e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home నిజామాబాద్ ధాన్యం @రూ.1137 కోట్లు

ధాన్యం @రూ.1137 కోట్లు

ధాన్యం @రూ.1137 కోట్లు
  • విజయవంతంగా కొనసాగుతున్న ధాన్యం సేకరణ
  • ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్న యంత్రాంగం
  • అన్నదాతల కోసం వైరస్‌కు ఎదురొడ్డి నిలుస్తున్న ప్రభుత్వం
  • తీవ్రంగా శ్రమిస్తున్న పౌరసరఫరాల శాఖ
  • 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించిన 82వేల మంది రైతులు

నిజామాబాద్‌, మే 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ సెకండ్‌ వేవ్‌ ముప్పు పెరుగుతున్నది. ప్రజలు బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వాలు సైతం బయట అనవసరంగా తిరగడం మానుకోవాలని సూచనలు చేస్తున్నది. మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వేగంగా ఉండడంతో పాటు భారీ నష్టాలను మిగులుస్తున్నది. అనేక మందిని దవాఖానల పాలు చేస్తున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నది. అన్నదాతల కష్టాన్ని గుర్తెరిగి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. కరోనా సమయంలో సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ దుస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం రైతుల పక్షాన నిలబడి సేవచేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వ్యయప్రయాసాలకోర్చి సేకరిస్తున్నారు. ఇంతటి కష్టకాలంలోనూ దేశంలో మరెక్కడా లేని విధంగా మద్దతు ధరను రైతుకు కల్పిస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు.

కరోనాతో విలవిల…
ధాన్యం సేకరణ ప్రక్రియలో ఆయా ప్రభుత్వ శాఖలు కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, సహకార శాఖలు క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఐకేపీ, డీసీఎంఎస్‌లు సైతం పంట సేకరణలో అక్కడక్కడ నిమ గ్నం అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను తెరవడం, పంటను కొనుగోలు చేయడమే కాకుండా ఇతర కార్యకలాపాల్లో వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు పరోక్షంగా కొనుగోలు ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరించడం మొదలు పెడితే… రైస్‌మిల్లులకు తరలించడం, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు పడే శ్రమ అంతా ఇంతా కాదు. క్షేత్రస్థాయిలో కేంద్రాల్లో వసతుల కల్పనతోపాటు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు రూ.కోట్లలో చెల్లింపులు చేయడంలో పౌరసరఫరాల శాఖ అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతుల సేవలో మునిగి తేలుతున్న అధికారులు ఇప్పటికే కొవిడ్‌ బారిన పడి విలవిల్లాడారు. కోలుకుని వచ్చాక కూడా రైతుల మేలు కోసం నడుం బిగించి పనిచేస్తుండడం గమనార్హం. సెకండ్‌ వేవ్‌లో రైస్‌మిల్లుల్లో పనిచేసే సిబ్బంది, హమాలీలు, వాహనాల డ్రైవర్లు కరోనా బారిన పడ్డారు. ఫలితంగా ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను యంత్రాంగం అప్పటికప్పుడు దాటుకుని ముందుకు సాగుతున్నది.

ప్రైవేటుకు ముకుతాడు…
ధాన్యం సేకరణ ప్రక్రియను సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతేడాది సైతం కరోనా సమయంలోనే యాసంగి 2020 పంట దిగుబడిని విజయవంతంగా సేకరించారు. లాక్‌డౌన్‌ అమలైనప్పటికీ ఎక్కడా ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారు. వానకాలం 2020లోనూ ఇదే మాదిరిగా కొనుగోళ్లు జరిపారు. దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి నేటికీ తగ్గకపోవడంతో కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా సర్కారు మాత్రం ధాన్యం సేకరణను ఆపలేదు. కోతకొచ్చిన పంటను కేంద్రాలకు తీసుకురావడమే ఆలస్యం ప్రభుత్వం కాంటాలు వేసి ధాన్యాన్ని సేకరిస్తున్నది. నిర్ణీత ప్రక్రియను 48గంటల్లో పూర్తిచేసి రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్మును జమ చేస్తున్నది. బ్రోకర్లకు, మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా నేరుగా సర్కారు ద్వారానే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రైవేటు కొనుగోళ్ల జోరుతో అన్నదాతలు ఆగమయ్యారు. మద్దతు ధర కన్నా తక్కువకే పంటను కొనుగోలు చేసి వ్యాపారులు రూ.కోట్లు సంపాదించేవారు. అమాయకులైన రైతన్నలు మోసపోవడం నిత్యం తంతుగా మారేది. కానీ ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పారదర్శకమైన చర్యలతో ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటు ఆగడాలకు పూర్తిగా చెక్‌పడినట్లు అయ్యింది.

48 గంటల్లోనే డబ్బులు జమ…
నిజామాబాద్‌ జిల్లాలో 444 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమవ్వగా ధాన్యం రాకను అనుసరించి ఇప్పటివరకు 432 కేంద్రాలు తెరిచారు. 46,935 మంది రైతుల నుంచి 4లక్షల 11వేల 378 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నేటి వరకు సేకరించారు. వీటి మొత్తం విలువ రూ.776 కోట్లు కాగా ఇందులో రూ.349 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కామారెడ్డి జిల్లాలో దిగుబడి అంచనాల మేరకు 342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని యంత్రాంగం భావించింది. 330 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా నేటి వరకు 35వేల 217 మంది రైతుల నుంచి లక్షా 92వేల 114 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి మొత్తం రూ.361 కోట్లుగా అధికారులు వెల్లడించారు. 48గంటల్లోనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పేమెంట్‌ ప్రక్రియను పూర్తి చేసి రైతుల ఖాతా ల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. మొత్తం సేకరించిన మొత్తం ధాన్యంలో 24వేల 916 మంది రైతులకు రూ.243 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. గ్రేడ్‌ ఏ – రకం ధాన్యానికి రూ.1,888, సాధారణ రకం ధాన్యానికి రూ.1,868 ధర చెల్లిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం @రూ.1137 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement