e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కామారెడ్డి అక్షర దివిటీ.. నమస్తే తెలంగాణ

అక్షర దివిటీ.. నమస్తే తెలంగాణ

అక్షర దివిటీ.. నమస్తే తెలంగాణ

స్వరాష్ట్ర సాధన నుంచి సుపరిపాలన వెలుగుల వైపు..
సమైక్యాంధ్ర కుట్రలను చేధించిన ఉద్యమ వారధి
ఉమ్మడి రాష్ట్రంలో స్వీయ అస్తిత్వానికి ప్రతీకగా నమస్తే తెలంగాణ
పది వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ పత్రిక
ప్రజల చైతన్యానికి అక్షర తూటాలై నిలిచిన కథనాలెన్నో..

నిజామాబాద్‌, జూన్‌ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షతో పుట్టిన నమస్తే తెలంగాణ దిన పత్రిక పది వసంతాలు పూర్తి చేసుకున్నది. సమైక్యవాదుల కుట్రలను ఛేదిస్తూ పురుడు పోసుకున్న ఉద్యమ పత్రిక దశాబ్ద కాలాన్ని దాటుకుని పదకొండో వసంతంలోకి అడుగు పెడుతున్నది. 60 ఏండ్ల పోరాటానికి ఊపిలూదిన ఉద్యమ పత్రిక నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రాంత అభివృద్ధే ఆకాంక్షగా ఎదిగింది. నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంత గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి చూపించింది. కొంగొత్త తెలంగాణను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేసింది. సమైక్యాంధ్ర పాలకులు, సమైక్యాంధ్ర పత్రికలు ఏనాడూ చేయని పనిని నమస్తే తెలంగాణ చేసి చూపించింది. రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంలో ప్రజా గొంతుకైన తెలంగాణ పత్రిక… నిత్య ఉషస్సులతో శుభోదయాన నమస్తే తెలంగాణగా ప్రతీ గడపను పలుకరిస్తూ, ప్రజల జీవనాడిని అనుకరిస్తూ ముందుకు సాగుతున్నది. స్వరాష్ట్రంలోనూ వెనుకబడిన తెలంగాణ పురోగభివృద్ధికి తనవంతు బాధ్యతగా అండగా నిలుస్తున్నది. తెలంగాణే ఆశగా, శ్వాసగా మార్చుకున్న నమస్తే తెలంగాణ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ అలుపెరగని అక్షర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.

ఉద్యమ దివిటీ…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో సమైక్య వాదుల కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. అడుగడుగునా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం. అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ నినాదాన్ని తొక్కి పెట్టే కుటిల నీతి. తెలంగాణ గొప్పతనాన్ని చులకన చేయడం. యాసను, భాషను అవమానించడం. సంస్కృతి, సంప్రదాయాలను లెక్కచేయని తత్వం. ఇలా ఒకటా రెండా అడుగడుగునా తెలంగాణ పదాన్ని వినపడకుండా… కనపడకుండా చేసేందుకు ఆంధ్రా పాలకులు, సమైక్యాంధ్ర మీడియా శక్తులు చేసిన కుటిల యత్నాలు అనేకం. అలాంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన నమస్తే తెలంగాణ పత్రిక అక్షర తూటాలై స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో క్రియాశీలకంగా మారింది. తెలంగాణ ప్రజలంతా ‘మన పత్రిక – మన ఆత్మగౌరవం’ పేరుతో గుండెలకు హత్తుకోవడంతో అనతి కాలంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఉద్యమ కాలమంతా పోరాటయోధులకు దివిటీగా మారి చుక్కానిగా నమస్తే తెలంగాణ నిలిచింది. మరుగన పడిన చరిత్రను వెలికి తీయడంలో, ఈ ప్రాంత బిడ్డల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడంలో, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడంలో నమస్తే తెలంగాణ పాత్ర అనిర్వచనీయం.స్వరాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు నమస్తే తెలంగాణ దినపత్రిక అండగా నిలిచింది. ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా అమరులకు సముచిత గౌరవం లభించే విధంగా తనవంతు పాత్రను పోషించింది.

సుపరిపాలనలో భాగమై..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌ ఆధారంగా కేసీఆర్‌ పరిపాలన సాగుతున్నది. ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ కావడంతో రైతులోకానికి ఇబ్బందుల్లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగుకు 24గంటల కరెంట్‌, సాగునీటి ప్రాజెక్టులతో పాటు చివరకు పండించిన పంటను కొనుగోలు చేయ డం వరకు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండంత అండగా నిలుస్తున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, 102 సేవలు, యాదవులకు గొర్రెల యూనిట్లు, మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ, బీసీలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధికి బాటలు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, కొత్త జిల్లాలు, నూతన మండలాలు, నూతన జీపీలతో పరిపాలనలో వెలుగులు తీసుకు వస్తున్న కేసీఆర్‌ ప్రయత్నంలో నమస్తే తెలంగాణ ఓ భాగమైంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఉద్యమ పత్రికగా నమస్తే తెలంగాణ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు నేటికీ తెలంగాణ రాష్ర్టాన్ని పట్టి పీడిస్తున్న సమైక్యాంధ్ర మీడియా శక్తుల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో అలుపెరగని కృషి చేస్తోంది. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చి సమాజానికి పరిచయం చేస్తోం ది. వారిలో నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి చూపించి వారిని హీరోలుగా సగర్వంగా నిలబెడుతున్నది.

గల్ఫ్‌ బాధితుల కన్నీళ్లు తుడిచి..
గత పాలకుల తీరుతో ఉపాధి కరువై ఎంతో మంది అప్పులు చేసి మరీ ఎడారి దేశాల బాట పట్టారు. గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలతో కొందరు.. అక్కడి వెళ్లినా సరైన ఉపాధి దొరక్క మరికొందరు నరకయాతన అనుభవించారు. కొంత మంది చేయని తప్పులకు అక్కడి జైళ్లలో మగ్గిపోయారు. వివిధ కారణాలతో మరణించిన వారి మృతదేహాలు స్వగ్రామాలకు చేరాలంటేనే గగనమైన పరిస్థితి. గల్ఫ్‌ బాధితులు, వారికి కుటుంబాలకు ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలబడింది. దేశం కాని దేశంలో వారు పడుతున్న కష్టాలను ‘గల్ఫ్‌గోస’ పేరిట వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను చూపింది.

ఇసుక మాఫియాపై కొరడా..
2011 నుంచి 2013 వరకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నదిలో మహారాష్ట్ర సర్కార్‌ మద్దతుతో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా కొనసాగించిన ఇసుక దోపిడీపై ‘నమస్తే తెలంగాణ’ కొరడా ఝుళిపించింది. వరుస కథనాలు ఇసుకాసురుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. నిమ్మకు నీరెత్తునట్టుగా ప్రవర్తించిన నాటి సీమాంధ్ర ప్రభుత్వంలోని అధికారులను కదిలించింది. దీంతో 2013 చివరిలో ఇసుక మాఫియా స్వైరవిహారానికి అడ్డుకట్టపడింది. స్వరాష్ట్ర ఉద్యమంలో బోధన్‌ కేంద్రంగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 1519 రోజులపాటు దీక్షలు జరిగాయి. ఈ దీక్షలకు, రాష్ట్ర సాధన కోసం తెలంగాణవాదులు కొనసాగించిన వివిధ పోరాటాలకు ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలబడింది.

అక్రమార్కులపై ధర్మగంట..

స్వరాష్ట్రంలో ప్రగతిశీల ఆలోచనలతో తెలంగాణ రాష్ర్టా న్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరుగులు పెట్టిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే మే టిగా ని లుపుతూ ప్రత్యేకతను చాటారు. వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవడంలో కేసీఆర్‌ ఉద్యమ తరహాలోనే అభివృద్ధిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్తున్నారు. వ్యవసాయక రాష్ట్రంలో భూసమస్యలు, భూలావాదేవీల చుట్టూ నిత్యం పల్లెల్లో ఘర్షణలు, గొడవలు పరిపాటిగా మారుతున్నాయి. రెవెన్యూ శాఖ కేంద్రంగా జరుగుతున్న అవినీతి పెచ్చుమీరడంతో నమస్తే తెలంగాణ పత్రిక తనవంతు బాధ్యతగా కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ధర్మగంట శీర్షికతో వరుసగా అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ ఉద్యోగుల లీలలను చీల్చి చెండాడింది. ఆధారాలతో సహా అక్రమార్కుల బండారాన్ని బయటపెట్టడంతో సామాన్యులకు అనేక రకాలుగా ఉపశమనం జరిగింది. భూ సమస్యలకు పరిష్కార మార్గం లభించడంతో పాటు నమస్తే తెలంగాణ కథనాలతో జఠిలమైన భూ సమస్యలకు కాస్తా పరిష్కార మార్గం లభించినట్లు అయ్యింది. ఇలా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ధర్మగంట మోగించిన మోతకు అనేక మంది అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అక్షర దివిటీ.. నమస్తే తెలంగాణ

ట్రెండింగ్‌

Advertisement