e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home నిజామాబాద్ నగరానికి ‘వాహన’ సంపద..!

నగరానికి ‘వాహన’ సంపద..!

నగరానికి ‘వాహన’ సంపద..!
  • నగరాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గా మార్చేందుకు ప్రయత్నం
  • కార్పొరేషన్‌ పరిధిలో సమకూరిన 151 వాహనాలు
  • పాతవి 81, ఏక కాలంలో 70 కొత్త వాహనాలు రాక
  • నగరంలో 180 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ లక్ష్యం
  • స్వచ్ఛ నగరంగా మార్చేందుకు అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల వ్యూహం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టణీకరణ ప్రభావంతో పట్టణాలు, నగరాలు అభివృద్ధిరాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. అందులో నిజామాబాద్‌ జిల్లా కేంద్రం మరింత స్పీడ్‌తో ముందుకు సాగుతున్నది. నిన్నా మొన్నటి వరకు కొద్ది పాటి ప్రాంతానికే పరిమితమైన నగరం గడిచిన ఆరున్నరేండ్ల కాలంలో ఊహించని ప్రగతిని సాధించింది. గ్రామాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగర జనాభా సైతం అమాంతం పైపైకి ఎగబాకుతోంది. నివాసాల సంఖ్య పెరగడం, నగర పరిధి ఊహించని విధంగా విస్తరించడంతో ప్రజా అవసరాలు తీర్చేందుకు నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై తీవ్రమైన భారం పడుతున్నది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రజా అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రద్ధ చూపుతున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు చెత్తాచెదారంతో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలన్న కోణం లో పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్‌ బాటలోనే నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సైతం నిజామాబాద్‌ నగరాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తున్నారు. మరోవైపు వందల టన్నుల చెత్త సేకరణకు ఆటంకాలు లేకుండా భారీ ఎత్తున వాహనాలను నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు సమకూర్చడంతో పాటు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా నిజామాబాద్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

చెత్త సేకరణకు వాహన సంపత్తి…
నిజామాబాద్‌ నగరంలో ప్రస్తుత జనాభా దాదాపు 5లక్షలకు చేరింది. పలు గ్రామాలు విలీనం కావడంతో పరిధి విస్తరించింది. దశాబ్ద కాలం క్రితం నిజామాబాద్‌ నగరంలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే చెత్త సుమారు 130 మెట్రిక్‌ టన్నులు. ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఉత్పత్తి అయ్యే చెత్త దాదాపుగా 180 మెట్రిక్‌ టన్నులు. పదేండ్లలో భారీగా చెత్త బయటికి వస్తున్నది. ఒక రోజు చెత్త సేకరణ జరుగకపోతే వాడలన్నీ మురికి కూపాలుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందు చూపుతో పెరిగిన జనావాసాల సంఖ్యకు తగ్గట్లుగా నిజామాబాద్‌ నగర పాలక సంస్థకు వాహన సంపత్తి భారీగా పెరిగింది. వాహనాల సంఖ్య 81 నుంచి ఏకంగా 151కు చేరింది. ఇవన్నీ నిజామాబాద్‌ నగర వ్యాప్తంగా గల్లీల్లో తిరుగుతూ చెత్తను సేకరించనున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 81 పాత వాహనాలున్నాయి. వీటిలో ఆటో టిప్పర్లు 46, ట్రాక్టర్లు 13, టిప్పర్లు 3, లారీలు 2, ప్రైవేట్‌ ట్రాక్టర్లు 13, కంపాక్టర్స్‌, 2 జేసీబీలు, 2 స్వీపింగ్‌ యంత్రాలు వంటి వాహనాలున్నాయి. వీటికి తోడుగా ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులతో రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.6.50 కోట్లతో 70 వాహనాలు కొనుగోలు చేశారు. కొత్త వాహనాల్లో 43 ఆటో టిప్పర్లు, 20 ట్రాక్టర్లు, 7 టిప్పర్లు ఉన్నాయి. పాత వి, కొత్తవి కలుపుకొంటే ఆటో టిప్పర్లు 89కి చేరా యి. ట్రాక్టర్లు 33, టిప్పర్లు 10కి చేరడం విశేషం.

నివాస ప్రాంతాల నుంచే అధికం..
నగరమంతా ఉత్పత్తి అయ్యే చెత్తలో నివాసాలు, వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లు, హోటళ్లు, దవాఖానలు, వీధులు ఇలా భిన్న ప్రాంతాల నుంచి తీసే వృథాను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఇందులో అత్యధికంగా నివాస ప్రాంతాల నుంచి వస్తున్నదే ఉంటుంది. కొత్త వాహనాలతో పాటు చెత్త సేకరణలో భాగంగా సిబ్బందిని కార్పొరేషన్‌ అధికారులు నియమించారు. కొత్త వాహనాలకు 70 మంది డ్రైవర్లు, నూతనంగా శానిటరీ వర్కర్లు 300 మంది నియామకంతో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. చెత్త సేకరణ ఉద్దేశించి చేకూర్చిన వాహనాలన్నీ తడి, పొడి చెత్తకు అనుకూలంగా వేర్వేరుగా బాక్సులు సైతం నిర్దేశించారు. నగరంలో అన్ని డివిజన్లలో ప్రతి నివాసానికి రెండేసి చొప్పున తడి, పొడి చెత్త కోసం బుట్టలను ఇప్పటికే సరఫరా చేశారు. ఇంటి నుంచే వేరు చేసే తడి, పొడి చెత్తను వాహనాల్లో వేరు చేసి డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఇందులో ఎరువుకు ఉపయోగమయ్యే చెత్తను కంపోస్టు షెడ్డుకు తరలిస్తారు.

నగరం మారింది…
నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో గతమంతా దుర్గంధభరితం. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వీధులను, రోడ్లను పట్టించుకునే వారే కరువు. చెత్త నిర్వహణపై కనీస చిత్తశుద్ధి లేకపోయేది. వాడల్లో దుర్గంధభరితమైన వాసన. మురికి కాలువలు పొంగి పొర్లి అస్తవ్యస్తంగా కనిపించేవి. ఒకప్పుడు కాలనీల్లో చెత్త తీసుకుపోయేందుకు మున్సిపల్‌ సిబ్బంది వచ్చేవారు కాదు. దిక్కులేక జనమంతా వీధుల్లో మూల మలుపు వద్ద చెత్తను కుప్పలుగా పోసి వదిలేసేవారు. ఆ పరిస్థితి లేకపోతే ఇంటి ప్రహరీ నుంచి ఆవలి వైపు చెత్తను గుమ్మరించి చేతులు దులుపుకొనేది. ఇక మార్కెట్లు, దవాఖానల నిర్వాహకులైతే విషతుల్యమైన చెత్తను బహిరంగ ప్రదేశాల్లోనే వదిలేసే వారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురపాలక వ్యవస్థ అంతా గాడిలో పడింది. నిజామాబాద్‌ నగరం కూడా సర్వాంగ సుందరంగా రూపాంతరం చెందింది. రోడ్లపై చెత్త వేయకుండా కట్టుదిట్టం చేయడం, వ్యాపార సంస్థల నుంచి సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, నగరంలో చెత్త సేకరణ కేంద్రాలను ప్రత్యేకంగా నెలకొల్పడం కలిసి వస్తున్నది. నగరంలో పరిశుభ్రతకు ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా తీవ్రంగా శ్రమిస్తూ… నిధుల కొరత తీర్చడం, కార్మికుల నియామకాలు, కొత్త వాహనాలు కొనుగోలుతో గ్రీన్‌ సిటీగా నగరం బాటలు పరుచుకుంటున్నది.

భవిష్యత్తు తరాల మేలు కోసమే
నిజామాబాద్‌ నగరా న్ని ఆదర్శవంతంగా రూపుదిద్దేలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే మౌ లిక సదుపాయాల కల్పనతో గతానికి భిన్నంగా నిజామాబా ద్‌ కనిపిస్తున్నది. నగర ప్రజల అవసరాలను ప్రభుత్వం గుర్తించి వెనువెంటనే పరిష్కారం చూపుతున్నది. సిటీలో శానిటేషన్‌ మెరుగుదలకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం. తద్వారా ఆరోగ్యవంతమైన నగరంగా, క్లీన్‌ సిటీగా త్వరలోనే నిజామాబాద్‌ను భిన్నమైన రీతిలో మనం చూడబోతున్నాం. ఇప్పు డు కొత్తగా 70 వాహనాలు కొనుగోలు చేశాం. త్వరలో మరిన్ని వాహనాలను నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమకూర్చబోతున్నాం. ఈ వాహనాలు అన్నీ చెత్త సేకరణకు డివిజన్లలోకి వస్తాయి. నగర ప్రజలంతా తడి, పొడి చెత్తను వేరు చేసి శానిటేషన్‌ సిబ్బందికి సహకరించాలి. భవిష్యత్తు తరాల మేలు కోసమే ఒక విజన్‌తో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.
-బిగాల గణేశ్‌ గుప్తా, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే

ఇవీ కూడా చదవండీ..

లేహ్‌, మిజోరాంలో భూకంపం

బెంగాల్‌లో రూ. 248 కోట్లు సీజ్

మొస‌లి త‌ల‌పైకి ఎక్కిన‌ కోడి.. చివ‌రికి ఏమైందో తెలుసా?.. వైర‌ల్ వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నగరానికి ‘వాహన’ సంపద..!

ట్రెండింగ్‌

Advertisement