e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home నిజామాబాద్ ఎల్లవేళలా అండగా..!

ఎల్లవేళలా అండగా..!

ఎల్లవేళలా అండగా..!
  • కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు
  • అందుబాటులో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌..
  • కరోనా నియంత్రణపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
  • నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టరేట్లలో వేర్వేరుగా సమీక్ష

నిజామాబాద్‌, మే 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టరేట్లలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం సూచించిన పలు అంశాలను మంత్రి వేముల అధికారులకు వివరించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని పేర్కొన్నారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైందని, కొవిడ్‌ చికిత్స, అవసరాలకు ఎలాంటి ఇబ్బందులున్నా వెను వెంటనే పరిష్కారమయ్యేలా కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. కలెక్టర్లు నారాయణరెడ్డి, శరత్‌ తమ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్ల వివరాలతోపాటు జ్వర సర్వే తీరును మంత్రికి వివరించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురష్కరించుకొని వారి సేవలను మంత్రి వేముల సమావేశంలో ప్రత్యేకంగా కొనియాడారు. వారి సేవలు నిరుపమానమన్నారు.

రెండు జిల్లాల్లో సుదీర్ఘ సమీక్ష..
మహారాష్ట్ర సరిహ్దదును కలిగి ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మంత్రి తనదైన శైలిలో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం పనితనాన్ని మెచ్చుకుంటూనే.. మరింత వేగంగా, పకడ్బందీగా ప్రజలకు మేలైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని నిర్దేశించారు. మొదట కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కరోనా కట్టడి కోసం సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. ఉదయం సడలింపు ఉన్న నాలుగు గంటల సమయంలో ప్రజలంతా భౌతికదూరం, మాస్కులు ధరించే విధంగా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. నిత్యావసరాలు, అత్యవసరాల కోసం వచ్చే వారంతా జాగ్రత్తలు పాటించకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

తగ్గిన కరోనా పాజిటివ్‌ రేటు..
కరోనా పాజిటివ్‌ రేటు 27 శాతం నుంచి 15 శాతానికి పడిపోయిందని మంత్రి చెప్పారు. ఇంకా తగ్గాలని.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆరోగ్యశాఖలో అత్యవసరంగా స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి కాంట్రాక్టు పద్ధతిలో అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు సిబ్బందిని నియమించుకున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 1,204 బృందాలు, కామారెడ్డి జిల్లాలో 858 బృందాలు జ్వర సర్వే చేపట్టాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలుచేసిన జిల్లా యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, లాక్‌డౌన్‌కు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

లోతుగా విశ్లేషణ..
కొవిడ్‌ నియంత్రణపై ఉభయ జిల్లాల అధికారులతో రాష్ట్ర మంత్రి వేముల నిర్వహించిన సమీక్ష సమావేశంలో లోతైన విశ్లేషణ జరిగింది. కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం, కొవిడ్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, సాధారణ బెడ్లు, చికిత్సకు అవసరమైన ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఇంటింటా జ్వర సర్వే ద్వారా కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి కొవిడ్‌ కిట్లు, జిల్లా కేంద్ర, ఏరియా దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. కామారెడ్డి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. 719 బెడ్లు అందుబాటులో ఉంటే 258 మంది మాత్రమే భర్తీ అయ్యారన్నారు. ఇంకా దాదాపు 450 బెడ్లకు పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఐసొలేషన్‌ సెంటర్లో 300 బెడ్లు ఉన్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అద్భుతంగా పని చేస్తున్నదని మంత్రి ప్రశంసించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎల్లవేళలా అండగా..!

ట్రెండింగ్‌

Advertisement