శుక్రవారం 05 మార్చి 2021
Nizamabad - Jan 27, 2021 , 00:46:12

ప్రజాహితం.. ప్రభుత్వ ధ్యేయం

ప్రజాహితం.. ప్రభుత్వ ధ్యేయం

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు భేష్‌...

కరోనా  కట్టడిలో సమష్టిగా పోరాటం 

కాళేశ్వరంతో నిజామాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు స్థిరీకరణ...

గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రగతిని నివేదించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌, జనవరి 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జెండా పండుగను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సాదాసీదాగానే నిర్వహించారు. పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతించారు. సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. పోలీసుల కవాతు నిర్వహించారు. ముఖ్యమైన పథకాలపై అవగాహన కల్పించేందుకు శకటాలను ప్రదర్శించారు. ఇందులో వైద్యారోగ్య శాఖ శకటం అందరినీ ఆకట్టుకున్నది. ప్రభుత్వం అందిస్తున్న ప్రజాహిత కార్యక్రమాల అమలు, తీరుతెన్నులపై కలెక్టర్‌ వివరించారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం, ఆసరా పింఛన్లు, నిరంతర విద్యుత్‌, కేసీఆర్‌ కిట్‌, మత్స్యాభివృద్ధి, మిషన్‌ కాకతీయ, ‘డబుల్‌' ఇండ్ల పథకం, హరితహారం, కొవిడ్‌ -19 పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటుగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై గణాంకాలతో సహా వివరించారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..

రైతుబంధు పథకం ద్వారా 2లక్షల 44వేల 48 మంది రైతులకు ఎకరానికి రూ.5వేలు చొప్పున రూ.264.49 కోట్లు జమ చేశామని తెలిపారు. రైతుబీమా పథకంలో 320 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున రూ.16 కోట్లు మంజూరు చేశామన్నారు. పంట రుణ మాఫీ కింద రూ. 25వేలు రుణం తీసుకున్న 15,624 మంది రైతులకు రూ.19.99 కోట్లు మాఫీ చేసినట్లు వివరించారు. 2020 చివరి వరకు 6,014 వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తులు రాగా 2,804 మంజూరు చేశామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన జిల్లాలో వేర్వేరు నియోజకవర్గాల్లో ప్రతిపాదిత రెండు లక్షల ఎకరాలు స్థిరీకరించబడిందని, పను లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 33 చెక్‌డ్యాములు మంజూరుకాగా, రూ.198 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నామని చెప్పారు. వానకాలం 2020 సీజన్‌లో 5లక్షల 76వేల 67 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  సేకరించి, రూ.1,099 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

జిల్లాలో 249 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 16, 826 మంది జీవనోపాధి పొందుతుండగా, 880 చెరువుల్లో 4.24కోట్ల చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. ఎస్సారెస్పీలో 32.47లక్షల రొయ్యపిల్లలను వదిలినట్లు వివరించారు. గొర్రెల పంపిణీలో భాగంగా ఇప్పటివరకు రూ.13.78 కోట్ల విలువ గల 1103 యూనిట్లను లబ్ధిదారులకు అందించామన్నారు. జిల్లాలో పాడిపశువుల అభివృద్ధి కోసం 1804 యూనిట్లను రూ.14.43 కోట్ల రాయితీతో పాడిరైతులకు అందించినట్లు తెలిపారు. 40,704 కేసీఆర్‌ కిట్లను పంపిణీచేశామని తెలిపారు. 

2020-21లో కల్యాణలక్ష్మి పథకం ద్వారా 55,728 మందికి రూ.57.35 కోట్లు, షాదీముబారక్‌ ద్వారా 1131 మందికి రూ.11.32కోట్లు ఇచ్చామని తెలిపారు.

జిల్లాలో 11,956 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించగా, ఇందులో 10,406 ఇండ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయ న్నారు. 3,131 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

జిల్లా యంత్రాంగం కృషితో కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, జిల్లాలో లక్షా 42వేల 821 మంది నుంచి  నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించామన్నారు. 15,582 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వివరించారు. కొవిషీల్డ్‌ టీకాల పంపిణీ విజయవంతంగా చేపడుతున్నామన్నారు. జిల్లాలో 15,866 మందికి మొదటి విడుతలో టీకా వేయాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 8,985 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు గాను 4,963 మందికి టీకాలు ఇచ్చామని వివరించారు.

VIDEOS

logo