైతుల ముందు  నిలబడే ధైర్యం కరువై కమలం పార్టీ గందరగోళానికి గురవుతున్నది. పసుపు బోర్డు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిన విషయం బీజేపీ ప్రజా ప్రతినిధులకు ముందే తెలిసినా  రైతులను మోసం చేస్తూ వచ్చారు. తీరా రాజ్య సభ సభ్యుడు సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి రావడంతో నిజం కాస్త  బయట పడింది. ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తాగా ప్రైవేటు పరం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు కొత్తగా పసుపు పంట రక్షణకు బోర్డు పెట్టడం కష్టమేనన్న అభిప్రాయాలు చాలా రోజులుగా వ్యవసాయ రంగ నిపుణులు చెబుతూనే వచ్చారు. కాకపోతే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ భిన్నంగా ప్రవర్తిస్తూ పసుపు రైతులను మోసగిస్తూ కాలం వెళ్లదీస్తూ వస్తుండగా… ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం బహిర్గతం కావడంతో అర్వింద్‌ ఆగమాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజామాబాద్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని  రైతుల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతుండడంతో ఎటూ తేల్చుకోలేక అర్వింద్‌ కొట్టుమిట్టాడుతున్నారు.  

అర్వింద్‌ వక్రభాష్యం…

చీటికి మాటికి సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే ఎంపీ అర్వింద్‌ మరోమారు పసుపు బోర్డుపై మౌనం వహించారు. బోర్డు అంశంపై నోరెత్తేందుకు సాహసించని ఆయన ఇతర అంశాల జోలికి వెళ్తూ ప్రజలను రెచ్చగొడుతున్నట్లుగా ప్రజలంతా భావిస్తున్నారు. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యేందుకు తండ్రి డీఎస్‌తో కలిసి వెళ్లిన అర్వింద్‌ మూడు రోజులుగా సభలో ఎక్కడా కనిపించకపోవడంపై  ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మంగళవారం కొద్ది మంది బీజేపీ అనుకూల మీడియాతో ఎప్పటిలాగానే రాజకీయ అంశాలనే ప్రస్తావించించారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులంతా పసుపు బోర్డుపై అర్వింద్‌ అభిప్రాయం కోరుతుండగా బోర్డు అంశాన్ని ఎత్తకుండా దాటవేత ధోరణిలో వక్రభాష్యం అల్లడం విశేషం. పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని కేంద్రం స్పష్టంగా ప్రకటన చేయగా ఎంపీ అర్వింద్‌ తన అభిప్రాయాన్ని ఎక్కడా చెప్పకపోవడంపై  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి కూడా ఎలాంటి స్పందనలు రావడం లేదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూలో మెరిసే నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కోసం ప్రజలంతా సోషల్‌ మీడియా అకౌంట్లలోనూ వెతుకులాట మొదలు పెట్టారు. పసుపు బోర్డుపై కేంద్రం నిరాశ పర్చేలా ప్రకటన చేయగా ఎంపీ అర్వింద్‌ స్పందించక పోవడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సభలో బోర్డుపై రగడ…

రాజ్యసభలో ఎంపీ సురేశ్‌ రెడ్డి పసుపు బోర్డుపై అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం లోక్‌సభలో మంగళవారం దుమారం రేపింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలంతా మూకుమ్మడిగా లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎంపీలందరూ పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనంటూ గళం ఎత్తారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలందరూ నామా నాగేశ్వర్‌ రావు సారథ్యంలో తీవ్ర స్థాయిలో కేంద్రం నిర్ణయాన్ని లోక్‌సభలోనూ ప్రతిఘటించారు. 2019 ఎన్నికల సమయంలో నిజామాబాద్‌ జిల్లాలో ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌ సైతం పసుపు బోర్డుపై రైతులకు హామీలు ఇచ్చారంటూ ఎంపీలు సభ దృష్టికి తీసుకు వచ్చారు. పసుపు రైతుల ఓట్లను వేయించుకున్న భారతీయ జనతా పార్టీ ఏడాదిన్నర కాలం తర్వాత మాట మార్చడం, రైతులను మోసం చేయడం తగదంటూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన లోక్‌సభ సభ్యులు మండిపడ్డారు. బోర్డు తెస్తానంటూ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్‌ రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ ఉదంతాన్ని లోక్‌సభలో పార్లమెంట్‌ సభ్యులు ఉద్ఘాటించారు. పసుపు బోర్డుపై జరుగుతున్న చర్చ సమయంలో ఢిల్లీలోనే ఉన్న   ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లోక్‌సభలో కనిపించకపోవడం విశేషం. చర్చ సమయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందనే భయంతోనే సభకు ముఖం చాటేసినట్లుగా రాష్ర్టానికి చెందిన లోక్‌సభ ఎంపీలు అభిప్రాయ పడ్డారు.

రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి..

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే రాజీనామా చేస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తన మాట ప్రకారం రాజీనామా చేయాలని ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పసుపు పంట సాగు చేస్తున్న రైతులంతా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంపై  తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో పసుపు రైతులంతా మంగళవారం రోడ్డెక్కి బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మలను సైతం దహనం చేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులకు బోర్డు ఏర్పాటు మాత్రమే శాశ్వత పరిష్కారమని రైతులు తేల్చి చెబుతున్నారు. బోర్డు మినహా ఏ ఇతర ప్రత్యామ్నాయం రైతులకు ఉపయోగం కాదంటూ ఖరాకండిగా చెబుతున్నారు. ఎంపీ అర్వింద్‌ ఇచ్చిన మాట ప్రకారం ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉందని… ఏడాదిన్నర కాలంగా కాలక్షేపం చేసి చివరకు రైతులను నిలువునా మోసం చేయడం తగదంటూ కర్షక లోకం తీవ్రంగా మండిపడుతున్నది. రాజీనామా చేసిన తర్వాతే నిజామాబాద్‌ జిల్లాకు రావాలంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.

‘చీటర్‌ ’ అంటూ ట్రెండింగ్‌.. 

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సోషల్‌ మీడియాలో  పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాండ్‌ పేపర్‌ ఎంపీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకుంటున్నది. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేసిన అర్వింద్‌ (చీటర్‌ అర్వింద్‌) అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జోరుగా ట్రెండింగ్‌ అవుతున్నది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పసుపు రైతులకు మద్దతుగా, బీజేపీ, ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మౌనమేల?

ట్రెండింగ్‌

Advertisement