e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home కామారెడ్డి నకిలీపై నజర్‌!

నకిలీపై నజర్‌!

నకిలీపై నజర్‌!

నాసిరకం విత్తన ముఠాలపై సర్కారు కొరడా
సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఉమ్మడి జిల్లాలో పది జిల్లా స్థాయిటాస్క్‌ఫోర్స్‌ బృందాలు
జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో ఉధృతంగా కొసాగుతున్న తనిఖీలు
పత్తి సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నకిలీలకు ఆస్కారం
గ్రామ స్థాయిలోనూ నిఘా పెంచాలని కోరుతున్న రైతులు

నిజామాబాద్‌, జూన్‌ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం ప్రారంభంకావడంతో రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. నాసిరకం విత్తనాలు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెస్టిసైడ్‌, ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల బెడద అంతంత మాత్రమే. సాధారణంగా నకిలీ బెడద పత్తి, మిరప వంటి పంటలు అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లోనే వెలుగు చూస్తుంది. ఉభయ జిల్లాల్లో పత్తి పంట సాగు స్వల్పమే. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా పత్తి పంట సాగవుతుంది.

నిజామాబాద్‌లో అంతంత మాత్రంగానే పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. బోధన్‌, భీమ్‌గల్‌ ప్రాంతాలకే పత్తి పరిమితమైంది. అయినప్పటికీ నకిలీ విత్తన విక్రయాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలతోపాటుగా జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో నకిలీ విత్తనాలు విక్రయాలు జరుగకుండా ఉండేందుకు అధికారులు నిఘా పెంచారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలో ఆరు, కామారెడ్డి జిల్లాలో నాలుగు బృందాల ఆధ్వర్యంలో నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కేసు నమోదైంది. బోధన్‌ ప్రాంతంలో అనుమతి లేని పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలతో విత్తన డీలర్లు సైతం నకిలీల జోలికి వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. నకిలీ విత్తనాలు కంట పడితే సమాచారం ఇవ్వాలని రైతులను అధికారులు కోరుతున్నారు.
అంతటా అప్రమత్తం…
నకిలీ విత్తనాలపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్‌, రెవెన్యూ శాఖలు అప్రమత్తమయ్యాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ/సీపీలు సైతం నకిలీలపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణను రూపొందించారు. వ్యవసాయ శాఖ డివిజన్‌ అధికారుల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. నకిలీ విత్తన రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా గడిచిన కొన్నేండ్లుగా నకిలీ విత్తనాల తయారీ, పట్టుబడిన డీలర్ల కేసుల వ్యవహారాన్ని బయటకు తీసే పనిలో ఉన్నారు. సోయా విత్తనాల కొరత ఏర్పడడంతో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. పైగా ప్రైవేటు కంపనీలు సైతం కొరతను అనుకూలంగా మార్చుకునేందుకు నేరుగా రైతులతో మాట్లాడుకుని విత్తనాలు అంటగడుతున్నాయి. ప్రభుత్వ అనుమతి, రశీదులు లేకుండా రైతుల చేతికి విత్తనాలు చేరుతుండడంపై వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కొంత మంది మహారాష్ట్ర నుంచి సోయా విత్తనాలు తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నకిలీ విత్తనాల బెడద పోగొట్టేందుకు జిల్లా స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ బాధ్యులంతా నిరంతరం విత్తన దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.
సీఎం హెచ్చరికలతో…
కల్తీ విత్తనాల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ చట్టం కింద అరెస్టు చేయాలని ఇటీవల వ్యవసాయ శాఖపై జరిగిన అత్యున్నత సమావేశంలో నిర్ణయించారు. చిత్తశుద్ధితో పని చేసి నకిలీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకునే పోలీసులు, వ్యవసాయ శాఖల అధికారులను గుర్తించాలని పేర్కొన్నారు. అవసరమైతే వారికి యాక్సిలరీ ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకాలు ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం తక్షణం పోలీసులను రంగంలోకి దింపాలని ఆదేశాలిచ్చారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న అక్రమార్కులతో వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కయినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అవసరమైతే ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తొలగించేలా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులను ముంచి ప్రయోజనం పొందాలని చూసే ముఠాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో వ్యవసాయ శాఖలోని కొంతమంది వక్రమార్కులు దారిలోకి వచ్చారు. సీఎం ఆదేశాలతో తనిఖీలు చేపడుతూ నకిలీ విత్తనాల జాడ కనిపించకుండా చూస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సుమారుగా 800 మంది విత్తన, ఎరువుల విక్రయాదారులున్నారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 550 మంది వరకు ఉండగా నిజామాబాద్‌ జిల్లాలోనే 350 వరకు ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో విచ్చలవిడిగా మందులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ ఆదేశాలతో నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా పెంచాం. జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నాం. ఎవరైనా అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నిజామాబాద్‌లో నకిలీ విత్తనాలకు సంబంధించి బోధన్‌లో ఒక కేసు నమోదైంది.

  • గోవింద్‌,
    జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిజామాబాద్‌
  • రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
  • నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను తప్పించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వారికి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాం. అనుమతులున్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశాలు చాలా తక్కువ. విత్తనాల కొనుగోలుపై రశీదు తీసుకోవడం ద్వారా విత్తనం మొలకెత్తకపోయినా, దిగుబడి లేకున్నా, ఆయా విత్తనాల కంపెనీల నుంచి పరిహారం కోసం కొట్లాడే అవకాశం ఏర్పడుతుంది. రైతుకు రక్షణ కూడా దొరుకుతుంది.
  • భాగ్యలక్ష్మి,
    జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి, కామారెడ్డి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీపై నజర్‌!

ట్రెండింగ్‌

Advertisement