e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home నిజామాబాద్ ఐపీఎల్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు..!

ఐపీఎల్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు..!

ఐపీఎల్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు..!

ఉమ్మడి జిల్లాలో షురూ అయిన అక్రమ వ్యవహారం
గతేడాది కామారెడ్డిలో పోలీసు శాఖను కుదిపేసిన వైనం
బంతిబంతికో రేటు… ఉభయ జిల్లాలో నిఘా పెట్టని పోలీసులు
అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత
పట్టణాల నుంచి గ్రామాలకు పాకిన బెట్టింగ్‌ జాఢ్యం
ఆర్థికంగా చితికిపోతున్న దిగువ, మధ్య తరగతి కుటుంబాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలైందో లేదో ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలోనూ క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. మ్యాచుల్లో చిన్నా, పెద్దా అంతా లీనమైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఐపీఎల్‌కు అభిమానులుగా మారారు. ఏ జట్టు ఎంత స్కోర్‌ చేసింది. ఎవరు గెలుస్తారు. ఏ క్రికెటర్‌ సిక్సులు, ఫోర్లతో హోరెత్తిస్తారనే దానిపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతున్నది. దాదాపు రెండు నెలల పాటు 50కిపైగా మ్యాచులు ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. ఏప్రిల్‌ 9న ప్రారంభమైన ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 30వ తారీఖునాడు ముగియనున్నాయి.

దీంతో సమ్మర్‌ సీజన్‌ కాస్త క్రికెట్‌ సీజన్‌గా మారిపోనుండగా… గతంలో మాదిరిగానే ఈసారి కూడా బెట్టింగ్‌రాయుళ్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి బెట్టింగ్‌లు చాపకింద నీరులా జోరందుకుంటున్నాయి. కొన్ని ప్రాంతా ల్లో పోలీసుల అండతో, మరికొన్ని చోట్ల దొంగచాటున ఈ అక్రమ తంతు మళ్లీ మొదలైంది. 2020లో జరిగిన ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారం కామారెడ్డి జిల్లాలోని పోలీస్‌ శాఖను కుదిపేసింది. బుకీలతో రూ.5లక్షలు ఒప్పందం చేసుకుని కొంత మంది పోలీసులు కుమ్మక్కయ్యారు. ఈ వ్యవహారంలో కూపీ లాగితే డీఎస్పీ, సీఐ, ఎస్సై ఇలా ఉన్నతాధికారులు జైలుకెళ్లగా… మరోమారు బెట్టింగ్‌ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నది. ఖాకీలపై మరోసారి మచ్చపడకుండా ఉం డాలంటే బెట్టింగ్‌ ముఠాలపై పకడ్బందీగా నిఘా పెట్టాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సామాన్యులను బెట్టింగ్‌ ఊబి నుంచి కాపాడాలని విన్నవిస్తున్నారు.

చాపకింద నీరులా వ్యాప్తి…
క్రీడారంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతున్నది . ఆటలంటే అందరికీ అభిమానమే అయినా క్రికెట్‌ అంటే చిన్న పిల్లవాడు మొదలు… పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఐపీఎల్‌ పేరిట బెట్టింగ్‌ జాఢ్యం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బెట్టింగ్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువకులు బెట్టింగ్‌కు బానిసై జీవితాల ను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్‌ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని బెట్టింగ్‌ ముఠాలు విచ్చలవిడిగా పందేలకు పాల్పడుతున్నాయి. ఏప్రిల్‌ 9నుంచి ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) 14వ సీజన్‌పై యువత అప్పుడే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఒకచోట గుమిగూడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లుగా సమాచారం. మరికొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెడుతున్నారు. పల్లె మొదలు పట్టణాల వరకు యువత టీవీలు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోయి ఈ విష సంస్కృతిలో కూరుకుపోతున్నారు.

పోలీసులకు తెలిసే…?
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో… చేతిలో ఉన్న కొద్దిపాటు డబ్బును కూడా పోగొట్టుకుని కొందరు రోడ్డున పడుతున్నారు. కొందరు సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు నిజామాబాద్‌, కామారెడ్డి జి ల్లాల్లోనే గతేడాది చాలా చోటు చేసుకున్నాయి. ప్ర తి ఏడాది రూ.లక్షల్లో బెట్టింగ్‌ జరుగుతున్నది. టా స్‌ నుంచి మ్యాచ్‌ ఫలితం వరకు… ప్లేయర్ల వ్యక్తిగ త స్కోర్లు, సిక్సర్లు, ఫోర్ల కౌంట్‌, స్కోర్‌ ప్రెడిక్షన్‌ ఇ లా బంతి బంతికి వందలు, వేలు, లక్షల వరకు పం దేలు జరుగుతుంటాయి. అయితే ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటే అందు లో నిజం లేదు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు తెలిసే బెట్టింగ్‌ దందా మూడు పువ్వులు… ఆరు కా యలుగా సాగుతున్నది. ఇందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో వెలుగు చూసిన అక్రమ వ్యవహారమే నిదర్శనం.ఇలా గ్రా మీణ ప్రాంతాల్లో ఖాకీల కనుసన్నల్లో గుట్టుగా బె ట్టింగ్‌ జరుగుతున్నా పట్టించుకోవడం లేద న్న విమర్శలున్నాయి. బెట్టింగ్‌ ముఠాలు పోలీసులకు బం గారు గుడ్లు పెట్టే బాతులుగా కనిపిస్తున్నాయి. బుకీ లు స్థాయిని బట్టి అధికారుల హోదాను బట్టి మా మూళ్ల లెక్కలు పెట్టుకుంటున్నట్లు సమాచారం.

మధ్యవర్తులే బుకీలుగా…

యువత ఆసక్తిని, ఇష్టాన్ని సొమ్ము చేసుకోవడం కోసం కొంత మంది ముఠాలుగా ఏర్పడుతున్నారు. బెట్టింగ్‌ సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారు. క్రికెట్‌ అభిమానులతో వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బుకీలుగా మారుతున్నా రు. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అం దిన కాడికి దండుకోవడమే బుకీల పని. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అదే సమయంలో మందు పార్టీలు సైతం చేసుకుంటూ తాగిన మై కంలో బెట్టింగ్‌లపై మోజు పెంచుకుంటున్నా రు. ప్రధానంగా గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉన్నందున సెల్‌ఫోన్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. కరోనా మూలం గా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో చాలా మంది యువత ఇండ్లలోనే ఉంటున్నారు. రోజంతా టీవీలు, సెల్‌ఫోన్లకే పరిమితం అవుతున్నారు. ఎక్కడైనా బెట్టింగ్‌ వ్యవహారం బయట పడితే పోలీసులు కొన్ని రోజులు హడావుడి చేసి కొంత మందిని అరెస్టు చూపించిన అనంతరం వారినుంచి ఎంతో కొంత తీసుకుని చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంలోనే పోలీసు లు వెంటనే స్పందించి బెట్టింగ్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐపీఎల్‌ హోరు.. బెట్టింగ్‌ జోరు..!

ట్రెండింగ్‌

Advertisement