కమ్మర్పల్లి, జనవరి 30: మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్ని ప్రమాదం సంభవించి పెద్ది నారాయణకు చెందిన ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బట్టలు, సామగ్రితోపాటు ఇంట్లో దాచుకున్న రూ.2.50 లక్షల నగదు బుగ్గిపాలైంది. స్థానికుల సమాచారం మేరకు ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కిరణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి పంచనామా చేశారు. బాధితుడికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఉప సర్పంచ్ కోరారు.