e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, April 22, 2021
Advertisement
Home నిజామాబాద్ ఉపాధిపై మహ దెబ్బ

ఉపాధిపై మహ దెబ్బ

ఉపాధిపై మహ దెబ్బ
  • పొరుగున నాందెడ్‌ జిల్లా లాక్‌డౌన్‌తో సరిహద్దులో కలవరం
  • స్వస్థలాలకు వెళ్లిపోయే దిశగా వలస కూలీలు
  • మహారాష్ట్రతో పాటు యూపీ, బీహార్‌లకు వెళ్లిపోతున్న వలస కార్మికులు
  • ఫలితంగా మూతపడుతున్న చిన్న తరహా వ్యాపారాలు
  • మహారాష్ట్రలోని మనవాళ్లు సైతం తిరుగుముఖం

బోధన్‌, ఏప్రిల్‌ 8 : పొరుగున మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో పాటు జిల్లాను ఆనుకుని ఉన్న నాందెడ్‌ జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ విధించడంతో జిల్లాలోని సరిహద్దు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నాందెడ్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు చోట్ల కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం ‘ఉపాధి’పై గొడ్డలి వేటుగా పరిణమించింది. రోజుల తరబడి మహారాష్ట్రలో కరోనా నియంత్రణలో పెద్దగా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దీంతో ఇక అక్కడ లాభం లేదనుకుంటున్న రాష్ర్టానికి చెందిన పలు జిల్లాల యువకులు, వలస కార్మికులు అక్కడి ఉపాధిని వదులుకుని తిరుగుముఖం పడుతున్నారు. మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న తమవారి యోగక్షేమాలపై బెంగ పెట్టుకున్న ఇక్కడివారు తమ పనులను మానుకుని వారి స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను ముందస్తుగా అప్రమత్తం చేయకుండా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది.

దీంతో వలస కార్మికులు సుదూర ప్రాంతాల్లోని తమ స్వస్థలాలకు పిల్లపాపలతో రోజుల తరబడి కాలినడకన, ఆకలి కడుపులతో పాదయాత్రలు చేశారు. నాటి చేదు అనుభవాలు మరువకముందే మరోసారి కరోనా విజృంభిస్తుండడం, కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తుండడం.. సహజంగానే జిల్లాకు ఉపాధి కోసం వచ్చి పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్న వలస కార్మికులకు, యువతకు ఆందోళనను కలిగిస్తోంది. మరోసారి ఏడాది కిందటి చేదు అనుభవాలు పునరావృతం కాకముందే మూటముల్లె సర్దుకోవడం మంచిదన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది యువకులు మహారాష్ట్రలోని తమ ఇండ్ల బాట పట్టా రు. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కొవిడ్‌ సమయంలో విడిచిపెట్టి ఉండేందుకు వారికి మనస్కరించడంలేదు. మహారాష్ట్రవాసులే కాకుండా జిల్లాలో యూపీ, బీహార్‌, జార్ఖండ్‌ నుంచి వచ్చి ఇక్కడ బతుకుదెరువు కోసం వివిధ రంగాల్లో కూలీలు, కార్మికులుగా పని చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు.

ఇక రైస్‌ మిల్లుల్లో పనిచేస్తున్న బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ హమాలీల సంగతి సరేసరి.. రైస్‌ మిల్లుల సంగతలా ఉంచి, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బేకరీలు, ఐస్‌క్రీముల తయారీ, జ్యూస్‌ల తయారీ తదితర వ్యాపారాల్లో కార్మికులుగా పనిచేసేవారి సంఖ్య వేలల్లోనే ఉంది. సీఎం కేసీఆర్‌లా వారి సొంత రాష్ర్టాల సీఎంలు, ప్రభుత్వాలు వారిలో లాక్‌డౌన్‌ ఉండదన్న భరోసాను ఇవ్వలేకపోతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా ఎండాకాలంలో జిల్లా సరిహద్దులోని అనేక ఐస్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వాటి నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో ఐస్‌క్రీముల తయారీ, రోడ్ల పక్కన జ్యూస్‌ల తయారీకి మంచి డిమాండ్‌ ఉంది.
ఈ వ్యాపారాల నిర్వాహకులు వాటి అమ్మకాల కోసం మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ల నుంచి వలస వచ్చిన యువకులను పనులకు పెట్టుకునేవారు. అదేవిధంగా బేకరీలు, బ్రెడ్‌ ఫ్యాక్టరీల్లో కూడా ఆ రాష్ర్టాల యువకులే ఎక్కువగా పనిచేస్తుంటారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులతో వారు తమ యజమానులు వెళ్లవద్దని వారిస్తున్నప్పటికీ వినిపించుకోవడంలేదు. పనులు చేసేవారు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఈ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.

నాందెడ్‌ జిల్లాలో తగ్గుముఖం పట్టని కరోనా..

నాందెడ్‌ జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. లాక్‌డౌన్‌ విధించినా.. మరోపక్క రాత్రి కర్ఫ్యూ అమలుచేస్తున్నా.. పరిస్థితుల్లో మార్పు కనిపించడంలేదు. లాక్‌డౌన్‌తో పొరుగున వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో అక్కడ ఉపాధి పొందుతున్న జిల్లాకు చెందిన వ్యాపారులు, కార్మికులు, చిరుద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. నాందెడ్‌ జిల్లాలోని బిలోలి, దెగ్లూర్‌, నాయగావ్‌, నర్సీ ప్రాంతాల్లో జిల్లాకు చెందిన అనేకమంది విద్యాసంస్థలు, కాన్వెంట్లు నడుపుతున్నారు. వారంతా కొంతకాలంగా ఉపాధిని కోల్పోయారు. ఇక, నాందెడ్‌లో కరోనా మరణమృదంగం వినిపిస్తోంది. నాందెడ్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మరణించిన కరోనా రోగుల అంత్యక్రియలను నాందెడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తున్నది. అక్కడి కార్పొరేషన్‌ దహన వాటికలో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కేవలం ఆంక్షలతో కూడిని ప్రజారవాణాకు మాత్రమే అక్కడ అనుమతి ఇస్తున్నారు.

రైస్‌మిల్లుల హమాలీల కోసం..

జిల్లాలో 280 రైస్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ఇతర పనుల కోసం సుమారు పది వేల మంది హమాలీలు పనిచేస్తుంటారు. హమాలీలుగా పనిచేయడంతో పాటు రైస్‌ మిల్లుల్లో డ్రైవర్‌, మెకానిక్‌లుగా కూడా పెద్ద సంఖ్యలోనే కార్మికులు పనిచేస్తుంటారు. గత కొన్నేళ్లుగా వీరంతా ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, బీహార్‌ తదితర రాష్ర్టాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరికి కూడా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ భయం పట్టుకుందని రైస్‌మిల్లర్లు వాపోతున్నారు. ప్రతి ఏటా వీరు ‘హోలీ’ పండుగ సందర్భంగా ఉత్తరాది రాష్ర్టాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. పండుగకు వారం రోజుల ముందే వెళ్లడం, పండుగ కాగానే తిరిగి వస్తుంటారు. అయితే, ఈసారి హోలీకి వెళ్లిన హమాలీలు లాక్‌డౌన్‌ భయంతో ఏ మేరకు తిరిగివస్తారన్న ఆందోళన నెలకొంది. తగిన సంఖ్యలో వారు రాకుంటే.. పనుల్లో రోజులతరబడి జాప్యం జరుగుతుంటుంది. గత లాక్‌డౌన్‌ అనంతరం వానకాలం సీజన్‌లో మొదట్లో తక్కువ మందే రైస్‌ మిల్లులకు వచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడ్డాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా భయంతో పాటు తమ రాష్ర్టాల్లో నెలకొన్న పరిస్థితుల్లో తిరిగివచ్చే హమాలీల సంఖ్య తగ్గుతుందేమో అనే బెంగ రైస్‌ మిల్లర్లలో కనిపిస్తున్నది. ఏది ఏమైనా.. వారి రాకకోసం ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి.

ఇవీ కూడా చదవండీ…

తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం.. ఓపాడ్స్‌ను ప్రారంభించిన తెలంగాణ బాలిక

93 మందికి ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందించిన మంత్రి కేటీఆర్

కర్ణాటక సీఎం య‌డ్యూర‌ప్ప‌కు ప‌ద‌వీగండం: మే 2 త‌ర్వాత మార్పు త‌ప్ప‌దా?‌

Advertisement
ఉపాధిపై మహ దెబ్బ

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement