e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు నేడు ఇందూరులో ఊర పండుగ

నేడు ఇందూరులో ఊర పండుగ

కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహణ
సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

ఇందూరు, జూలై 24: పాడి పంటలు, ప్రజలంతా సల్లంగా ఉండేలా దీవించాలని వేడుకుంటూ యేటా ఆషాఢ మాసంలో జరిపే ఊర పండుగను (నేడు) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. పండుగ విశేష పదార్థంగా సరిని పట్టణంలో చల్లుతూ, పంటలపై, పశుసంపదపై, చెరువుల్లో కలుపనున్నారు. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వాళ్లే బోనం తీసుకుని పండుగను జరుపుకొన్నారు. కాగా ఈ సంవత్సరం కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు.
దశాబ్దాల నుంచి ఆనవాయితీగా..
1862-67 మధ్య కాలం నుంచి ఇందూరులో ఊర పండుగ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 80 ఏండ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి నిధులు సమకూర్చి ఊర పండుగను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్లో గత్తర (ప్లేగు) వ్యాధి సోకడంతో ఎంతోమంది చనిపోయారు. గ్రామదేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి పండుగను నిర్వహించడం ప్రారంభించారు. 60 ఏండ్లకుపైగా కుల సంఘాల ఆధ్వర్యంలో యేటా పండుగ నిర్వహిస్తున్నారు.
విగ్రహాల
ఊర పండుగ నిర్వహణ కమిటీ అయిన సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్దనున్న శారదాంబ గద్దె (తేలుమైసమ్మ గద్దె) వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, చెవిపోగుల ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజలు చేస్తారు. దేవతామూర్తుల ఊరేగింపు గాజుల్‌పేట్‌ చౌరస్తా మీదుగా పెద్దబజార్‌ చౌరస్తా వరకు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి డప్పులు, పోతరాజుల విన్యాసాలు, మహిళల పూనకాలతో ఒక బృందం పౌడాలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ, పులి, రాట్నం, ఆసు, తొట్లెలతో ఊరేగింపు దుబ్బవైపు వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లిగడి, గోల్‌ హనుమాన్‌ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌ ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహా లక్ష్మమ్మలతో వెళ్తుంది. సరిని నాలుగు గుల్లలుగా విభజిస్తారు. ఒక గుల్ల దుబ్బవైపు, రెండవది వినాయక్‌నగర్‌, మూడోది ఎల్లమ్మగుట్ట, నాల్గోది కంఠేశ్వర్‌ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్తుంది.
సరి ప్రత్యేకత..
ఊరపండుగలో ప్రత్యేకమైంది సరి. ఈ పదార్థాన్ని సిర్నాపల్లి గడిలో, వివేకానంద చౌరస్తాలో తయారు చేస్తారు. అమ్మవారికి పూజలు చేసిన తర్వాత సరిగుల్లను ఊరేగిస్తారు. ఈ సరిని పశువులు, పాకలు, ఇండ్లలో చల్లుతారు. దీని ద్వారా దుష్టశక్తులు పారిపోతాయని, రోగాలు రావని నమ్ముతారు. సరిని దక్కించుకునేందుకు పోటీపడుతారు. తోపులాట జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అమ్మవారికి ప్రతిరూపంగా తొట్లెలను ఊరేగిస్తారు. ఈ తొట్లెల కింద నుంచి వెళ్లేందుకు పోటీ పడతారు. వివేకానంద చౌరస్తాలో తయారు చేసిన సరి గాజుల్‌పేట్‌, దుబ్బ ప్రాంతాలకు వెళ్తుంది. సిర్నాపల్లి గడిలో తయారు చేసిన సరి సార్గలమ్మల దగ్గర ఉంచి ఈ సరి ఎల్లమ్మగుట్ట, వినాయక్‌నగర్‌, పెద్దబజార్‌, అనంతరం న్యాల్‌కల్‌లోని చెరువులో కలుపుతారు.
నగరంలో గ్రామీణ వాతావరణం..
మహిళలు పూనకాలతో, అమ్మవార్ల ప్రతిరూపమైన తొట్లెల కింద నుంచి వెళ్లేందుకు బారులు తీరుతారు. పలువీధులు, చౌరస్తాల్లో ప్రజలు మేకలు, గొర్రెలను, కోళ్లను బలిస్తూ కల్లు సాకలు పోస్తూ మొక్కులు తీర్చుకుంటారు. పండుగ రోజు పొలిమేర దాటి వెళ్లవద్దని అలా వెళ్తే అరిష్టమని భావించి వేరే ఊళ్లకు వెళ్లరు. దీనిని ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తారు. నగరంగా మారినా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గ్రామీణ సంస్కృతి ఇంకా ప్రతిబింబిస్తూనే ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana