స్వచ్ఛ నగరం దిశగా..

ఖలీల్‌వాడి, జనవరి 24 : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నిజామాబాద్ కార్పొరేషన్ మొదటి స్థానం సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. మేయర్, కమిషనర్, ఎంహెచ్వో ఆధ్వర్యంలో నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. యువకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 60 డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను అందజేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. మున్సిపల్ వాహనంలోనే చెత్త వేయాలని సూచిస్తున్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయడంతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. బహిరంగ మలవిసర్జనను అరికట్టేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా 227 మరుగుదొడ్లు నిర్మించారు. ఏడు ట్రాక్టర్లు, 43 ట్రాలీ ఆటోల్లో నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాలనీల్లోని మురుగు కాల్వలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసి దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నారు.
స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం..
నగరంలోని అన్ని డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు సైతం కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.
-దండు నీతూ కిరణ్, మేయర్, నిజామాబాద్
ప్రథమ స్థానం కోసం కృషి
సిబ్బంది అన్ని డివిజన్లలో పనులు నిర్వహిస్తున్నారు. మైకుల ద్వారా ప్రచారం చేపడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నగరవాసులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నాం.
-జితేశ్ వీ పాటిల్, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్