e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home నిజామాబాద్ ఆ నాలుగు గంటలు!

ఆ నాలుగు గంటలు!

ఆ నాలుగు గంటలు!
  • రద్దీతో అక్కడక్కడా కనిపించని కొవిడ్‌ నిబంధనలు
  • మాస్కు వాడకం, భౌతిక దూరం గాలికి..
  • స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్న ప్రజలు
  • సడలింపు సమయం అనంతరం ఇండ్లల్లోనే ఉంటున్న జనం

నిజామాబాద్‌, మే 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలంతా తమ పనులను వాయిదా వేసుకొని ఇంటికే పరిమితం అవుతున్నారు. తమ అవసరాలకు సరిపడా సరుకులు సైతం కొంతమంది ఇప్పటికే తెచ్చి పెట్టుకున్నారు. మరికొందరు సడలింపు సమయంలో వెళ్లి నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే దుకాణాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలన్నీ తెరుచుకుంటున్నాయి. నాలుగు గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించిన అనంతరం నిర్ధిష్ట సమయానికి మూత పడుతున్నాయి. ఉదయం 10 గంటలకల్లా ప్రజలంతా ఇంటికి చేరుతున్నారు. ఆలస్యమైతే పోలీసులు తమదైన శైలిలో చర్యలు తీసుకుంటారనే భయంతో అరగంట ముందే ఇంటిముఖం పడుతున్నారు. ఇందులో కొంతమంది పోకిరీలు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేసి సడలింపు సమయంలో ఇష్టారాజ్యంగా తిరుగుతూ కనిపిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు సైతం ఎంతసేపు తమ అమ్మకాలపైనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప జాగ్రత్తలు పాటించడం లేదు.

నాలుగు గంటలే రద్దీ..
కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి రోజూ ఉద యం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు నిర్వహించుకునే వీలుండగా మిగతా 20 గంటలు లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని వ్యాపార సంస్థలు మూత పడుతున్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. 10 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయించగా రహదారులపై వానానాలపై వచ్చే వారిని ఆపి కారణం అడిగి పంపిస్తున్నారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండా వాహనాలపై ఇష్టారాజ్యంగా తిరిగే వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. ఉదయం సడలింపు సమయంలో మాత్రమే రద్దీ కనిపిస్తున్నది. ప్రజలు తమకు అవసరమయ్యే సామగ్రిని తెచ్చుకుంటున్నారు. చిరు వ్యాపారులు తమ పొట్ట గడిచేందుకు ప్రభుత్వం కల్పించిన నాలుగు గంటల సమయాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే తక్కువ ఆదాయమే వస్తున్నప్పటికీ ఉన్న అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు.

జాతీయ రహదారులపై..
కరోనా వ్యాప్తి భారీగా పెరిగి, పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూడడంతో బయటికి వెళ్లాలంటేనే సామాన్య జనం జంకుతున్నారు. వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయంపై సానుకూల స్పందన వస్తున్నది. జన సంచారాన్ని నిలువరించడం మూలంగా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం ఖాయమని నిపుణులు సైతం చెబుతున్నారు. జాతీయ రహదారులపై నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్నది. భారీ వాణిజ్య వాహనాల రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో వాహనాల రద్దీ భారీగా తగ్గింది. కారు, బైక్‌లు, ఇతర సొంత వాహనాల్లో తిరిగే అవకాశాలు లేకపోవడంతో జాతీయ రహదారి సైతం బోసిపోతున్నది. సడలింపుల్లో భాగంగా పలు వాణిజ్య వాహనాలకు అవకాశం ఉండడంతో ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న లారీలు సరుకులను తరలిస్తున్నాయి. ఎక్కడా ప్రజా అవసరాలు తీర్చే వాహనాలను నిలువరించడం లేదు. స్టేట్‌ హైవేపై ధాన్యం తరలింపులో భాగంగా లారీలు రోడ్లపై అక్కడక్కడా తిరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుమతులు ఉన్న నేపథ్యంలో ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.

గంపగుత్తగా కొనుగోళ్లు..

లాక్‌డౌన్‌ సమయంలో కొంతమంది వ్యక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంప గుత్తగా సామగ్రిని కొనుగోలు చేసుకొని వారం పాటు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరికొందరైతే తమకేమీ పట్టనట్లుగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సడలింపు సమయంలో పోకిరీలు కొంతమంది రోడ్లపై ఇష్టానుసారంగా చక్కర్లు కొడుతున్నట్లుగా కనిపిస్తున్నది. కూరగాయల మార్కెట్లలోనైతే రద్దీలో భౌతికదూరం గాలికి కొట్టుకుపోతున్నది. కరోనా వైరస్‌కు బ్రేక్‌ వేసేందుకు తలపెట్టిన లాక్‌డౌన్‌లో కొంతమంది ప్రబుద్ధుల తీరుతో ఇబ్బందులు వెలుగు చూస్తున్నాయి. మాస్కులు లేకుండా షికారు చేస్తుండడం మూలంగా మిగిలిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో భౌతిక దూరం, మాస్కుల వాడకంపై పోలీసులు దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 20 గంటల పాటు ఇంటికే పరిమితమయ్యే ప్రజల్లో… కొంతమంది నాలుగు గంటల సడలింపులో నిబంధనలు పాటించకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతున్నది. అధికార యంత్రాంగం తక్షణం దృష్టి సారించి రద్దీ కనిపిస్తున్న చోట కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ నాలుగు గంటలు!

ట్రెండింగ్‌

Advertisement