జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రపై ఆన్లైన్లో వెల్లువెత్తుతున్న పిటిషన్లు
న్యూయార్క్, జూన్ 22: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ త్వరలో చేపట్టనున్న అంతరిక్ష యాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తిరిగి భూమ్మీదకు తిరిగి రావొద్దని వేలాది మంది ఆన్లైన్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. జూలైలో తమ సొంత సంస్థ ‘బ్లూ ఆరిజాన్’ చేపట్టబోయే మానవ సహిత రోదసి యాత్రలో జెఫ్ బెజోస్ తన సోదరుడితో కలిసి అంతరిక్ష యాత్రకు బయల్దేరనున్న విషయం తెలిసిందే. అయితే బెజోస్ ప్రకటన చేసినప్పుడు దీనిపై జోక్స్, మీమ్స్ రాగా.. ఇప్పుడు ఆ యాత్రపై విమర్శలు వస్తున్నాయి. ‘బిలియనీర్లు ఈ భూమి మీద గానీ, అంతరిక్షంలో గానీ ఉనికిలో ఉండకూడదు’ అంటూ ఒక పిటిషనర్ వ్యాఖ్యానించాడు. ఆన్లైన్ పిటిషన్లలో పాపులర్ వెబ్‌సైట్‌గా పేరున్న ‘చేంజ్.ఆర్గ్’లో ఇప్పటికే సుమారు 75 వేల మంది పిటిషన్‌పై సంతకాలు చేయడం గమనార్హం.