శనివారం 11 జూలై 2020
Nizamabad - May 26, 2020 , 02:22:51

ఎంపీ అర్వింద్‌పై ఇందూరు రైతుల తీవ్ర ఆగ్రహం

ఎంపీ అర్వింద్‌పై ఇందూరు రైతుల తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్‌  : “పసుపు బోర్డు తెస్తా.. ఎర్రజొన్న, పసుపునకు మద్దతు ధర కల్పిస్తా..” అంటివి.. ఏడాదైంది ఇంకెంతకాలం బొంకుతవ్‌.. అని ఇందూరు రైతులు ఎంపీ అర్వింద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, వాటిని నెరవేరుస్తానని వంద రూపాయల బాండ్‌ పేపర్‌పై సంతకం చేసిన అర్వింద్‌ మాట నిలబెట్టుకోలేక చతికిలబడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టి మే 23వ తేదీ నాటికి ఏడాది పూర్తయినప్పటికీ పసుపుబోర్డుపై కనీసం మాటైనా ఎత్తకుండా తప్పించుకు తిరుగుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ తానిచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరమైన వైఫల్యాన్ని అర్వింద్‌ మూటకట్టుకోవడం రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారి తీస్తున్నది. 

కేంద్ర సర్కారు శీతకన్ను...

పసుపు బోర్డు ఏర్పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత రైతుల చిరకాల కోరిక. బోర్డు ఏర్పాటు నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కావడంతో తెలంగాణ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు కోసం తీవ్ర స్థాయిలో  ఉద్యమం చేశారు. పార్లమెంట్‌ వేదికగా అనేక సార్లు గళమెత్తి కేంద్రం తీరును ఎండగట్టారు. 2014 నుంచి 2019 వరకు టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ను నెరవేర్చని బీజేపీ సాధారణ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో ముందుకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు బోర్డు ప్రతిపాదనకు ముఖంచాటేసిన ఎన్డీఏ పెద్దలే ఎన్నికల సమయానికి అమాయక రైతులను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించారు. రైతుల భావోద్వేగాన్ని ఆసరా చేసుకుని 2019 సాధారణ ఎన్నికల బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్‌ బీజేపీకి ఓటేస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు వస్తుందని రైతులను నమ్మించి గెలిచిన తరువాత చేతులు దులిపేసుకున్నాడు. 

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విమర్శల హోరు...

ప్రజలను మభ్యపెట్టేందుకు కొన్ని పార్టీలు సోషల్‌ మీడియాను వేదికగా మలుచుకుంటున్నాయి. రాష్ర్టాలు చేసే సాయాన్ని సైతం తామే చేసుకున్నామంటూ దొంగ ప్రకటనలతో అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కా లం నుంచి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొ నే అనేక మంది తెలంగాణ వాదులు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అకౌంట్లను విమర్శలతో దాడి చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌లోకి వస్తే చాలు... పసుపు బోర్డు ఎక్కడంటూ ఎంపీని ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా హల్‌ చల్‌ చేద్దామనుకునేలోపే ఎంపీకి నెటిజన్ల దాడితో తోకముడియాల్సి వస్తుండడం చర్చనీయాంశం అవుతున్నది. ఒకానొక దశలో నెటిజన్లకు సమాధానం చెప్పలేక ఎంపీ అర్వింద్‌ అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. చేసేది లేక ఫాలోవర్స్‌ను బ్లాక్‌ లిస్టులో చేర్చి తప్పించుకుంటున్నట్లుగా సమాచారం.

2017లోనే రీజినల్‌ కార్యాలయంపై ఆలోచన...

పసుపు బోర్డు తెస్తానంటూ మాటిచ్చిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పూటకో మాట చెబుతూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారు. సరిగ్గా మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ను కాపాడుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. ఇందులో భాగంగా 2020, ఫిబ్రవరి 5న  ఢిల్లీలో ఎంపీ నోట ఓ ప్రకటన వెలువడింది. నిజామాబాద్‌లో రీజినల్‌ ఆఫీస్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతున్నదనేది అందులోని ముఖ్యాంశం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ ఇదే విషయాన్ని చెప్పించారు. ప్రాంతీయ కార్యాలయంఏర్పాటు బోర్డు ఏర్పాటు కంటే పెద్దదన్నట్లుగా భ్రమలోపడేసే విధంగా బీజే పీ నాయకులు ప్రయత్నించారు. అయినప్పటికీ రైతులు ఎం పీ కుటిలప్రయత్నాలను తిప్పికొట్టారు. పసుపు బోర్డు తప్ప తమకేదీఅక్కర్లేదని తెగేసి చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు గట్టి జవాబిచ్చారు. అసలు విషయానికి వస్తే 2020, ఫిబ్రవరి 5న కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ చేసిన ప్రకటన 2017లోనే రావాల్సింది. అప్పట్లో దీనిని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. పసుపు బోర్డు కోసమే పట్టుబడి పోరాటం చేసింది. పసుపు బోర్డు ఇవ్వలేని కేంద్రం అప్పటి నుంచి తప్పించుకుంటున్నది. 


logo