ఆపద్బంధువు డయల్ 100

పది నిమిషాల్లో ఘటనా స్థలానికి
లాక్డౌన్లో భారీగా పెరిగిన కాల్స్
గత ఏడాది నిజామాబాద్ జిల్లాలో 37,133, కామారెడ్డిలో 26,107 కాల్స్
నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, జనవరి 27:
అత్యవసర సమయంలో పోలీసుల సహాయం కోసం ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది డయల్ 100. ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజలకు చట్టబద్ధమైన పరిష్కారం లభిస్తున్నది. న్యాయపరంగా ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీసు సహాయాన్ని తీసుకునే అవగాహన ప్రజల్లో పెరిగింది. ఆపద సమయంలో క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల సమస్యను పరిష్కరిస్తున్నారు. దారిన వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అని వెళ్లిపోయే రోజులు పోయాయి. ఫోన్ చేసినా పోలీసులు స్పందిస్తారో లేదో అనే సందేహం గతంలో ఉండేది. ప్రస్తుతం పోలీసు వ్యవస్థపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడింది. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని పోలీసులు ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నారు. ఒకప్పుడు డయల్ 100కు ఫోన్ చేయాలంటే బాధితులు సైతం సందేహించేవారు. కానీ రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం నుంచి ప్రాపర్టీ నేరాల వరకు అన్నింటిపై క్షణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. అటు పోలీస్‌శాఖ నుంచి నిమిషాల్లోనే సేవలు అందుతుండడం డయల్ 100ను మరింత విస్తృతం చేసేందుకు ఉపయోగపడుతున్నది.
ప్రస్తుతం ‘డయల్ 100’ నంబరు తెలియని వారు లేరు. కామారెడ్డి జిల్లాలో గత ఏడాది ఈ సేవలను 12,107 మంది వినియోగించుకోగా ఈ ఏడాది 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 26,107 మంది సద్వినియోగం చేసుకున్నారు. నెలలో సగటున 2 వేల మంది 100కు డయల్ చేస్తున్నారు. ముఖ్యం గా పట్టణాల్లో వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. సమస్య పరిష్కారానికి చక్కటి వేదికగా మారింది. గతంలో డయల్ 100కు ఫోన్ చేస్తే సంబంధిత టౌన్ అధికారులకు, సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం వచ్చేది. ప్రస్తుతం బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ప్రత్యేకంగా ట్యాబ్‌లు ఇవ్వడంతో వాటి ద్వారా నేరుగా సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. సమస్య తీవ్రత మేరకు కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు రంగ ప్రవేశం చేస్తున్నారు. వివరాలు సేకరించి సమస్య పరిష్కారం కోసం కేసు నమోదుతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
లాక్డౌన్లో పెరిగిన కాల్స్
విపత్తులు, ఆపదల సమయంలో వెంటనే స్పందించే డయల్ 100 మరో బాధ్యతను స్వీకరించింది. ఫైర్, రోడ్డు, అగ్నిప్రమాద ఘటనలతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ముందుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఈ సమయంలో ప్రజలకు ఏదైనా సహాయం కావాలంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకునేలా చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో డయల్ 100ను సద్వినియోగం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఫేక్ కాల్స్ చేస్తే చర్యలు
ప్రధానంగా డయల్ 100కి చాలామంది పోకిరీలు కాల్ చేస్తున్నారు. అనవసరంగా కాల్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. ఇలాంటి పోకిరీల కాల్స్‌తో నిజమైన సమస్యలతో ఎవరైనా కాల్ చేసిన సమయంలో ఎంగేజ్ వస్తున్నది. ఇలాంటి పోకిరీలు కాల్ చేసి తమ సమయాన్ని, ప్రజల సమయాన్ని వృథా చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ అసలు డయల్ 100 పని చేస్తుందా లేదా డయల్ 100 ఏం చేస్తుంది అనే ఉత్సాహంతో ఫోన్‌చేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. డయల్ 100ను దుర్వినియోగం చేస్తే శిక్ష ఉంటుందని, అనవసరంగా కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి..
ప్రజలకు పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్నేండ్ల క్రితమే డయల్ 100 కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి ఫోన్‌కాల్ రికార్డు చేసి ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానాన్ని అనునిత్యం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డయల్ 100కు రోజూ 500కుపైగా కాల్స్ వస్తుంటాయి. ఇలా వస్తున్న ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్, రోడ్డు ప్రమాదాలు, దొంగతనం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులు సంబంధిత స్థలానికి పది నిమిషాల్లోనే వస్తుండడంతో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగింది. రోడ్డు ప్రమాదాలు, పబ్లిక్ న్యూసెన్స్, మహిళలపై వేధింపులు, ఇతర నేరాలు, ప్రాపర్టీ నేరాలు, ఆత్మహత్య ఇలా మొత్తంగా గత సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 37,133 కాల్స్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 26,107 కాల్స్ వచ్చాయి.
సత్వరం స్పందిస్తున్నాం..
డయల్ 100తో ప్రజలకు భద్రత కల్పిస్తున్నాం. పలురకాల సేవలు అందిస్తున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే పరిష్కరించేలా సిబ్బందిని ఆదేశిస్తున్నాం. సమస్య తీవ్రతను బట్టి ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా సేవలను అందిస్తున్నాం.
-శ్వేతారెడ్డి, కామారెడ్డి ఎస్పీ