బాన్సువాడ రూరల్, జూన్19:నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. ఈ రెండక్షరాల పదంలో వ్యక్తి జీవితం మొత్తం దాగి ఉంది. ప్రతి ఒక్కరికి మొదటి హీరో తండ్రి అయితే ఆడబిడ్డకు మొదటి స్నేహితుడు తండ్రి. చిన్నప్పటి నుంచి పిల్లలు వేసే ప్రతి అడుగు వెనక తండ్రి ఉంటాడు. తప్పటడుగులు వేసే వయసు నుంచి తప్పుడు అడుగులు వేసినా వెంట ఉండి మంచి మార్గాన్ని చూపిస్తాడు తండ్రి. తండ్రి ఆకాశం, తల్లి భూదేవి లాంటిదని, పిల్లలు చేసే తప్పులను తండ్రి ఆకాశమంత హృదయంతో క్షమిస్తాడని, తల్లికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందని పెద్దలు చెపుతుంటారు. పిల్లలు పుట్టినప్పుడే తల్లిదండ్రులకు అసలైన పండుగగా భావిస్తుంటారు. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలు ఎలా ఉన్నారని కన్న తండ్రి మనస్సు పరితపిస్తుంది. తాను ఎన్ని విజయాలు సాధించినా బిడ్డల గెలుపే తండ్రికి నింగిని గెలిచినంత ఆనందంగా ఉంటుంది. బిడ్డలకు ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా కుటుంబ పెద్దగా పిల్లలకు దశ దిశను సూచిస్తాడు కన్న తండ్రి. కన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉంది. ఫాదర్స్ డే సందర్భంగా 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకొంటారు.
ఫాదర్స్ డే నేపథ్యం..
మాతృ దినోత్సవం సందర్భంగా తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో, బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతి రూపంగా 1910లో మొదటి సారి ఫాదర్స్ డే నిర్వహించారు. ఆ తరువాత నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్‌లో వచ్చే మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించుకొని నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్‌లోని మూడో ఆదివారం ఫాదర్స్‌డేను ఘనంగా జరుపుకొంటున్నారు. బిడ్డలు తండ్రులకు గిఫ్ట్‌లు అందించి నాన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ తండ్రిపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.
బిడ్డలకు మార్గదర్శకుడు..
ప్రతి తండ్రి తమకు కలిగిన సంతానం దేవుడిచ్చిన వరంగా భావిస్తుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా తన పిల్లలను చూసి ఉపశమనం పొందుతూ ఆనందం పొందుతుంటారు. పిల్లలే లోకంగా భావిస్తూ వారి బంగారు బాటకు పునాదులు వేస్తుంటాడు తండ్రి. తప్పటడుగులు వేసే నుంచి తప్పుడు అడుగులు వేసే బిడ్డలపై నిరంతరం దృష్టి సారించి మంచి మార్గాన్ని చూపిస్తూ ముందుకు సాగుతాడు. బిడ్డ జీవితానికి ఒక కథానాయకుడిగా ముందుండి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప వ్యక్తి తండ్రి. జీవితంలో బిడ్డకు ఒక స్నేహితుడిగా, కథానాయుడిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సర్వస్వం కోల్పోయినా చింతించగా వెన్నంటి ఉండే గొప్ప స్నేహితుడు తండ్రి. బిడ్డలకు కష్టాలు రాకుండా ముందు జాగ్రత్తతో ఒక బాటను రూపొందించి ముందుకు సాగేలా నిరంతరం శ్రమించే నాయకుడు తండ్రి.
తండ్రిని గౌరవించినప్పుడే సమాజంలో గుర్తింపు…
తల్లిదండ్రును గౌరించినప్పుడే ప్రతి బిడ్డకు సమాజంలో గుర్తింపు వస్తుంది. తల్లిదండ్రులను బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలపై ఉంటుం ది. మారుతున్న సమాజంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. బిడ్డ ఎదుగుదలకు నిరంతరం శ్రమించే సంఘజీవి తండ్రి అలాంటి తం డ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోక పోవడం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పటి నుంచి బిడ్డల కోసం కష్టపడి జీవితమంతా బిడ్డ ఎదుగుదల కోసం ధారపోసిన తల్లిదండ్రులను దూరం చేయడం నవ సమాజ నిర్మాణానికి మంచిది కాదు. తండ్రులను గౌరవించి మనం మన పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.