బుధవారం 03 మార్చి 2021
Nizamabad - Feb 23, 2021 , 03:15:44

మంత్రి సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భీమ్‌గల్‌

మంత్రి సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భీమ్‌గల్‌

  • రూ.25 కోట్ల నిధులతో కొనసాగుతున్న పనులు
  • వాడవాడలా బీటీ, సీసీ రోడ్లు,  డైనేజీల నిర్మాణం
  • హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 22: అభివృద్ధిలో భీమ్‌గల్‌ పట్టణం దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో భీమ్‌గల్‌ మున్సిపల్‌గా అవతరించింది. పట్టణాభివృద్ధికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సహకారంతో మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి రూ.25 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో పట్టణాన్ని సుందరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మొదటగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్దపీట వేశారు. పట్టణంలోని 12 వార్డుల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అవసరమైన చోట బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. భీమ్‌గల్‌ మున్సిపల్‌ అభివృద్ధిపై మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పనుల్లో వేగం పుంజుకుంది. పట్టణ ప్రజల అవసరాల మేరకు వెజిటేబుల్‌, మటన్‌ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వైకుంఠధామాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. గతంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిషన్‌ భగీరథతో నీటి సమస్య పరిష్కారమైంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సుమారు మూడు వేల మొక్కలను నాటారు. వాటి సంరక్షణకు ప్రతి రోజూ నీటిని పోస్తున్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో సెంట్రల్‌ నర్సరీని ఏర్పాటు చేసి లక్షా నాలుగు వేల మొక్కలను పెంచుతున్నారు. గతంలో రాత్రి అయ్యిందంటే కాలనీ వాసులు బయటికి రావడానికి భయపడేవారు. కానీ ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో ప్రజలు నిర్భయంగా బయటికి వస్తున్నారు.

పట్టణం సుందరంగా మారింది

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో భీమ్‌గల్‌ సుందరంగా మారింది. మంత్రి సూచనలతో ప్రణాళికాబద్ధంగా ముం దుకు వెళ్తున్నాం. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ భీమ్‌గల్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

- మల్లెల రాజశ్రీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, భీమ్‌గల్‌

మౌలి వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశాం

నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపాలిటీ మంత్రి సహకారం తో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. పట్టణ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలను సిద్ధం చేశాం.

- గంగాధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, భీమ్‌గల్‌

VIDEOS

logo